CSK IPL 2025 Retention List: ఎమోజీలతో రిటెన్షన్ ప్లేయర్లపై చెన్నై సూపర్ కింగ్స్ సంకేతాలు, ఆ ఐదుగురు ఆటగాళ్లు ఎవరంటే?
IPL 2025 Retention List: ఐపీఎల్ 2025 మెగా వేలం ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ.. ఆ జట్టు అభిమానుల బుర్రకి పనిపెట్టింది. గురువారం ఐదుగురు ప్లేయర్లతో రిటెన్షన్ జాబితాని ప్రకటించాల్సి ఉండగా.. ఒక్క రోజు ముందే ఎమోజీలతో చెన్నై ఫ్రాంఛైజీ హింట్ ఇచ్చేసింది.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అన్ని ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి అక్టోబరు 31లోపు సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఫ్రాంఛైజీలు అన్నీ ఇప్పటికే కసరత్తు చేసుకుని జాబితాని సిద్ధం చేసుకున్నాయి. అయితే.. ఆఖరి క్షణం వరకు ఏ ఫ్రాంఛైజీ లిస్ట్ ప్రకటించదు. ఒకవేళ ప్రకటిస్తే.. తమ రిటెన్షన్ వ్యూహాలను మార్చుకోవడానికి మిగిలిన ఫ్రాంఛైజీలకి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది.
అక్టోబరు 31 డెడ్ లైన్
కానీ.. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం డెడ్‌లైన్ కంటే ముందే ఎక్స్‌లో కొన్ని ఎమోజీలతో తాము రిటెన్ చేసుకునే ఆటగాళ్లపై సంకేతాలిచ్చింది. ఈ హింట్‌ను పట్టుకుని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు.. ఏ ఏ ప్లేయర్లని చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్ చేసుకోబోతోందో అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ రిటెన్షన్ గురించి ప్రస్తుతం ఎక్కువగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల గురించే అభిమానులు ఎక్కువగా చర్చించుకుంటున్నారు.
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ధోనీ
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ప్రతి ఫ్రాంఛైజీ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. వీరిలో ఐదుగురు ఆటగాళ్లు ఉండొచ్చు. కావాలంటే ఇందులో ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లని కూడా చేర్చుకోవచ్చు. దాంతో దాదాపుగా ఐదు ఫ్రాంఛైజీలు నలుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ని ఎంచుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇదే వ్యూహంతో రిటెన్షన్ ప్లేయర్ల జాబితాని సిద్ధం చేసింది. ఇందులో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా మహేంద్రసింగ్ ధోనీ కనిపిస్తున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ ఇది
క్లూ ఇచ్చిన చెన్నై
ఈ ఎమోజీలను చూస్తే మీకు ఏదైనా క్లూ దొరుకుతోందా? కాస్త జాగ్రత్తగా చూస్తే ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లని ప్రతిబింబించే కొన్ని ఎమోజీలు కనిపిస్తున్నాయి. అయితే.. అన్ని ఎమోజీలు ఆ ప్లేయర్‌ని ప్రతిబింబిచవు.. కొన్నింటితో మాత్రం ప్లేయర్లు మ్యాచ్ అవుతున్నారు
ఫస్ట్ ప్లేయర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. స్టార్ ప్లేయర్, ఫైర్ బ్రాండ్.
రెండో ప్లేయర్ శివమ్ దూబె, కండల వీరుడు, పవర్ హిట్టర్, టీమ్‌లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతుంటాడు
మూడో ప్లేయర్ - శ్రీలంక క్రికెటర్ మతీషా పతిరానా, ఫారెన్ ప్లేయర్ తన వేగంతో బ్యాటర్లని ఎక్కువగా క్లీన్ బౌల్డ్ చేస్తుంటాడు
నాలుగో ప్లేయర్ - మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, హెలికాప్టర్, టీమ్‌లో స్ట్రాటజిస్ట్
ఐదో ప్లేయర్ - రవీంద్ర జడేజా, గుర్రం స్వారీ, స్వార్డ్‌మ్యాన్‌షిప్
ఐపీఎల్ 2022లోనూ ఇలానే ఎమోజీలు
కానీ.. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు కూడా ఇదే తరహాలో ఎమోజీలను చెన్నై సూపర్ కింగ్స్ పోస్ట్ చేసింది. అప్పట్లో రవీంద్ర జడేజా, ధోనీ, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్లను సీఎస్కే రిటైన్ చేసుకుంది. మరి ఇప్పుడు ఎవరిని తీసుకుంటుందో చూడాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.
ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ తమ కెప్టెన్ రిషబ్ పంత్‌ను వేలానికి వదిలేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పంత్ వేలానికి వస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా పోటీలో నిలిచే అవకాశం ఉంది. 43 ఏళ్ల ధోనీ స్థానాన్ని పంత్ అయితే భర్తీ చేయగలడని చెన్నై ఫ్రాంఛైజీ ఆశపడుతోంది.