MS Dhoni IPL 2025: ఐపీఎల్ 2025లో ధోనీ ఆడటంపై అఫిషియల్ క్లారిటీ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో-former captain ms dhoni will play in ipl 2025 confirms csk ceo kasi viswanathan ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni Ipl 2025: ఐపీఎల్ 2025లో ధోనీ ఆడటంపై అఫిషియల్ క్లారిటీ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో

MS Dhoni IPL 2025: ఐపీఎల్ 2025లో ధోనీ ఆడటంపై అఫిషియల్ క్లారిటీ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో

Galeti Rajendra HT Telugu
Oct 27, 2024 06:30 AM IST

CSK IPL 2025: ఐపీఎల్ 2025లో ధోనీ ఆడతాడా? లేదా? గత కొంతకాలంగా జరుగుతున్న చర్చకి ఎట్టకేలకి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ నుంచి అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. అది కూడా ధోనీ సంకేతాలిచ్చిన రోజు వ్యవధిలోనే.

ధోనీ
ధోనీ

ఐపీఎల్ 2025లో మహేంద్రసింగ్ ధోనీ ఆడటంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశ్వీ విశ్వనాథన్ అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు అక్టోబర్ 31లోగా తాము రిటెన్షన్ చేసుకుంటున్న ఆటగాళ్ల జాబితాని బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది. ఐపీఎల్ 2025 వేలంకి ముందు రిటెన్షన్ నిబంధనల్లో చాలా మార్పులు జరిగిన విషయం తెలిసిందే.

ధోనీ కోసమే కొత్త రూల్

ఇటీవల జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో కొత్త రూల్ తెరపైకి తెచ్చారు. అంతర్జాతీయ క్రికెట్‌కి ఐదేళ్ల పాటు దూరంగా ఉన్న ఆటగాళ్లను ‘అన్‌క్యాప్డ్’ ప్లేయర్‌గా పరిగణించాలని నిబంధన చేర్చారు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరి మ్యాచ్ ఆడిన ధోనీ ఆ తర్వాత 2020 ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే.. ధోనీ కోసమే ఈ రూల్‌ని తీసుకొచ్చారని వాదనలు వినిపించాయి. ఈ రూల్ ప్రకారం ఇప్పుడు ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించొచ్చు.

సాధారణంగా ఇంటర్నేషనల్ ప్లేయర్‌ను ఐపీఎల్ ఫ్రాంఛైజీలు రిటెన్ చేసుకోవాలంటే భారీ ధరని వెచ్చించక తప్పదు. అయితే.. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ అయితే.. ఇప్పుడున్న రూల్ ప్రకారం రూ.4 కోట్లతోనే రిటెన్ చేసుకోవచ్చు.

ధోనీ ధర.. రూ.4 కోట్లే

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు 10 ఫ్రాంచైజీలు ఆరుగురు ఆటగాళ్లను రిటెన్ చేసుకోవచ్చు. ఇందులో రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డు కూడా ఉంది. అంటే ఐదుగురు ఆటగాళ్లని డైరెక్ట్‌గా రిటెన్ చేసుకోవచ్చు.. ఒకరిని మాత్రం వేలం సమయంలో మళ్లీ కావాలనుకుంటే ఆర్టీఎం కార్డు వాడి వేలంలో పలికిన ధరకి అట్టిపెట్టుకోవచ్చు.

ఓవరాల్‌గా వేలానికి ప్రతి ప్రాంఛైజీకి రూ .120 కోట్లు కేటాయించగా.. ఇందులో రూ .75 కోట్లు రిటెన్షన్ కోసం ఫ్రాంఛైజీలు ఖర్చు చేసుకునే వెసులబాటు ఉంది. ఒకవేళ ఐదుగురు ఆటగాళ్లని రిటెన్ చేసుకోవాలని అనుకుంటే.. వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు, రూ.18 కోట్లు, రూ.14 కోట్లు ఇలా ప్రాధాన్యక్రమంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఉంటే కేవలం రూ.4 కోట్లు చెల్లిస్తే చాలు.

ఒక్క రోజులో క్లారిటీ

ఐపీఎల్ 2025లో ఆడటం గురించి ఇటీవల ధోనీ మాట్లాడుతూ.. ‘‘కెరీర్ చివరి దశలోనూ క్రికెట్‌ను ఆస్వాదించాలని అనుకుంటున్నాను. ఇది అంత సులువు కాదు. కానీ నేను గేమ్‌ను ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో ఆడటంపై ధోనీ సంకేతాలు ఇవ్వడంతో ఒక్క రోజు వ్యవధిలోనే చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ కూడా స్పందించారు. ‘‘ధోనీ సిద్ధంగా ఉన్నప్పుడు మాకు ఇంకేం కావాలి. మేం హ్యాపీగా ఉన్నాం’’ అని చెప్పుకొచ్చారు.

వాస్తవానికి గత ఐదేళ్లుగా కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న ధోనీ.. తన ఫిట్‌నెస్‌ని కాపాడుకోవడం పెద్ద ఛాలెంజ్. ఐపీఎల్ 2024లో 43 ఏళ్ల వయసులోనూ వికెట్ల వెనుక ఉత్సాహంగా ఉన్నా.. పాత వెన్నునొప్పి గాయం, మోకాలి గాయం ధోనీని ఇబ్బంది పెడుతున్నాయనేది వాస్తవం. దాంతో ఐపీఎల్ 2025లో ధోనీ ఆడటం కష్టమని మాజీలు ఇన్నాళ్లు చెప్తూ వచ్చారు. కానీ.. ఫిట్‌నెస్ సాధించి ఆడతానని క్లారిటీ ఇచ్చేశాడు.

Whats_app_banner