WhatsApp: డీప్ ఫేక్ సమస్యకు వాట్సాప్ తో చెక్; త్వరలో ఫ్యాక్ట్ చెక్ హెల్ప్ లైన్ ప్రారంభం
WhatsApp to check deepfakes: డీప్ ఫేక్ ఇప్పుడు అత్యంత ఆందోళనకరంగా మారింది. లేటెస్ట్ గా ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఒక బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేస్తున్నట్లుగా కోహ్లీ డీప్ ఫేక్ వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు చెక్ పెట్టడానికి వాట్సాప్ ముందుకు వచ్చింది.
WhatsApp to check deepfakes: డీప్ ఫేక్ అనేది ఒక మానిప్యులేటెడ్ ఆడియో, వీడియో లేదా ఇతర డిజిటల్ కంటెంట్. టెక్నాలజీ సాయంతో ఒక వ్యక్తి వాస్తవికంగా వ్యవహరిస్తున్నట్లుగా ఆడియో - వీడియోలను రూపొందిస్తారు. వాస్తవంగా కనిపించే కంటెంట్ ను సృష్టించడానికి అధునాతన AI సాధనాలను ఉపయోగించి ఈ డీప్ ఫేక్ లను రూపొందిస్తారు.
వాట్సాప్ ప్రయత్నం
మిస్ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్ (Misinformation Combat Alliance (MCA) తో కలిసి, వాట్సాప్ (WhatsApp) యాజమాన్య సంస్థ మెటా ఈ డీప్ ఫేక్ వ్యతిరేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం త్వరలో వాట్సాప్ లో ప్రత్యేక ఫ్యాక్ట్ చెకింగ్ హెల్ప్ లైన్ ను ప్రారంభించనున్నారు. 2024 మార్చిలో ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి, ప్రజలను మోసగించే వీడియోలను రూపొందించడాన్ని అడ్డుకోవడం, అలాంటి డీప్ ఫేక్ (Deepfake) వీడియోలను ప్రజలు విశ్వసించకుండా అవగాహన కల్పించడం లక్ష్యంగా వాట్సాప్ ఈ హెల్ప్ లైన్ ను ప్రారంభిస్తోంది.
తెలుగు సహా 4 భాషల్లో..
మిస్ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్ (Misinformation Combat Alliance (MCA) భాగస్వామ్యంతో వాట్సాప్ త్వరలో ప్రారంభించే ఈ ఫ్యాక్ట్ చెక్ హెల్ప్ లైన్ ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ హెల్ప్ లైన్ ద్వారా యూజర్లు డీప్ ఫేక్ లను ఫ్లాగ్ చేసి వాట్సాప్ చాట్ బాట్ కు పంపించవచ్చు. వినియోగదారులు పంపించే అనుమానాస్పద డీప్ ఫేక్ కంటెంట్ ను అంచనా వేయడానికి, ధృవీకరించడానికి ఎంసీఏ (MCA) 'డీప్ ఫేక్ అనాలిసిస్ యూనిట్ (deepfake analysis unit)' ను ఏర్పాటు చేస్తుంది. ఇది ఫ్యాక్ట్ చెకింగ్ ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీ పార్ట్ నర్స్, డిజిటల్ ల్యాబ్ లతో కలిసి పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో డీప్ ఫేక్స్ ను గుర్తించడం,వాటిని నిరోధించడం, చట్టబద్ధ సంస్థలకు వాటి గురించి నివేదించడం, ప్రజలకు వాటిపై అవగాహన పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
డీప్ ఫేక్ హెల్ప్ లైన్ ఎలా పనిచేస్తుంది?
తప్పుడు సమాచారం వ్యాప్తిని ఎదుర్కోవడంలో పౌరులకు విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడానికిి వీలు కల్పించడం ఈ హెల్ప్ లైన్ ప్రధాన లక్ష్యం. డీప్ ఫేక్ హెల్ప్ లైన్ (deepfake helpline) ఎలా పనిచేస్తుందంటే.. ముందుగా యూజర్లు తమ దృష్టికి వచ్చిన డీప్ ఫేక్ వీడియోలను ఈ వాట్సాప్ హెల్ప్ లైన్ ను పంపించాల్సి ఉంటుంది. ఆ వీడియోలను ఎంసీఏ టీమ్ విశ్లేషించి, అది డీప్ ఫేక్ వీడియోనా ? కాదా? అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. అది డీప్ ఫేక్ అని తేలితే సంబంధిత దర్యాప్తు విభాగాలకు సమాచారం ఇవ్వడంతో పాటు తమ ప్లాట్ ఫామ్స్ పై ప్రచారం చేస్తుంది.