Team India in T20 world cup 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు వెళ్తే డేంజరే.. ఎందుకో చూడండి-t20 world cup 2024 if team india reaches semi final there will be no reserve day here is why ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India In T20 World Cup 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు వెళ్తే డేంజరే.. ఎందుకో చూడండి

Team India in T20 world cup 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు వెళ్తే డేంజరే.. ఎందుకో చూడండి

Hari Prasad S HT Telugu
May 15, 2024 07:25 PM IST

Team India in T20 world cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా సెమీ ఫైనల్ వెళ్తే ఓ ప్రమాదం పొంచి ఉంది. ఇండియన్ టీమ్ ఆడే సెమీఫైనల్ కు రిజర్వ్ డే లేకపోవడం గమనార్హం.

టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు వెళ్తే డేంజరే.. ఎందుకో చూడండి
టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు వెళ్తే డేంజరే.. ఎందుకో చూడండి (PTI)

Team India in T20 world cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024కు టైమ్ దగ్గర పడుతోంది. అయితే ఈ మెగా టోర్నీ ఫేవరెట్లలో ఒకటిగా అడుగుపెడుతున్న టీమిండియా సెమీఫైనల్ చేరుతుందో లేదో తెలియదు కానీ.. ఒకవేళ వెళ్తే మాత్రం ఓ ప్రమాదం పొంచి ఉంది. ఈఎస్పీఎన్ క్రికిన్ఫోలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. ఇండియా ఆడబోయే సెమీఫైనల్ కు రిజర్వ్ డే ఉండబోవడం లేదు.

టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా

టీమిండియా ప్రపంచంలో ఎక్కడికి వెళ్లి ఆడినా.. అది ఇండియాలోని ప్రేక్షకులకు టీవీల్లో అనుకూల సమయాల్లోనే మ్యాచ్ లు ఉండేలా చూస్తారు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2024లో అదే జరగబోతోంది. ఒకవేళ ఇండియా ఈ మెగా టోర్నీలో సెమీ ఫైనల్ కు వెళ్తే.. జూన్ 27న గయానాలో జరగబోయే రెండో సెమీస్ లో ఆడనుంది. దీని వెనుక ఐసీసీ పెద్ద వ్యూహమే ఉంది.

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం తొలి సెమీఫైనల్ జూన్ 26న ట్రినిడాడ్ లోని టరౌబాలో జరగనుంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అంటే ఇండియాలో అప్పుడు జూన్ 27 ఉదయం 6 గంటలకు అవుతుంది. ఈ సమయంలో భారత ప్రేక్షకులు మ్యాచ్ ను చూసే అవకాశాలు చాలా తక్కువ.

రెండో సెమీఫైనల్లో టీమిండియా

అందువల్ల టీమిండియా ఒకవేళ సెమీస్ చేరితే.. రెండో సెమీఫైనల్ ఆడేలా షెడ్యూల్ చేయనున్నారు. ఈ మ్యాచ్ అయితే జూన్ 27న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే అప్పుడు ఇండియాలో అదే రోజు రాత్రి 8 గంటలు అవుతుంది. ఓ టీ20 మ్యాచ్ చూడటానికి ఇండియాలో ఇదే సరైన సమయం.

అంతేకాదు ఫైనల్ కూడా ఇండియా ప్రేక్షకులకు అనుకూల సమయంలోనే ఉంది. ఈ మ్యాచ్ జూన్ 29న బార్బడోస్ లోని బ్రిడ్జ్‌టౌన్ లో ఉదయం 10 గంటలకు జరుగుతుంది. అంటే భారత కాలమానం ప్రకారం అదే రోజు రాత్రి 7.30 గంటలు. దీంతో టీవీ, డిజిటల్ వ్యూయర్షిప్ కు ఢోకా ఉండదు.

రిజర్వ్ డే లేని రెండో సెమీఫైనల్

అయితే టీమిండియా రెండో సెమీఫైనల్ ఆడాల్సి రావడమే కాస్త ఇబ్బందికర విషయం. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ లో తొలి సెమీఫైనల్, ఫైనల్ కు రిజర్వ్ డేలు ఉన్నా.. రెండో సెమీఫైనల్ కు మాత్రం లేదు. దీనికి కారణంగా ఆ మ్యాచ్ కు, ఫైనల్ కు మధ్య ఒకే రోజు గ్యాప్ ఉండటమే. రిజర్వ్ డే బదులు 250 నిమిషాల అదనపు సమయాన్ని ఐసీసీ కేటాయించింది.

అంతేకాదు సాధారణంగా మ్యాచ్ ఫలితం తేల్చడానికి కనీసం ఐదేసి ఓవర్లు ఆడించడం సాధారణమే. కానీ వరల్డ్ కప్ లో మాత్రం ఇది కనీసం పదేసి ఓవర్లుగా ఉంది. ఒకవేళ మ్యాచ్ సాధ్యం కాకపోతే అంతకుముందు సూపర్ 8 స్టేజ్ లో పైన ఉన్న జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒక సెమీఫైనల్ కు రిజర్వ్ డే ఇచ్చి మరోదానికి ఇవ్వకపోవడమేంటన్న విమర్శలు వస్తున్నాయి.

Whats_app_banner