Shreyas on Kohli: విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు శ్రేయస్ అయ్యర్. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేసిన అయ్యర్.. మ్యాచ్ తర్వాత మాట్లాడాడు. ఈ మ్యాచ్ లో కోహ్లి ఆడే మూడోస్థానంలో అతడు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కోహ్లి స్థానాన్ని తీసుకునే స్థాయి తనది కాదని, ఏ స్థానంలో వచ్చినా పరుగులు చేయడమే తన లక్ష్యమని అయ్యర్ అన్నాడు.
ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు కోహ్లి, రోహిత్ లేకపోవడంతో తుది జట్టులో ప్రయోగాలు చేశారు. అందులో భాగంగా గాయం నుంచి తిరిగి వచ్చి ఫామ్ కోసం తంటాలు పడుతున్న శ్రేయస్ అయ్యర్.. రెండో వన్డేలో మూడోస్థానంలో వచ్చాడు. ఈ మ్యాచ్ లో వచ్చీ రాగానే ఎంతో కాన్ఫిడెంట్ గా ఆడిన అయ్యర్.. సునాయాసంగా సెంచరీ చేసి మళ్లీ గాడిలో పడ్డాడు.
వరల్డ్ కప్ కు ముందు అయ్యర్ ఫామ్ లోకి రావడం టీమిండియాకు ఎంతో ఊరటనిచ్చే విషయం. అతనితోపాటు సూర్యకుమార్ యాదవ్ కూడా వన్డేల్లో ఫామ్ అందుకున్నాడు. 90 బంతుల్లోనే 105 రన్స్ చేసిన తర్వాత శ్రేయస్ మాట్లాడాడు. నిజానికి ఇండియన్ టీమ్ లో నాలుగోస్థానం ఖాళీ ఉంది. దీనికోసం ఇప్పుడు శ్రేయస్, సూర్య పోటీ పడే పరిస్థితి వచ్చింది.
"ఇవాళ నా ప్లాన్స్ పర్ఫెక్ట్ గా అమలు చేయడం సంతోషంగా ఉంది. బ్యాటింగ్ కు దిగినప్పుడు అనవసరం పరిస్థితులను క్లిష్టతరం చేసుకోకూడదని అనుకున్నాను. బాగా ఆడటంపైనే దృష్టి సారించాను. నేను ఫ్లెక్సిబుల్. టీమ్ అవసరాన్ని బట్టి ఏ బ్యాటింగ్ స్థానంలో అయినా దిగడానికి సిద్ధం. విరాట్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడు. అతని స్థానాన్ని నేను తీసుకునే అవకాశమే లేదు. ఎక్కడ బ్యాటింగ్ చేసినా రన్స్ చేయడమే నా లక్ష్యం" అని శ్రేయస్ స్పష్టం చేశాడు.
"గత కొన్ని నెలలుగా నా జీవితం రోలర్ కోస్టర్ లా మారిపోయింది. చాలా కష్టపడుతున్నాను. ఒంటరిగా ఉన్నాను. నా టీమ్మేట్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ నాకు మద్దతుగా నిలిచారు. మ్యాచ్ లను టీవీలో చూశాను. కానీ నేను ఫీల్డ్ లోకి దిగి ఆడాలనుకున్నాను. నాపై నేను నమ్మకముంచాను. గాయం బాధ వేధిస్తున్నా నా లక్ష్యమేంటో నాకు తెలిసేది" అని అయ్యర్ చెప్పాడు.