YS Jagan Comments : ధైర్యం కోల్పోవద్దు, నా వయసు చిన్నదే.. మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం - వైఎస్ జగన్-ysrcp chief ys jagan hold meeting with party mps key comments were made in the meeting ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan Comments : ధైర్యం కోల్పోవద్దు, నా వయసు చిన్నదే.. మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం - వైఎస్ జగన్

YS Jagan Comments : ధైర్యం కోల్పోవద్దు, నా వయసు చిన్నదే.. మళ్లీ మనమే అధికారంలోకి వస్తాం - వైఎస్ జగన్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 14, 2024 03:04 PM IST

YS Jagan Meeting With MPs : పార్టీ ఎంపీలతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…- ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదన్నారు. మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్
పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్

YS Jagan Meeting With MPs : వైసీపీ తరపు లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశమయ్యారు. క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ చేయలేని విధంగా మంచి పరిపాలన అందించామని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో 99శాతం హామీలు అమలు చేశామన్నారు.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా ఎవ్వరూ చేయలేదన్న జగన్… చాలా చిత్తశుద్ధితో పనిచేసి, మేనిఫెస్టోను అమలు చేశామని చెప్పారు. ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ, ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు మంచి చేశామని చెప్పుకొచ్చారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఎప్పుడూ చూడని సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. ప్రజల ఇంటివద్దకే పరిపాలనను తీసుకెళ్లామన్నారు.

భవిష్యత్తు తరాలను ప్రపంచస్థాయిలో నిలబెట్టేందుకు ఇంగ్లిషు మీడియం, టోఫెల్, ఆరో తరగతి నుంచి డిజిటల్ టీవీలు, ఎనిమిదో తరగతి నుంచి ట్యాబులు అందించాం. ఐబీ సిలబస్‌ని కూడా తీసుకు వచ్చాం. ప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను విద్యార్థులకు అందించాం. నాణ్యమైన విద్యాను శాశ్వతంగా అందించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించేదిశగా ఐదేళ్లలో అడుగులు వేశాం. సోషల్ ఇంజినీరింగ్‌లో భాగంగా ఎప్పుడూ చూడవిధంగా వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశాలు కల్పించాం" అని జగన్ గుర్తు చేశారు.

ఏం జరిగిందో దేవుడికే తెలియాలి….

ఇన్ని గణనీయమైన మార్పులు తీసుకువచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయంటే చాలా ఆశ్చర్యమేస్తోందని జగన్ కామెంట్స్ చేశారు. శకుని పాచికలు మాదిరిగా ఈ ఎన్నికలు ఫలితాలు వచ్చాయనిపిస్తోందన్న ఆయన… ఏం జరిగిందో దేవుడికే తెలియాలని వ్యాఖ్యానించారు.

భూతంలా చూపించి…

“ల్యాండ్ టైట్‌లింగ్‌ యాక్ట్‌ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోకూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ మద్దతు పలికింది. అమెరికా, యూరప్ దేశాల్లో అనుసరిస్తున్న మంచి విధానాలన్నీ ఇందులో ఉన్నాయని సభ సాక్షిగా ప్రశంసలు కురిపించింది. కానీ సరిగ్గా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను ఒక భూతంలా చూపి… టీడీపీ, కూటమి పార్టీలు విషప్రచారం చేశాయి. నిజంగా ఈ చట్టాన్ని తీసుకురావాలంటే.. అంత సులభమైన విషయం కాదు. వైయస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేలమంది సర్వేయర్లను నియమించడం వల్లే సాధ్యపడే పరిస్థితులు వచ్చాయి.చరిత్రలో తొలిసారిగా భూ పత్రాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది" అని జగన్ చెప్పుకొచ్చారు.

టీడీపీ వాళ్లు మద్దతు పలికిన చట్టాన్ని ఇప్పుడు వాళ్లే తీసేస్తామంటున్నారని జగన్ అన్నారు. వారు చేస్తున్న రాజకీయాలు ఎలా ఉంటాయో దీనిబట్టే తెలుస్తుందన్నారు. “వైయస్సార్సీపీని నమ్మకుని కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి. కొన్ని లక్షలమంది కార్యకర్తలు ఈ పార్టీపై ఆధారపడి ఉన్నారు. కొన్ని వేలమంది నాయకులు పార్టీలో ఉన్నారు. అనుకున్న లక్ష్యాల దిశగా పార్టీ ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో మనకు 40శాతం ఓట్లు వచ్చాయి. గడిచిన ఎన్నికలతో పోలిస్తే 10 శాతం ఓట్లు తగ్గాయి” అని జగన్ లెక్కలను వివరించే ప్రయత్నం చేశారు.

మళ్లీ మనదే అధికారం….

ప్రతి ఇంట్లోకూడా మన ప్రభుత్వం చేసిన మంచి ఉందన్నారు జగన్. “ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదు.మనలో పోరాటపటిమ తగ్గకూడదు. నా వయసు చిన్నదే. నాలో సత్తువ ఇంకా తగ్గలేదు. 14 నెలలు పాదయాత్ర చేశాను. దేవుడుదయ వల్ల అన్నిరకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉంది. ప్రజలు మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకు వస్తారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి” అని జగన్ వ్యాఖ్యానించారు.

ఈసారి కూడా అంతే సమయం గడిచిపోతుంది….

“పార్లమెంటులో మనకు 11 మంది రాజ్యసభ సభ్యులు, 4గురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. మొత్తంగా 15 మంది ఎంపీలు మన పార్టీకి ఉన్నారు. టీడీపీకి 16 మంది ఉన్నారు. అందువల్ల మన పార్టీ కూడా చాలా బలమైనదే. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనం ధైర్యంగా ఉండి ప్రజల తరఫున పోరాటం చేయాలి. 2019-24 మధ్య ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు మన పరిపాలనాకాలం ముగిసిందో తెలియదు. ఈసారికూడా అంతే. ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయి. పార్లమెంటులో వ్యవహరించేటప్పుడు ప్రజాహితమే ధ్యేయం కావాలి. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంశాలవారీగానే మద్దతు ఉంటుంది. ఎవరికైనాగాని, అంశాలవారీగానే మద్దతు ఉంటుంది. పార్టీ విధివిధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలి” అని జగన్ దిశానిర్దేశం చేశారు.

రాజకీయంగా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమని జగన్ అన్నారు. “మన పరిపాలనను, చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారు. కచ్చితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఈలోగా మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. విలువలు, విశ్వసనీయతతో ముందడుగులు వేయాలి. ఇదివరకటి లాగానే రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారు. లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథన్ రెడ్డి వ్యవహరిస్తారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారు. అందరికీ నేను అందుబాటులో ఉంటాను” అని జగన్ చెప్పారు.

WhatsApp channel