Jaishankar : పాకిస్థాన్ పర్యటనకు జైశంకర్- దాశాబ్ద కాలంలో తొలిసారి ఇలా.. ఎందుకంటే!
India Pakistan relations : ఊహించని పరిణామం! పాకిస్థాన్‌లో జరగనున్న ఎస్సీఓ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొననున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఆయన ఇస్లామాబాద్‌కు బయలుదేరుతారు.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) కీలక సమావేశంలో పాల్గొనడానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ నెలలో పాకిస్థాన్‌లో పర్యటిస్తారని భారతదేశం శుక్రవారం ప్రకటించింది. ఇదే జరిగితే, దాదాపు దశాబ్ద కాలంలో పాకిస్థాన్‌లో పర్యటించిన తొలి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అవుతారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలలో ఒక మైలురాయిని సూచిస్తుంది. అయితే ఒక రోజు పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు ఉంటాయా? అన్న విషయంపై ఎటువంటి సమాచారం లేదు.
పాకిస్థాన్‌కు జైశంకర్..
అక్టోబర్ 15-16 తేదీల్లో పాకిస్థాన్ రాజధానిలో జరిగే ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశంలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించే ప్రతినిధి బృందానికి జైశంకర్ నేతృత్వం వహిస్తారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
“అక్టోబర్ 15,16 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరిగే ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి పాకిస్థాన్ కు తమ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తారు,” అని జైస్వాల్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
దివంగత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 2015 డిసెంబర్లో "హార్ట్ ఆఫ్ ఆసియా" ఫార్మాట్, ఆఫ్ఘనిస్తాన్పై దృష్టి సారించిన భద్రతా సదస్సు కోసం ఇస్లామాబాద్‌ను సందర్శించారు. పాకిస్తాన్ సీనియర్ నాయకులతో చర్చలు జరిపారు. చివరిసారిగా 2016 ఆగస్టులో దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) సమావేశానికి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు.
2015లో సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్‌లో పర్యటించిన కొద్ది రోజులకే ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 25న అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు లాహోర్‌లో ఆకస్మికంగా పర్యటించారు. 11 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని పాక్‌లో పర్యటించడం అదే తొలిసారి. అయితే ఆ వెంటనే పాక్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ భారత సైనిక స్థావరాలపై వరుస దాడులు చేయడంతో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి.
సార్క్ లేదా ఎస్సీఓ సంబంధిత సమావేశాల కోసం లేదా సింధు జలాల ఒప్పందం ఆధ్వర్యంలో సమావేశాల కోసం ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశం, పాకిస్థాన్ అధికారులు ఒకరి దేశాలను మరొకరు సందర్శిస్తూ వస్తున్నారు. పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ గత సంవత్సరం షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి గోవాను సందర్శించారు. మీడియా సమావేశంలో భుట్టో జర్దారీ భారతదేశాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన తరువాత ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్‌పై జైశంకర్ విరుచుకుపడ్డారు.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమావేశాల నేపథ్యంలో ద్వైపాక్షిక సమావేశాల ప్రణాళికలపై ప్రస్తుతానికి స్పష్టమైన ఆలోచన లేదని జైస్వాల్ పేర్కొన్నారు. ఈ పర్యటన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం కోసమేనని, అంతకుమించి ఏమీ లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఈ బృందంలో రెండో అత్యున్నత నిర్ణాయక సంస్థ అయిన ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశం కోసం మోదీని పాకిస్థాన్ ఆహ్వానించింది. ప్రధాని సాధారణంగా ఎస్సీఓ లేదా దేశాధినేతల సమావేశానికి మాత్రమే హాజరవుతారు.
భారత్- పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది జరిగే సమావేశానికి జైశంకర్ హాజరవుతారా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. తాజాగా అవి తొలగిపోయాయి.
పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా 2008లో ముంబై ఉగ్రదాడులకు పాల్పడిన తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చలు పూర్తిగా విచ్ఛిన్నమయ్యాయి. కానీ భారత్, పాకిస్థాన్ కలిసి పనిచేస్తున్న అరుదైన బహుళపక్ష సంస్థల్లో ఎస్సీఓ ఒకటి. ద్వైపాక్షిక అంశాలను లేవనెత్తడానికి ఎస్సీఓ చార్టర్ అనుమతించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం!
ఎస్సీఓలో చైనా, రష్యా, ఇరాన్, కజకిస్థాన్, కిర్గిజిస్తాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సైతం సభ్యదేశాలుగా ఉన్నాయి.
ఎస్సీఓ సమావేశానికి జైశంకర్‌ను పంపాలని నిర్ణయించడం ద్వారా భారత్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని ఇస్లామాబాద్‌లో భారత చివరి హైకమిషనర్‌గా, ఇరు దేశాల మధ్య సంబంధాలను నిశితంగా గమనిస్తున్న మాజీ రాయబారి అజయ్ బిసారియా అన్నారు.
“షాంఘై సహకార సంస్థ సమావేశానికి తమ విదేశాంగ మంత్రిని పంపడం ద్వారా సమస్యాత్మక సంబంధంలో స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు తన ఆకాంక్షను భారత్ తెలియజేసింది. బంతి ఇప్పుడు పాక్ కోర్టులో ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్థవంతమైన ద్వైపాక్షిక సమావేశాన్ని ప్రతిపాదించాలి,” అని అజయ్ అన్నారు.
సంబంధిత కథనం