Eluru Crime : పగలు పక్కాగా రెక్కీ చేస్తారు.. రాత్రిపూట గుట్టుగా గుల్ల చేస్తారు.. రెచ్చిపోతున్న దొంగలు!
Eluru Crime : ఏలూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా కన్నాలు వేస్తున్నారు. పగలు పక్కాగా రెక్కీ నిర్వహించి.. రాత్రిపూట సైలెంట్‌గా పని కానిచ్చేస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో భద్రంగా దాచుకున్నా.. దోచుకెళ్తున్నారని వాపోతున్నారు.
ఏలూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి.. పోలీసులకు సవాలు విసురుతున్నారు. రాత్రి గస్తీ, విజిబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా.. దొంగలు తమ పనిని కానిచ్చేస్తున్నారు. గట్టి నిఘా ఉన్నా దొంగతనాలు ఆగడం లేదు. లాక్డ్‌హౌస్ మోనటరింగ్ సిస్టంపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. దాన్ని ఎక్కువగా సద్వినియోగం చేసుకున్నట్టు కనిపించడం లేదు.
ఇవన్నీ కారణాలు దొంగలకు వరంగా మారాయి. అటు ఊరెళ్లే సమయాల్లో పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో.. దొంగలు గుట్టుగా పని కానిచ్చేస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఇలా ఉన్నాయి. ఏలూరు నగరం ఆదివారపుపేటలో ఉంటున్న ఓ వ్యక్తి తన ఇంటికి తాళం వేసి బయటకెళ్లారు. దీన్ని గమనించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి 10 కాసుల బంగారం, రూ.లక్ష నగదు, వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. కైకలూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 4న కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు.. లోపలికి చొరబడి నాలుగు కాసుల బంగారం, 30 తులాల వెండి, నగదు దోచుకెళ్లారు.
ఆ ఇళ్లే టార్గెట్..
ఏలూరు నగరం, జిల్లాల్లో పట్టణాల్లో పగలు రెక్కీ నిర్వహించడం.. రాత్రి దొంగతనం చేయడం కామన్‌గా మారింది. ఇంటి యజమానులు లేరన్న కచ్చిత సమాచారంతోనే.. ఆ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. కొందరు పాత నేరస్థులు బెయిల్‌పై బయటకొచ్చి.. దొంగతనాలు చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. ఇటీవల అరెస్టయిన దొంగల్లో ఎక్కువ మంది పాత నేరస్థులే ఉండటం గమనార్హం.
చోరీల నివారణకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశామని పోలీసులు చెబుతున్నారు. రాత్రి గస్తీ, పెట్రోలింగ్ ముమ్మరం చేశామని అంటున్నారు. నిరంతరం విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నారని.. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన చోరీ కేసుల్లో దొంగలను అరెస్టు చేసి.. సొత్తు రికవరీ చేశామని.. బాధితులకు న్యాయం చేస్తున్నామని అంటున్నారు.