MS Dhoni: నీకేం తెలియదు ఊరుకో.. ధోనీకే స్టంపింగ్ రూల్స్ చెప్పిన సాక్షి!
MS Dhoni Wife Sakshi: అపారమైన క్రికెట్ నాలెడ్జ్ మహేంద్రసింగ్ ధోనీకి సొంతం. ఒక కెప్టెన్‌గానే కాదు, వికెట్ కీపర్‌గానూ అసాధారణ రికార్డులు తన పేరిట లిఖించుకున్న ధోనీకి బేసిక్ స్టంపింగ్ రూల్‌ని అతని భార్య సాక్షి నేర్పించిందట.
బ్యాటర్ క్రీజు నుంచి కదిలితే రెప్పపాటులో బెయిల్స్‌ని ఎగరగొట్టే మహేంద్రసింగ్ ధోనీ.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్‌గా ఉన్న ధోనీకి అతని భార్య సాక్షి.. స్టంపింగ్ రూల్స్ నేర్పించిందట. ఈ విషయాన్ని ధోనీనే స్వయంగా వెల్లడించాడు.
ధోనీ ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు.. ఇంట్లో నువ్వు, సాక్షి వాదనలకు దిగినప్పుడు ఫైనల్‌గా ఎవరు గెలుస్తారు? అని సరదాగా ఓ ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకి ధోనీ సమాధానం చెప్తూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఒక రోజు మ్యాచ్ చూస్తున్నప్పుడు సాక్షి ఒకానొక దశలో తనకి స్టంపింగ్ రూల్స్ తెలియవంటూ తేల్చేసిందని కూడా ధోనీ గుర్తు చేసుకున్నాడు.
ఇంట్లో వాదన మొదలైందిలా
‘‘ఒక రోజు మేము ఇద్దరం ఇంట్లో కూర్చుని మ్యాచ్ చూస్తున్నాం. అది వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్. సాధారణంగా మేం ఇంట్లో ఉంటే క్రికెట్ గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటాం. ఆరోజు ఆ మ్యాచ్‌లో బౌలర్ లెగ్ సైడ్ వైడ్ రూపంలో బంతి విసిరాడు. కానీ ఆ బంతిని అంచనా వేయలేకపోయిన బ్యాటర్ క్రీజు వెలుపలికి వెళ్లి షాట్ కోసం ప్రయత్నించాడు. అయితే ఆ బంతిని హిట్ చేయడంలో విఫలమవగా.. బంతిని అందుకున్న వికెట్ కీపర్ స్టంపౌట్ చేశాడు’’
‘‘స్టంపౌట్ కోసం ఆ టీమ్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్లు తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌కి నివేదించారు. వికెట్ కీపర్ బెయిల్స్ పడగొట్టే సమయానికి బ్యాటర్ క్రీజులో వెలుపలే ఉండటంతో థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. కానీ సాక్షి మాత్రం ఆ బ్యాటర్ నాటౌట్ అంటూ నాతో వాదించింది. దానికి కారణం ఆ బంతి వైడ్ కావడమేనని సాక్షి వాదన’’
లాస్ట్‌లో కూడా తప్పుని ఒప్పుకోని సాక్షి
‘‘నేను ఆ బ్యాటర్ ఔట్ అని చెప్తే.. మీకు ఏం తెలియదు ఊరుకోండి. కావాలంటే చూడండి అతడ్ని మళ్లీ అంపైర్లు వెనక్కి పిలుస్తారు అని నాతో వాదించడం మొదలెట్టింది. ఆ ఔటైపోయిన బ్యాటర్ నెమ్మదిగా నడుచుకుంటూ బౌండరీ లైన్ దాటేంత వరకు అలానే వాదిస్తూనే ఉంది. ఆ తర్వాత కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చిన తర్వాత కూడా ఆ స్టంపౌట్ విషయంలో ఏదో మిస్టేక్ అయ్యింది అంటూ తన వాదనని సమర్థించుకుంది’’ అంటూ ధోనీ గుర్తు చేసుకున్నాడు. క్రికెట్ రూల్స్ ప్రకారం బంతి వైడ్ అయినా స్టంపింగ్ ఉంటుంది.
ఐపీఎల్ 2025లో ధోనీ ఆడతాడా?
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీలు అన్నీ తాము రిటెన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాని అక్టోబరు 31 లోపు బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు నిబంధనల్లో చాలా మార్పులు జరిగాయి. ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించడానికి ఒక కొత్త రూల్‌ని కూడా తెరపైకి తీసుకొచ్చారు.
ఐదేళ్లు భారత్ జట్టుకి ఆడని ప్లేయర్‌ని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించబోతున్నారు. ఆ ప్లేయర్‌ను రిటెన్ చేసుకోవాలంటే రూ.4 కోట్లు చెల్లిస్తే చాలు. తన క్రికెట్ కెరీర్‌ను ఆస్వాదించాలని అనుకుంటున్నానంటూ ఇటీవల ధోనీ సంకేతాలివ్వగా.. మాకేం అభ్యంతరం లేదు అంటూ చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ కూడా ఇటీవల ప్రకటించాడు.