TTD DivyaDarshan: ఏప్రిల్ 1 నుంచి నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు-issuance of divya darshan tokens on an experimental basis at tirumala walkway ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Divyadarshan: ఏప్రిల్ 1 నుంచి నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు

TTD DivyaDarshan: ఏప్రిల్ 1 నుంచి నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు

HT Telugu Desk HT Telugu
Mar 27, 2023 06:18 PM IST

TTD DivyaDarshan: ఏప్రిల్ 1నుంచి నడక మార్గాల్లో దివ్యదర్శనం టోకెన్లను ప్రయోగాత్మకంగా జారీ చేయాలని టీటీడీ భావిస్తోంది. వేసవి రద్దీ నేపథ్యంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చేలా పలు చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

టీటీడీ ఈవోొ ధర్మారెడ్డి, ఛైర్మన్ సుబ్బారెడ్డి
టీటీడీ ఈవోొ ధర్మారెడ్డి, ఛైర్మన్ సుబ్బారెడ్డి

TTD DivyaDarshan: ఏప్రిల్‌ 1 నుండి తిరుమల నడకమార్గాల్లో దివ్యదర్శనం టోకెన్లను ప్రయోగాత్మకంగా జారీ చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతుందనే అంచనాలతో బ్రేక్‌ దర్శనాలకు సిఫారసు లేఖలు తగ్గించాలని విఐపిలకు విజ్ఞప్తి చేశారు.

భక్తుల కోరిక మేరకు ఏప్రిల్‌ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు అలిపిరి మార్గంలో 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల దివ్యదర్శనం టోకెన్లు మంజూరు చేస్తామని, ఆ తరువాత భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని టిటిడి ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం ఈవో శ్రీఎవి.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్‌ మీడియా సమావేశం నిర్వహించారు.

తిరుమలలో రానున్న వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఏర్పాట్లను సుబ్బారెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ 15 నుండి జులై 15వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటాయని, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300/` దర్శన టికెట్లు తగ్గిస్తున్నామని ప్రకటించారు.

మూడు నెలల పాటు విఐపిలు సిఫారసు లేఖలను తగ్గించాలని ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు. సామాన్య భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనం కల్పించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఆలయ మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో భక్తులకు కాళ్లు కాలకుండా కూల్‌ పెయింట్‌ వేస్తామని తెలిపారు.

తిరుమలలో ప్రస్తుతం 7500కు పైగా గదులు ఉన్నాయని, వీటిలో 40 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉందని, దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయించడం జరిగిందన్నారు. ఇటీవల ప్రవేశపెట్టి ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ ద్వారా గదుల కేటాయింపులో పారదర్శకతను పెంచామన్నారు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పాత అన్నదానం కాంప్లెక్స్‌, పిఏసి`2, 4తోపాటు నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదాలు పంపిణీ చేస్తామని తెలిపారు. అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో జలప్రసాద కేంద్రాల ద్వారా భక్తులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచుతాం. మెరుగ్గా పారిశుద్ధ్య ఏర్పాట్లు చేస్తామన్నారు.

ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో నిరంతరాయంగా సేవలందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు కొరత లేకుండా తగినన్ని లడ్డూలు నిల్వ ఉంచుతామని తెలిపారు. టిటిడి విజిలెన్స్‌, పోలీసుల సమన్వయంతో భక్తులకు పార్కింగ్‌ సౌకర్యం కల్పించడంతోపాటు ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూస్తామన్నారు. శ్రీవారి సేవకులతో వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందిస్తామన్నారు.

Whats_app_banner