IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడుతున్న రిషబ్ పంత్‌పై కన్నేసిన ఆర్సీబీ.. రేసులో చెన్నై, పంజాబ్ కూడా!
Rishabh Pant IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 వేలానికి రిషబ్ పంత్ రాబోతున్నాడా? చెన్నై నుంచి క్రేజీ ఆఫర్ రావడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడాలని ఈ వికెట్ కీపర్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే.. వేలంలో అతని కోసం మూడు ఫ్రాంఛైజీలు గట్టిగా పోటీపడతాయి.
ఐపీఎల్ 2025 మెగా వేలం ముంగిట ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్‌లోని ఫ్రాంఛైజీలు అన్నీ అక్టోబరు 31లోపు తాము రిటెన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి సమర్పించాల్సి ఉండగా.. ఫ్రాంఛైజీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ను వీడాలని భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పంత్‌కి ఆఫర్
సుదీర్ఘకాలంగా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి రిషబ్ పంత్ ఆడుతున్నాడు. కానీ.. ఇటీవల అతనికి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వయసురీత్యా ఐపీఎల్ 2025లో ఆడటంపై సందిగ్ధత నెలకొంది. దాంతో ధోనీ వారసుడిగా రిషబ్ పంత్‌ని తయారు చేసుకోవాలని చెన్నై ఫ్రాంఛైజీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రుతురాజ్ గైక్వాడ్‌కి చెన్నై పగ్గాలు అప్పగించినా.. అతను ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే.
పంత్‌పై చెన్నై, బెంగళూరు, పంజాబ్ కన్ను
చెన్నై సూపర్ కింగ్స్ నుంచి క్రేజీ ఆఫర్ రావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ను వీడాలని రిషబ్ పంత్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ఒకవేళ వేలానికి వస్తే.. చెన్నైతో పాటు తామూ పోటీపడాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలానే పంజాబ్ కింగ్స్ కూడా సరైన కెప్టెన్ కోసం ఎదురుచూస్తున్నాయి.
ఈ మూడు ఫ్రాంఛైజీలు వేలంలో రిషబ్ పంత్ కోసం పోటపడితే అతనికి భారీ ధర దక్కే అవకాశం ఉంది. లెప్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడం, వికెట్ కీపర్, కెప్టెన్ రూపంలో అదనపు సౌలభ్యం ఉండటంతో పంత్ కోసం భారీ ధరనైనా వెచ్చించేందుకు ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయి.
పంత్ ఐపీఎల్ రికార్డులు
ఇప్పటి వరకు 111 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన రిషబ్ పంత్ 148.93 స్ట్రైక్ రేట్‌తో 3,284 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే రిషబ్ పంత్.. భారత్ జట్టులోనూ మూడు ఫార్మాట్లలో కీలకమైన ప్లేయర్‌గా ఎదిగాడు. దాంతో అతనికి ఉన్న క్రేజ్ దృష్ట్యా వేలానికి వస్తే భారీ ధర పలికే అవకాశం ఉంది. ఇటీవల తాను వేలానికి వస్తే ఎంత ధరకి అమ్ముడుపోతాను? అంటూ పంత్ సరదాగా ట్వీట్ చేసినా.. అది సంకేతమని ఇప్పుడు అర్థమవుతోంది.