MS Dhoni IPL Future: ధోనీ ఐపీఎల్ భవిష్యత్తు తేలేది ఆ రోజే.. కన్ఫమ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో-ms dhoni ipl future chennai super kings ceo revealed october 31st deadline ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni Ipl Future: ధోనీ ఐపీఎల్ భవిష్యత్తు తేలేది ఆ రోజే.. కన్ఫమ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో

MS Dhoni IPL Future: ధోనీ ఐపీఎల్ భవిష్యత్తు తేలేది ఆ రోజే.. కన్ఫమ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో

Hari Prasad S HT Telugu

MS Dhoni IPL Future: ఐపీఎల్లో ధోనీ కొనసాగుతాడా లేదా? చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మరో సీజన్ ఆడనున్నాడా? ఈ ప్రశ్నలకు త్వరలోనే జవాబు దొరకనుంది. అక్టోబర్ 31లోపు ధోనీ ఈ విషయం వెల్లడించనున్నాడని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ చెప్పారు.

ధోనీ ఐపీఎల్ భవిష్యత్తు తేలేది ఆ రోజే.. కన్ఫమ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో (AFP)

MS Dhoni IPL Future: ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై కీలక విషయం వెల్లడించారు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్. ఐపీఎల్ 2025 రిటెన్షన్, వేలం దగ్గర పడుతున్న వేళ వచ్చే సీజన్లో ఎమ్మెస్డీ ఆడతాడా లేదా అన్నదానిపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. ప్లేయర్స్ రిటెన్షన్ డెడ్ లైన్ అయిన అక్టోబర్ 31లోపు తన భవిష్యత్తు గురించి ధోనీ చెప్పనున్నాడని సీఎస్కే సీఈవో తెలిపారు.

ధోనీ భవిష్యత్తు తేలేది ఆ రోజే

ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అంటూ గత మూడు సీజన్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అతడు మాత్రం ఒక్కో సీజన్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. వచ్చే ఏడాది కూడా ధోనీ.. సీఎస్కే తరఫున బరిలోకి దిగబోతున్నాడన్న వార్తల నేపథ్యంలో ఆ ఫ్రాంఛైజీ సీఈవో ఓ కీలక విషయాన్ని వెల్లడించాడు.

"ధోనీ మా సీఎస్కే తరఫున ఆడాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ ధోనీ ఇప్పటి వరకూ మాకు ఏ విషయం చెప్పలేదు. అక్టోబర్ 31లోపు చెబుతాను అని ధోనీ మాతో చెప్పాడు. అతడు ఆడతాడనే మేము అనుకుంటున్నాం" అని స్పోర్ట్స్ వికటన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాశీ విశ్వనాథన్ చెప్పారు.

ధోనీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా..

నిజానికి ధోనీ కోసమే అన్‌క్యాప్డ్ ప్లేయర్ నిబంధనను మార్చారని కూడా వార్తలు వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై ఐదేళ్లు పూర్తయిన ఇండియన్ క్రికెటర్లను అన్‌క్యాప్డ్ గా గుర్తించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇది ధోనీ కోసమే అని మాజీ క్రికెటర్లు కూడా ఓపెన్ గా చెప్పారు.

దీనివల్ల ధోనీని కేవలం రూ.4 కోట్లకే చెన్నై సూపర్ రిటెయిన్ చేసుకొనే అవకాశం దక్కింది. దీంతో స్టార్ ప్లేయర్స్ పైన ఆ టీమ్ భారీగా వెచ్చించి రిటెయిన్ చేసుకోవచ్చు. తనకు డబ్బు ముఖ్యం కాదని, టీమ్ అవసరాలే ముఖ్యమంటూ ధోనీ కూడా దీనికి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

అయితే 43 ఏళ్ల వయసులో, తరచూ మోకాలి గాయానికి గురవుతున్న సమయంలో మరో సీజన్ ఐపీఎల్లో అతడు కొనసాగగలడా అన్నదే అసలు ప్రశ్న. నిజానికి అతడు సీఎస్కేతోపాటు ఐపీఎల్ కు కూడా గుడ్ బై చెప్పి టీ10 లీగ్స్ పై దృష్టి సారించనున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఎప్పటిలాగే ధోనీ మాత్రం వీటిపై స్పందించకుండా తన పని తాను చేసుకెళ్తున్నాడు. కానీ సీఎస్కే సీఈవో కామెంట్స్ బట్టి చూస్తే ధోనీ ఆడతాడా లేదా అన్నది మాత్రం అక్టోబర్ 31లోపు తేలిపోనుంది.