Gautham Gambhir KKR: కేకేఆర్‌కు గంభీర్ ఎమోషనల్ గుడ్‌బై.. స్పెషల్ వీడియో రిలీజ్.. ఏమన్నాడంటే?-gautham gambhir emotional good bye to kkr after appointed as team india head coach ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gautham Gambhir Kkr: కేకేఆర్‌కు గంభీర్ ఎమోషనల్ గుడ్‌బై.. స్పెషల్ వీడియో రిలీజ్.. ఏమన్నాడంటే?

Gautham Gambhir KKR: కేకేఆర్‌కు గంభీర్ ఎమోషనల్ గుడ్‌బై.. స్పెషల్ వీడియో రిలీజ్.. ఏమన్నాడంటే?

Hari Prasad S HT Telugu

Gautham Gambhir KKR: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కేకేఆర్ టీమ్ కు ఎమోషనల్ గుడ్ బై చెప్పాడు. ఈ సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేస్తూ.. కోల్‌కతా అభిమానులకు అంకితమిచ్చాడు.

కేకేఆర్‌కు గంభీర్ ఎమోషనల్ గుడ్‌బై.. స్పెషల్ వీడియో రిలీజ్.. ఏమన్నాడంటే? (AFP)

Gautham Gambhir KKR: కేకేఆర్ అంటే గంభీర్.. గంభీర్ అంటే కేకేఆర్ అన్నట్లుగా ఐపీఎల్లో రెండుసార్లు కెప్టెన్ గా, ఒకసారి మెంటార్ గా ఆ టీమ్ ను విజేతగా నిలిపాడతడు. ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ గా కొత్త బాధ్యతలు స్వీకరించడంతో తనను ఎంతగానో ఆదరించిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు అతడు ఎమోషనల్ గుడ్ బై చెప్పాడు. ఈ సందర్భంగా ఈడెన్ గార్డెన్స్ నుంచి ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశాడు.

కోల్‌కతాకు గంభీర్ గుడ్‌బై

కోల్‌కతాతో గంభీర్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆ జట్టును 2012, 2014లలో కెప్టెన్ గా రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపిన అతడు.. ఈసారి మెంటార్ గా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. ఇక ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ గా మరింత ఉన్నతమైన బాధ్యతలు స్వీకరించాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఓ వీడియో చేసి అక్కడి అభిమానులకు వీడ్కోలు పలికాడు.

ఈ వీడియోను మంగళవారం (జులై 16) రాత్రి తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. "కోల్‌కతా నాతో కలిసి రా.. మనం కొత్త వారసత్వాలను సృష్టిద్దాం. కోల్‌కతా, కేకేఆర్ అభిమానులకు అంకితమిస్తున్నాను. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కు ప్రత్యేక ధన్యవాదాలు" అనే క్యాప్షన్ తో కేకేఆర్ టీమ్, షారుక్ ఖాన్, ఇండియన్ క్రికెట్ టీమ్ అకౌంట్లను ట్యాగ్ చేశాడు.

మీరు నవ్వితే నవ్వుతాను: గంభీర్

ఇక ఆ వీడియో ఈడెన్ గార్డెన్స్ లో మొదలవుతుంది. బ్యాక్‌గ్రౌండ్లో ఐపీఎల్ 2024లో గంభీర్ ప్రయాణానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను చూపిస్తుండగా.. అతడు భావోద్వేగంతో మాట్లాడాడు.

"మీరు నవ్వితే నేను నవ్వుతాను. మీరు ఏడిస్తే నేను ఏడుస్తాను. మీరు గెలిస్తే నేను గెలుస్తాను. మీరు ఓడితే నేను ఓడుతాను. మీరు కల కంటే నేను కల కంటాను. మీరు సాధిస్తే నేను సాధిస్తాను. మిమ్మల్ని నమ్ముతాను. కోల్‌కతా నేను మీలో ఒకడిని. మీ కష్టాలు నాకు తెలుసు. ఎక్కడ బాధ కలుగుతుందో తెలుసు.

తిరస్కరణలు నన్నూ బాధించాయి. కానీ మీలాగే నమ్మకంతో నేనూ పైకి లేచాను. ప్రతి రోజూ ఓడతాను. కానీ మీలాగే నేను ఓటమి అంగీకరించను. పాపులర్ కావాలని అంటారు. కానీ నేను విన్నర్ కావాలని అంటాను. ఈ కోల్‌కతా గాలి నాతో మాట్లాడుతుంది. ఇక్కడి శబ్దాలు, వీధులు, ట్రాఫిక్ జామ్స్.. అన్నీ మీరు ఎలా ఫీలవుతున్నారో నాకు చెబుతాయి. మీరు చెప్పేది నేను వింటాను. మీరు ఎమోషనల్ గా ఉన్నారని నాకు తెలుసు. నేను కూడా అలాగే ఉన్నాను. కోల్‌కతా మనది విడదీయలేని బంధం. మనది ఓ స్టోరీ, మనది ఓ టీమ్" అని గంభీర్ అంటాడు.

కేకేఆర్ ను కెప్టెన్ గా 2012, 2014లలో విజేతగా నిలిపిన గంభీర్ ను గతేడాది చివర్లో మరోసారి ఆ ఫ్రాంఛైజీ మెంటార్ గా నియమించింది. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గంభీర్ మూడో టైటిల్ అందించాడు. ఇక ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ లాంటి అత్యున్నత బాధ్యతలు రావడంతో కేకేఆర్ కు వీడ్కోలు చెప్పక తప్పలేదు. ఈ నెల చివర్లో ప్రారంభం కాబోయే శ్రీలంక పర్యటనతో ఇండియన్ టీమ్ తో గంభీర్ ప్రయాణం మొదలు కానుంది.