Mann Ki Baat: మన్ కీ బాత్ 114వ ఎడిషన్ లో ‘వికాస్..విరాసత్’ ల ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన ప్రధాని మోదీ
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకోనుంది. సెప్టెంబర్ 29, ఆదివారం తన మన్ కీ బాత్ 114వ ఎపిసోడ్ లో ప్రధాని మోదీ దేశ అభివృద్ధి, దేశ వారసత్వ పరిరక్షణ అంశాలపై ప్రసంగించారు. వాటి ప్రాముఖ్యతను వివరించారు.
PM Modi: 114వ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే భారతదేశ వారసత్వాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన కీలక అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మన్ కీ బాత్ విజయాన్ని పరిశీలిస్తే.. దేశం గురించి సానుకూల పరిణామాలు, స్ఫూర్తిదాయకమైన కథలను ప్రజలు ఇష్టపడతారని 'మన్ కీ బాత్' నిరూపించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
'వికాస్ భీ, విరాసత్ భీ'
114వ మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ (narendra modi) దేశాభివృద్ధి, దేశ వారసత్వ పరిరక్షణ అంశాలను ఎంచుకున్నారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన అమెరికా నుంచి 300 భారతీయ పురాతన కళాఖండాలను భారతదేశానికి తిరిగి తీసుకురావడం గురించి మాట్లాడారు. ‘‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చాలా ఆప్యాయంగా డెలావేర్లోని తన వ్యక్తిగత నివాసంలో ఈ కళాఖండాలను నాకు చూపించారు. వాటిని టెర్రకోట, రాయి, దంతాలు, కలప, రాగి, కంచు మొదలైన వాటితో తయారు చేశారు. ఆ కళాఖండాలను తిరిగి మన దేశానికి అందించారు. మన వారసత్వం పట్ల మనం చాలా గర్వపడుతున్నాం’’ అని ప్రధాని మోదీ అన్నారు.
పురాతన భాషల పరిరక్షణ
డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంతరించిపోతున్న సంప్రదాయ భాషలను పరిరక్షించే విషయంపై కూడా ప్రధాని మోదీ ఈ మన్ కీ బాత్ లో మాట్లాడారు. ‘‘కొన్ని పురాతన భాషలు అంతరించిపోతున్నాయి. వాటిని ఇప్పుడు చాలా తక్కువ మంది ఉపయోగిస్తున్నారు. అలాంటి భాషల్లో మన 'సంతాలీ' భాష ఒకటి. డిజిటల్ ఇన్నోవేషన్ సాయంతో సంతాలీకి కొత్త గుర్తింపు ఇచ్చేందుకు క్యాంపెయిన్ ప్రారంభించాము’’ అని ప్రధాని తెలిపారు.
114వ మన్ కీ బాత్ లోని ఇతర ప్రధాన అంశాలు
- మన్ కీ బాత్ ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని భావోద్వేగంగా ప్రారంభించారు. 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పదేళ్లు అయిందని, అప్పటి నుంచి ఎగుమతులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయని, తద్వారా స్థానిక తయారీదారులు వృద్ధి చెందడానికి వీలవుతోందని ఆయన పేర్కొన్నారు.
- నవరాత్రులతో ప్రారంభమయ్యే పండుగల సీజన్ గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ.. ఈ పండుగల్లో 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
- ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో 'ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుపై ఒక చెట్టు)' కార్యక్రమం విజయవంతమైందని ప్రధాని మోదీ కొనియాడారు.
- స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి, దాని విజయం గురించి ప్రస్తావిస్తూ, ‘పునర్వినియోగం, రీసైకిలింగ్’ ప్రాముఖ్యతను ప్రజలు గ్రహించడం ప్రారంభించారని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
- ఘురారీ నదిని పునరుజ్జీవింపజేసిన ఝాన్సీ మహిళలను ప్రశంసించిన ప్రధాని మోడీ, స్వయం సహాయక సంఘాల విలువను నొక్కిచెప్పారు.
- గ్రామీణ స్థాయిలో జల సంరక్షణ ప్రయత్నాలకు మహిళలు నాయకత్వం వహించాలని, అందుకు వారు 'జల్ సహేలీ'గా మారాలనే పిలుపునిచ్చారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున నీటి సంరక్షణను నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన ఎత్తిచూపారు.
- మహాత్మాగాంధీ జయంతి అయిన అక్టోబర్ 2, స్వచ్ఛభారత్ అభియాన్ ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రధాని మోదీ అభినందించారు.