Suryakumar Yadav: సూర్యకుమార్ మాస్ హిట్టింగ్: వరుసగా 4 సిక్స్‌లు: వీడియో
Suryakumar Yadav: ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వీరబాదుడు బాదాడు. ఓ ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లు కొట్టాడు.
Suryakumar Yadav: భారత డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి విశ్వరూపం చూపాడు. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో సూర్య తన మార్క్ మాస్ హిట్టింగ్‍తో వీరబాదుడు బాదాడు. ఇండోర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం (సెప్టెంబర్ 24) రెండో వన్డే జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది టీమిండియా. కాగా, అప్పటికే శుభ్‍మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలు చేసి ఔటవటంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే, ఆ తర్వాత టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ నెక్స్ట్ లెవెల్ హిట్టింగ్ చేశాడు. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపాడు. కేవలం 37 బంతుల్లోనే 6 సిక్స్‌లు, 6 ఫోర్లు బాది అజేయంగా 72 పరుగులు చేశాడు సూర్య. ఓ దశలో ఒకే ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లు కొట్టాడు. ఆ వివరాలివే..
ఆస్ట్రేలియా పేసర్ కామెరూన్ గ్రీన్ 44వ ఓవర్ వేయగా.. భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. తొలి బంతిని ఫైన్ లెగ్ మీదుగా బౌండరీ లైన్ దాటించి సిక్స్ బాదాడు సూర్య. ఆ తర్వాత రెండో బంతికి తన మార్క్ స్కూప్ షాట్ ఆడి అదే దిశగా బంతిని బౌండరీ లైన్ దాటించాడు. మూడో బంతిని ఆఫ్ స్టంప్ ఆవల గ్రీన్ వేయగా.. ఎక్స్ ట్రా కవర్స్ మీదుగా పవర్ ఫుల్ షాట్ కొట్టి సిక్సర్ సాధించాడు సూర్య. ఇక, నాలుగో బంతికి మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టాడు సూర్యకుమార్ యాదవ్. ఇలా.. గ్రీన్ వేసిన 44వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు స్కై.
సూర్య వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్‍గా మారింది. సూర్య మాస్ హిట్టింగ్‍ను క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ప్రపంచకప్‍నకు ముందు వన్డేల్లోనూ అతడు భీకర ఫామ్‍లోకి రావడం సంతోషంగా ఉందని అంటున్నారు. సూర్య వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు.
శుభ్‍మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ శతకాలకు తోడు సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (52) అర్ధ శతకాలతో సత్తాచాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 399 పరుగుల భారీ స్కోరు చేసింది.