AP School Education : ప్రధానోపాధ్యాయులకు లీడర్‌షిప్ ట్రైనింగ్.. అక్టోబర్ 14 నుంచి 19 వరకు ఏలూరులో శిక్షణ
AP School Education : రాష్ట్రంలో ప్రధానోపాధ్యాయులకు లీడర్‌షిప్ ట్రైనింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 14 నుంచి 19 వరకు ఏలూరు జిల్లాలో ఈ శిక్షణ ఇస్తారు. ఈ మేరకు సమగ్ర శిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్.. బి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలోని హీల్ ప్యారడైజ్‌లో 2024 అక్టోబర్ 14 నుండి 2024 అక్టోబర్ 19 వరకు.. పాఠశాలల అధిపతులకు లీడర్‌షిప్‌పై ఆరు రోజుల రెసిడెన్షియల్ శిక్షణను నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులు, అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌లకు ఈ విషయాన్ని తెలియజేశారు.
శిక్షణా కార్యక్రమంలో ఎవరు పాల్గొనాలనే దానిపై పాఠశాల అధిపతులు నిర్ణయం తీసుకుంటారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాస్టర్ ట్రైనర్‌లుగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. గుర్తించబడిన పాఠశాల ప్రధానోపాధ్యాయులను (ఎంఎఫ్‌లు) రిలీవ్ చేయాలని సూచించారు. లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌కు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులు, అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌లకు సూచించారు. ప్రధానోపాధ్యాయులను ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అక్టోబర్ 14 తేదీ ఉదయం 7 గంటలకు వేదిక వద్దకు హాజరుకావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేవారికి వసతి, బోర్డింగ్ అందిస్తామని.. అలాగే నిబంధనల ప్రకారం టీఏ, డీఏ కూడా చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దసరా సెలవులు ముగిసిన వెంటనే ఈ ట్రైనింగ్ ప్రొగ్రామ్ ఉంటుంది. అక్టోబర్ 13తో దసరా సెలవులు ముగియనున్నాయి.
ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 1, 2 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు.. ఎఫ్ఎల్ఎన్‌కు సంబంధించి జ్ఞాన ప్రకాష్ సర్టిఫికేట్ కోర్సుపై శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు. ఈ నెల 13వ తేదీతో దసరా సెలవులు ముగియనున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ తరువాత శిక్షణా తరగతుల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. శిక్షణా తరగతులకు సింగిల్ టీచర్ పాఠశాలలను మినహాయించనున్నారు. ఈ మేరకు శిక్షణా తరగతులకు సంబంధించి అధికారులు మ్యాపింగ్ చేసే పనిలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు ఎఫ్ఎల్ఎన్, జ్ఞాన ప్రకాష్ పేరిట శిక్షణా కార్యక్రమాలతో ఉపాధ్యాయులను పాఠశాలలకు దూరం చేస్తున్నారని మండిపడుతున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)