Dwayne Bravo: చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్రావో గుడ్‌బై.. గంభీర్ స్థానాన్ని భర్తీ చేయబోతున్న విండీస్ మాజీ ఆల్ రౌండర్-dwayne bravo leaves chennai super kings he is now kolkata knight riders mentor in place of gautham gambhir ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Dwayne Bravo: చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్రావో గుడ్‌బై.. గంభీర్ స్థానాన్ని భర్తీ చేయబోతున్న విండీస్ మాజీ ఆల్ రౌండర్

Dwayne Bravo: చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్రావో గుడ్‌బై.. గంభీర్ స్థానాన్ని భర్తీ చేయబోతున్న విండీస్ మాజీ ఆల్ రౌండర్

Hari Prasad S HT Telugu
Sep 27, 2024 02:50 PM IST

Dwayne Bravo: డ్వేన్ బ్రావో చెన్నై సూపర్ కింగ్స్ కు గుడ్ బై చెప్పాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచి అతడు కోల్‌కతా నైట్ రైడర్స్ తో తన కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాడు. ఈ విషయాన్ని కేకేఆర్ ఫ్రాంఛైజీ వెల్లడించింది.

చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్రావో గుడ్‌బై.. గంభీర్ స్థానాన్ని భర్తీ చేయబోతున్న విండీస్ మాజీ ఆల్ రౌండర్
చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్రావో గుడ్‌బై.. గంభీర్ స్థానాన్ని భర్తీ చేయబోతున్న విండీస్ మాజీ ఆల్ రౌండర్ (Twitter)

Dwayne Bravo: వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఇక తన క్రికెట్ కెరీర్ మొత్తానికీ గుడ్ బై చెప్పేశాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ వారం మొదట్లో తన కెరీర్లోనే చివరి మ్యాచ్ ఆడేసిన అతడు.. ఇక క్రికెట్ ఫీల్డ్ లోకి దిగనని చెప్పాడు. అంతేకాదు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను వదిలేసి డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో చేతులు కలిపాడు.

గంభీర్ స్థానంలో బ్రావో

కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గా ఈ ఏడాది ఆ జట్టుకు మూడో ట్రోఫీ సాధించి పెట్టాడు గౌతమ్ గంభీర్. ఆ వెంటనే అతనికి టీమిండియా హెడ్ కోచ్ పదవి దక్కడంతో కేకేఆర్ కు గుడ్ బై చెప్పాడు. ఇప్పుడతని స్థానంలోకి డ్వేన్ బ్రావో వచ్చాడు. అతనికి వెల్‌కమ్ చెబుతూ శుక్రవారం (సెప్టెంబర్ 27) కేకేఆర్ ఫ్రాంఛైజీ ఓ ట్వీట్ చేసింది.

నిజానికి ఈ ఏడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్ మొత్తం ఆడాల్సి ఉన్నా.. గజ్జల్లో గాయం కారణంగా అతడు ముందుగానే ఇక క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. ఈ లీగ్ లో ఓ క్యాచ్ పడుతూ బ్రావో గాయపడ్డాడు. అయితే సీపీఎల్లో తనకు చెందిన ఫ్రాంఛైజీలో 9 ఏళ్ల పాటు ఆడిన బ్రావోకు ఐపీఎల్లో తమ జట్టు మెంటార్ బాధ్యతలు అప్పగించింది నైట్ రైడర్స్ మేనేజ్‌మెంట్. కేకేఆర్ కే కాదు.. అన్ని నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీలకు కూడా బ్రావో మెంటార్ బాధ్యతలు చేపట్టనున్నాడు.

"డ్వేన్ బ్రావో మాతో చేరడం చాలా ఉత్సాహకరమైన విషయం. ఎప్పుడూ గెలవాలన్న తపన, అతనికి ఉన్న అనుభవం, క్రికెట్ నాలెడ్జ్ మా ఫ్రాంఛైజీ, ప్లేయర్స్ కు ఎంతగానో ఉపయోగపడనుంది" అని నైట్ రైడర్స్ గ్రూప్ సీఈవో వెంకీ మైసూర్ అన్నారు. ఐపీఎల్ తోపాటు సీపీఎల్, ఎంఎల్‌సీ, ఐఎల్‌టీ20 లీగ్ లలోనూ నైట్ రైడర్స్ టీమ్స్ కు బ్రావోనే మెంటార్ గా ఉంటాడని కూడా ఆయన వెల్లడించారు.

నాకు చాలా గౌరవం ఉంది

ఇక కేకేఆర్ కొత్త మెంటార్ గా బాధ్యతలు చేపట్టిన డ్వేన్ బ్రావో కూడా తన కొత్త పదవిపై స్పందించాడు. "సీపీఎల్లో భాగంగా నేను ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టుతో గత పదేళ్లుగా ఉన్నాను. నైట్ రైడర్స్ కోసం ఆడటంతోపాటు ప్రత్యర్థిగా కూడా వాళ్లతో తలపడ్డాను. వాళ్లు జట్టును నడిపే విధానాన్ని నేను గౌరవిస్తాను.

కుటుంబ వాతావరణం, యజమానుల అభిరుచి, ప్రొఫెషనలిజం ఈ ఫ్రాంఛైజీని ప్రత్యేకంగా నిలుపుతుంది. ఓ ప్లేయర్ నుంచి మెంటారింగ్, కోచింగ్ వైపు వెళ్లడానికి నాకు ఇంతకుమించిన ప్లాట్‌ఫామ్ దొరకదు" అని బ్రావో అన్నాడు.

ఐపీఎల్లో బ్రావో ఇలా..

ఐపీఎల్లో మొదటి మూడు సీజన్ల పాటు డ్వేన్ బ్రావో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత 2011 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తో కొనసాగుతున్నాడు. మధ్యలో రెండేళ్ల పాటు ఆ జట్టును సస్పెండ్ చేసిన సమయంలో గుజరాత్ లయన్స్ తరఫున బరిలోకి దిగాడు.

2022లో ఐపీఎల్ నుంచి తప్పుకున్నా బ్రావో.. అదే చెన్నై సూపర్ కింగ్స్ కు బౌలింగ్ కోచ్ అయ్యాడు. ఐపీఎల్లో అతడు 183 వికెట్లు తీసుకోవడం విశేషం. ఒకే సీజన్లో అత్యధికంగా 32 వికెట్లు తీసుకున్న రికార్డు కూడా బ్రావో సొంతం. ఇప్పుడతడు చెన్నై సూపర్ కింగ్స్ తో ఎన్నో ఏళ్ల అనుబంధానికి తెరదించుతూ.. కేకేఆర్ తో కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నాడు.