World Cup 2023: ఇండియా, పాకిస్థాన్‌లలో ఒకరికి వరల్డ్ కప్ పక్కా.. చరిత్ర అదే చెబుతోంది.. ఎలాగో చూడండి-india or pakistan going to win world cup 2023 history says this cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  World Cup 2023: ఇండియా, పాకిస్థాన్‌లలో ఒకరికి వరల్డ్ కప్ పక్కా.. చరిత్ర అదే చెబుతోంది.. ఎలాగో చూడండి

World Cup 2023: ఇండియా, పాకిస్థాన్‌లలో ఒకరికి వరల్డ్ కప్ పక్కా.. చరిత్ర అదే చెబుతోంది.. ఎలాగో చూడండి

Hari Prasad S HT Telugu

World Cup 2023: ఇండియా, పాకిస్థాన్‌లలో ఒకరికి వరల్డ్ కప్ పక్కా. గత 24 ఏళ్ల చరిత్ర అదే చెబుతోంది. దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. అదేంటో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు.

వరల్డ్ కప్ 2023లోకి వన్డేలలో నంబర్ 1, నంబర్ 2గా అడుగుపెడుతున్న ఇండియా, పాకిస్థాన్ (ICC Twitter)

World Cup 2023: ఇండియా, పాకిస్థాన్ లలో ఒక టీమ్ ఈసారి వరల్డ్ కప్ అందుకోబోతోందా? గత చరిత్ర అదే చెబుతోంది. స్వదేశంలో ఇండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలాంటి టీమ్స్ ను పక్కన పెట్టిన ఈ మధ్య ఆసియా కప్ లోనే తడబడిన పాకిస్థాన్ కప్పు ఎలా గెలుస్తుందన్న సందేహం వస్తోందా?

దీని వెనుక ఓ ఆసక్తికర విషయం దాగుంది. 1999 నుంచి 2019 వరకూ ప్రతి వన్డే వరల్డ్ కప్ నూ ర్యాంకుల్లో టాప్ 2 స్థానాల్లో ఉన్న ఏదో ఒక జట్టే గెలుస్తోంది. ఇప్పుడు వరల్డ్ కప్ లో నంబర్ వన్ గా ఇండియా, నంబర్ 2గా పాకిస్థాన్ అడుగు పెడుతున్నాయి. దీంతో హిస్టరీ రిపీటైతే.. ఈ రెండు జట్లలో ఒకరికి వరల్డ్ కప్ పక్కా అన్న వాదన వినిపిస్తోంది.

ఇండియా 1.. పాకిస్థాన్ 2

తాజాగా రిలీజైన ఐసీసీ వన్డే ర్యాంకుల్లో ఇండియా నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఆసియా కప్ గెలవడంతో పాకిస్థాన్ ను వెనక్కి నెట్టి నంబర్ వన్ అయిన టీమిండియా.. ఆస్ట్రేలియాపై సిరీస్ విజయంతో తన ర్యాంకును మరింత పదిలం చేసుకుంది. తాజా ర్యాంకుల్లో 117 పాయింట్లతో టాప్ లో ఉంది. ఇక పాకిస్థాన్ 115 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

దీంతో టాప్ 2లో ఉన్న ఈ రెండు జట్లలో ఏదో ఒకటి వరల్డ్ కప్ గెలుస్తుందన్న అంచనాలు మొదలయ్యాయి. 1999 వరల్డ్ కప్ నుంచీ ఇదే జరుగుతోంది. 1999లో ఆస్ట్రేలియా నంబర్ 2 టీమ్ గా వరల్డ్ కప్ లో అడుగుపెట్టి.. ట్రోఫీ ఎగరేసుకుపోయింది. ఇక 2003, 2007లలోనూ వరల్డ్ కప్స్ గెలిచిన ఆ టీమ్.. ఆ రెండు సందర్భాల్లోనూ నంబర్ 1గానే ఉంది.

ఇక 2011లో వరల్డ్ కప్ గెలిచిన ఇండియా వన్డేల్లో రెండో ర్యాంకుతో అడుగు పెట్టింది. ఇక 2015లో మరోసారి కప్పు గెలిచిన ఆస్ట్రేలియా కూడా రెండో ర్యాంకుతోనే టోర్నీకి వచ్చింది. 2019లో వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లండ్ నంబర్ 1గా బరిలోకి దిగింది. అంటే చివరి ఆరు వరల్డ్ కప్ లలోనూ నంబర్ 1 లేదా నంబర్ 2 టీమే ట్రోఫీ గెలుస్తూ వచ్చింది.

స్వదేశం.. ఇండియాకు ప్లస్

ఇక ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. 2011 నుంచి ఆతిథ్య జట్టే వరల్డ్ కప్ గెలుస్తూ వస్తోంది. 2011లో ఇండియా ఆతిథ్యమివ్వగా అప్పుడు ట్రోఫీ గెలిచింది. 2015లో న్యూజిలాండ్ తో కలిసి ఆతిథ్యమిచ్చిన ఆస్ట్రేలియా కప్పు ఎగరేసుకుపోయింది. 2019లో తొలిసారి వరల్డ్ కప్ సొంతం చేసుకున్న ఇంగ్లండే టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. ఈసారి ఇండియా మరోసారి ఆతిథ్యమిస్తుండటంతో అది కూడా మెన్ ఇన్ బ్లూకి కలిసొస్తుందన్న అంచనాలు ఉన్నాయి.