Nitish Reddy: తెలుగు క్రికెటర్‌పై నమ్మకంతో ఛాన్స్ ఇచ్చిన కోచ్ గంభీర్, రిటర్న్ గిఫ్ట్ అదిరిపోయింది!
IND vs BAN T20 Match: విశాఖపట్నం కుర్రాడు నితీశ్ రెడ్డిపై నమ్మకం ఉంచిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నెం.4లో అతడ్ని బ్యాటింగ్‌కి పంపగా.. 21 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ బంగ్లాదేశ్ బౌలర్లకి చుక్కలు చూపించేశాడు.
భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన వారం వ్యవధిలోనే తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తన మార్క్ చూపించాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన రెండో టీ20లో కేవలం 34 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సర్లు బాదిన నితీశ్ రెడ్డి 74 పరుగులు చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేకపోయినా మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్లపై అతను ఎదురుదాడి చేస్తూ బాదిన సిక్సర్లకి అందరూ ఆశ్చర్యపోయారు. బ్యాటింగ్‌లోనే కాదు.. బౌలింగ్‌లోనూ నితీశ్ రెడ్డి రెండు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
ఆ ఇద్దరినీ పక్కనపెట్టి నెం.4లో ఛాన్స్
ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన నితీశ్ కుమార్ రెడ్డి ఆటతీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్ సూర్యకుమార్, కోచ్ గౌతం గంభీర్.. ఈ 21 ఏళ్ల యంగ్ ప్లేయర్‌పై నమ్మకం ఉంచారని.. అందుకే కీలకమైన నెం.4లో బ్యాటింగ్‌కి పంపించారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
‘‘సాధారణంగా కొత్త ప్లేయర్‌కి నెం.4లో ఆడే అవకాశం అంత సులువుగా లభించదు. కానీ.. నితీశ్ రెడ్డికి కెరీర్ ఆరంభంలోనే ఎంతో నమ్మకంతో కోచ్ గౌతమ్ గంభీర్ నెం.4లో బ్యాటింగ్ చేయమని అడిగారు. వాస్తవానికి నితీశ్ రెడ్డి కంటే టీమ్‌లో సీనియర్లు రియాన్ పరాగ్, రింకూ సింగ్‌లు ఉన్నారు.
కానీ.. ఈ ఇద్దరికీ గౌతమ్ గంభీర్ ఆ అవకాశం ఇవ్వలేదు. దానికి కారణం ఆ ఇద్దరి కంటే వేగంగా పరుగుల రాబట్టే సామర్థ్యం నితీశ్ రెడ్డికి ఉందని గంభీర్ నమ్మాడు. అతని నమ్మకాన్ని నితీశ్ వమ్ముచేయకుండా మ్యాచ్‌ని గెలిపించే ప్రదర్శన ఇచ్చాడు’’ అని ఆకాశ్ చోప్రా ప్రశంసించాడు.
ఒక్క చోటే ఉండి.. వరుస సిక్సర్లు
‘‘నితీశ్ రెడ్డి చాలా బాగా ఆడుతున్నాడు. అతని రియాక్షన్ కూడా చాలా వేగంగా ఉంది. అతను బ్యాటింగ్ చేసే విధానంలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే అతను క్రీజులో స్థిరంగా ఒక చోటే ఉన్నప్పటికీ తన బ్యాటింగ్ టెక్నిక్‌తో స్పిన్, పేస్‌లోనూ వరుస సిక్సర్లు కొట్టగల సత్తా అతని సొంతం’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
రెండో టీ20లో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు పవర్ ప్లేలో ఔటైనప్పటికీ రింకూ సింగ్‌తో కలిసి భారత్ జట్టుని నితీశ్ కుమార్ రెడ్డి తిరుగులేని స్థితిలో నిలిపాడు. నాలుగో వికెట్‌కు కేవలం 49 బంతుల్లోనే ఈ జంట 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
లాస్ట్ టీ20లోనూ చెలరేగుతాడా?
భారత్, బంగ్లాదేశ్ మధ్య మొత్తం మూడు టీ20ల సిరీస్ జరుగుతుండగా.. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియా 2-0తో సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఇక మిగిలిన ఆఖరి టీ20 మ్యాచ్ హైదరాబాద్ వేదికగా శనివారం జరగనుంది. ఉప్పల్‌లో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్ననితీశ్ రెడ్డి ఎలా చెలరేగుతాడో చూడాలి. నితీశ్ రెడ్డి స్వస్థలం విశాఖపట్నం.