Azharuddin on WC Team: శ్రేయస్ తుది జట్టులో ఉండాల్సిందే.. శుభ్‌మన్ గిల్ కీ ప్లేయర్: వరల్డ్ కప్ టీమ్‌పై అజర్
Azharuddin on WC Team: శ్రేయస్ తుది జట్టులో ఉండాల్సిందే. శుభ్‌మన్ గిల్ వరల్డ్ కప్ లో కీ ప్లేయర్ కాబోతున్నాడని టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ అన్నాడు.
Azharuddin on WC Team: వరల్డ్ కప్ లో టీమిండియా తుది జట్టులో శ్రేయస్ అయ్యర్ ఉండాల్సిందేనని అన్నాడు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్. స్వదేశంలో వరల్డ్ కప్ ఆడబోతున్న ఇండియాపై ఒత్తిడి ఉంటుందని కూడా చెప్పాడు. వరల్డ్ కప్ నేపథ్యంలో అతడు పీటీఐతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తుది జట్టుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
గాయంతో చాలా కాలం పాటు దూరమైన శ్రేయస్ అయ్యర్.. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో సెంచరీతో మళ్లీ గాడిలో పడిన విషయం తెలిసిందే. అయితే మరోవైపు ఇషాన్ కిషన్ ఇప్పటికే టీమ్ లో నిలదొక్కుకోవడం, అటు సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ కూడా ఫామ్ లోకి రావడంతో తుది జట్టులో పోటీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో నాలుగో స్థానంలో ఎవరు అన్న చర్చకు తెరలేసింది.
శ్రేయస్ ఉండాల్సిందే..
"మంచి కాంపిటిషన్ ఉంటే.. అది ప్లేయర్స్ లోని అత్యుత్తమ ఆటను వెలికి తీస్తుంది. శ్రేయస్ మంచి బ్యాటర్. రెండో వన్డేలో అద్భుతంగా ఆడాడు. ప్రతిసారీ సానుకూలంగా ఉంటూ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తాడు. మ్యాచ్ పై మంచి ప్రభావం చూపగలడు. అతన్ని కాదని మరో ప్లేయర్ వైపు చూడలేం. ఓ లెఫ్ట్ హ్యాండర్ కావాలని అనుకుంటేనే ఇషాన్ కిషన్ వైపు చూడాలి. కానీ శ్రేయసే బెటరని నేనంటాను" అని పీటీఐతో మాట్లాడుతూ అజర్ అన్నాడు.
అశ్విన్‌ను తీసుకోవాలి..
ఇక సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ను 15 మంది సభ్యుల జట్టులోకి తీసుకోవాలని అజర్ సూచించాడు. "అశ్విన్ జట్టులో ఉండాలి. అతని దగ్గర చాలా వేరియేషన్స్ ఉండటం వల్ల ఆడటం అంత సులువు కాదు. టీమ్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే అక్షర్ ఉంటాడో లేదో చూడాలి. ఇద్దరు లెఫ్టామ్ స్పిన్నర్ల కంటే అశ్విన్ ను తీసుకుంటే బ్యాటింగ్ కూడా చేయగలడు. అతడు జట్టులో ఉండాలి" అని అజర్ అన్నాడు.
గిల్ కీ ప్లేయర్
రానున్న వరల్డ్ కప్ లో శుభ్‌మన్ గిల్ ఇండియాకు కీలకం కాబోతున్నాడని, అతడు మంచి స్టార్ట్ ఇస్తే బాగుంటుందని అజర్ అభిప్రాయపడ్డాడు. "ఈసారి ఇండియాకు గిల్ కీలకమైన ప్లేయర్. అతనితోపాటు ఉన్న వాళ్లు కూడా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నారు. అతడు మంచి స్టార్ట్ ఇవ్వగలిగితే.. మిగతా వాళ్లు కూడా దానిని కొనసాగిస్తారు" అని అజర్ చెప్పాడు.
ఇండియాపైనే ఒత్తిడి
స్వదేశంలో వరల్డ్ కప్ ఆడబోతున్న ఇండియన్ టీమ్ పై ఒత్తిడి ఉంటుందని అజర్ స్పష్టం చేశాడు. "ఇది చాలా పోటీ ఉన్న వరల్డ్ కప్ కాబోతోంది. ఇండియా చాలా మంచి టీమ్. ఇండియా చాలా కాలం తర్వాత ఆతిథ్యమిస్తుండటంతో గ్రౌండ్స్ ఫుల్ అవుతాయి. అయితే చాలా కాలంగా ఐసీసీ టోర్నమెంట్ గెలవకపోవడంతో ఇండియాపై చాలా ఒత్తిడి ఉంటుంది. దాని గురించి ప్లేయర్స్ కు తెలుసని నేననుకుంటున్నాను" అని అజర్ చెప్పాడు.
మహ్మద్ అజారుద్దీన్ ఇండియన్ టీమ్ విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. 1992, 1996, 1999 వరల్డ్ కప్ లలో ఇండియాకు కెప్టెన్ గా ఉన్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ చేశాడు.