Tirumala : రేపట్నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు.. 3 రోజులు ఆ సేవలు రద్దు-tirumala salakatla vasanthotsavams from 3 april 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : రేపట్నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు.. 3 రోజులు ఆ సేవలు రద్దు

Tirumala : రేపట్నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు.. 3 రోజులు ఆ సేవలు రద్దు

HT Telugu Desk HT Telugu
Apr 02, 2023 06:09 PM IST

Tirumala Salakatla Vasanthotsavams: ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. మేరకు టీటీడీ ఏర్పాట్లు సిద్ధం చేసింది.

శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు (twitter)

Tirumala Salakatla Vasanthotsavams 2023: తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 3 నుంచి మూడు రోజుల పాటు ఈ వసంతోత్సవాలు జరగనున్నాయి. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది.

ఈనెల 3న ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. ఆ తర్వాత వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఏప్రిల్ 4న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. ఇక ఐదోవ తేదీన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు చెప్పారు.

ప్రతి రోజూ సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత రుతువులో శ్రీమలయప్పస్వామికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవ మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదిస్తారు. ఈ వసంతోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే మూడు రోజులు ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది టీటీడీ.

మరోవైపు టీటీడీ ఆలయాల్లో ఉపయోగించే పుష్పాలతో అగరబత్తులను తయారుచేసి భక్తులకు అందించాలని టీటీడీ నిర్ణయించింది. బెంగళూరుకు చెందిన దర్శన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ సహకారంతో 2021 నుంచి అగరబత్తులను తయారుచేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు రూ.30.66 కోట్ల విలువైన అగరబత్తులను భక్తులకు విక్రయించినట్లు టీటీడీ తెలిపింది. టీటీడీ అగరబత్తులకు భక్తుల నుంచి డిమాండ్‌ రావడంతో ఉత్పత్తిని రెండింతలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రస్తుత ప్లాంట్‌ వద్ద మరో రూ 2 కోట్లతో రెండో యూనిట్‌ పెట్టేందుకు సిద్ధం అయింది. ప్రస్తుతం రోజుకు 15 వేల అగరబత్తుల ప్యాకెట్లు తయారుచేస్తున్న టీటీడీ... రెండో యూనిట్‌ అందుబాటులోకి వస్తే రోజుకు 30 వేల ప్యాకెట్లకు ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల సుమారు 200 మంది స్థానిక మహిళలకు ఉపాధి లభిస్తోందని టీటీడీ తెలిపింది. భక్తులు శ్రీవారి లడ్డు ప్రసాదంతో పాటు అగరబత్తులను కూడా ప్రసాదంగా అందించడానికి ముందుకొస్తున్నారని టీటీడీ తెలిపింది.

ఇక తిరుమలకు నడకమార్గంలో వచ్చే భక్తులకు దర్శన టోకెన్లను జారీ చేస్తుంది టీటీడీ. కోవిడ్ కారణంగా నిలిపివేసిన దివ్య దర్శనం టోకెన్లను తిరిగి శనివారం నుంచి ప్రారంభించింది. అలిపిరి నడక మార్గంలో 10 వేల మందికి, శ్రీవారి మెట్ల నడక మార్గంలో 5 వేల మంది భక్తులకు దర్శనం టికెట్లు జారీచేస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం