Rashmika Deep Fake Video : నటి రష్మిక డీప్ ఫేక్ వీడియో, గుంటూరు యువకుడు అరెస్టు-delhi heroine rashmika mandanna deepfake video case main culprit arrested in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rashmika Deep Fake Video : నటి రష్మిక డీప్ ఫేక్ వీడియో, గుంటూరు యువకుడు అరెస్టు

Rashmika Deep Fake Video : నటి రష్మిక డీప్ ఫేక్ వీడియో, గుంటూరు యువకుడు అరెస్టు

Bandaru Satyaprasad HT Telugu
Jan 20, 2024 05:14 PM IST

Rashmika Deep Fake Video : హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో కేసులో ఏపీకి చెందిన యువకుడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

రష్మిక డీప్ ఫేక్ కేసులో నిందితుడి అరెస్ట్
రష్మిక డీప్ ఫేక్ కేసులో నిందితుడి అరెస్ట్

Rashmika Deep Fake Video : హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నిందితుడ్ని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హీరోయిన్‌ రష్మిక డీప్‌ ఫేక్‌ క్రియేట్‌ చేసింది ఏపీలోని గుంటూరు చెందిన యువకుడిగా గుర్తించారు దిల్లీ పోలీసులు. ఏపీలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల క్రితం రష్మిక డీప్ ఫేక్ వీడియో సినీ పరిశ్రమలో కలకలం రేపింది. హీరోయిన్ రష్మికను అభ్యంతరకరంగా చూపిస్తూ... డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తాజాగా ఈ వీడియో చేసిన వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

రష్మిక ఫ్యాన్ పేజీ

నటి రష్మిక మందన డీప్ ఫేక్ ప్రొఫైల్స్ కేసులో ప్రధాన నిందితుడి అరెస్టుపై డీసీపీ ఐఎఫ్‌ఎస్‌ఓ యూనిట్ హేమంత్ తివారీ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఈమని నవీన్ (24) ఈ కేసులో ప్రధాన నిందితుడని గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. పోలీసుల తనిఖీల్లో నిందితుడి ల్యాప్‌టాప్, మొబైల్ సీజ్ చేశామన్నారు. అతడు తొలగించిన డేటాను రికవరీ చేస్తున్నామన్నారు. నవీన్ సినీ నటి రష్మిక మందన్నా ఫ్యాన్ పేజీని నడుపుతున్నాడని తెలిపారు. అతడు మరో ఇద్దరు ప్రముఖ సెలబ్రిటీల పేరుతో రెండు ఫ్యాన్ పేజీలను కూడా సృష్టించాడన్నారు. నవీన్ తన ఫాలోవర్లను పెంచడానికి ఇలా నకిలీ వీడియోను సృష్టించాడన్నారు. తదుపరి విచారణ జరుగుతోందని హేమంత్ తివారీ తెలిపారు.

ప్రధాన నిందితుడు తెలుగు కుర్రాడే!

గతేడాది నవంబర్ లో నటి రష్మిక మందన్నా డీప్‌ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్ల్యూయన్సర్‌ జరాపటేల్‌ వీడియోను మార్ఫింగ్ చేసి రష్మిక ముఖాన్ని పెట్టారు. తొలుత ఆ వీడియోలో ఉన్నది రష్మిక మందన్నా అనుకున్నారు. కానీ డీప్ ఫేక్ ద్వారా మార్ఫింగ్‌ చేసిన వీడియో అని గుర్తించి దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో గత రెండు నెలలుగా దర్యాప్తు చేసిన ముందు బిహార్‌కి చెందిన 19 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ యువకుడి సోషల్‌ మీడియా ఖాతా నుంచే వీడియో మొదటిగా అప్‌లోడ్‌ అయిందని పోలీసులు గుర్తించారు.

సెలబ్రిటీల ఆవేదన

రష్మిక డీప్ ఫేక్ వీడియో కలకలం తర్వాత...కత్రినా, అమితాబ్, ప్రియాంక చోప్రా, సచిన్ , అలియా భట్, ఇలా చాలా మంది ప్రముఖులు ఏఐ టెక్నాలజీకి బాధితులయ్యారు. ఏఐ టెక్నాలజీని చెడుకి ఉపయోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది. టెక్నాలజీని కట్టడి చేయాలని చాలా మంది కోరుతున్నారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లకు అనుగుణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద ప్రభుత్వం కఠినమైన నిబంధనలను తీసుకువస్తామని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. డీప్‌ఫేక్‌లు, తప్పుడు సమాచారం సమస్యగా మారుతున్నాయన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వం నిఘా ఉంచుతుందని మంత్రి అన్నారు.

Whats_app_banner