Telangana Police : పోలీసులు బెదిరిస్తున్నారా.. అయితే ఈ నంబర్లకు కాల్ చేయండి!
Telangana Police : ప్రస్తుతం ఏ సమస్య వచ్చినా మొదట గుర్తొచ్చేది పోలీస్. అవును శాంత్రి భద్రతలు మొదలు.. ఆపదల వరకూ అన్నింటా పోలీసులు సాయం చేస్తున్నారు. కానీ.. కొన్నిచోట్ల పోలీస్ అధికారులు బాధితులను బెదిరిస్తున్నారు. ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
సమస్య పరిష్కారం కోసం ఎంతో మంది బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. కానీ.. అందరికీ న్యాయం లభించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా.. బాధితులనే పోలీసులు బెదిరించిన ఘటనలు లేకపోలేదు. దీంతో సమస్య పరిష్కారం కాక.. ఫిర్యాదు చేసే దారిలేక చాలామంది బాధలు పడుతున్నారు. అలాంటి వారి కోసం పోలీస్ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవలి కాలంలో పోలీస్ స్టేషన్లలో అధికారులు ఫిర్యాదు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, కేసుల నమోదులో పారదర్శకత పెంపొందించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. నేరుగా ఫిర్యాదు చేసేందుకు డీపీవో, సీపీ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కంప్లైంట్ సెల్ ఏర్పాటుచేశారు. దీంట్లో 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా సెల్ ఫోన్ నంబర్లు ఏర్పాటు చేశారు.
కొన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ ఫిర్యాదులను స్వీకరిస్తూ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. కానీ కొందరు పోలీస్ అధికారులు మాత్రం కంప్లైంట్ తీసుకోకుండా బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పైస్థాయి అధికారికి ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ ఎదుట పైస్థాయి అధికారుల ఫోన్ నంబర్లు, ఫిర్యాదుల విభాగం నంబర్లను ప్రదర్శిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో దీన్ని అమలు చేస్తున్నారు.
ఫిర్యాదుల విభాగానికి వచ్చిన కంప్లైంట్‌లను పరిశీలించి చర్యలు చేపట్టేందుకు ప్రత్యేకంగా ఓ అధికారికి బాధ్యతలు అప్పగించారు. ఏదైనా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదు అందితే.. బాధితుడి వివరాలు గోప్యంగా ఉంచుతూ కంప్లైంట్ తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు. సర్కిల్‌లో ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పిస్తున్నారు. అక్కడా కుదరకపోతే డివిజన్ స్థాయి అధికారికి సమస్యను విన్నవించుకునేందుకు ఉన్న అవకాశాన్ని తెలియజేస్తున్నారు.
ఈ మూడు స్థాయిల్లోనూ కుదరకపోతే.. జీరో ఎఫ్‌ఐఆర్ కింద సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదులో పారదర్శకత పెంపొందించేందుకు కంప్లైంట్‌సెల్‌ను ఏర్పాటు చేశామని.. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే బాధితులు ఈ సెల్‌కు సమాచారం అందిస్తున్నారు. వాట్సప్ ద్వారా సమస్యలకు సంబంధించిన వీడియోలు, చిత్రాలను పంపే వీలు కూడా ఉంది.
ప్రస్తుతం ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో లేదు. అన్ని పోలీస్ స్టేషన్లలో ఇలాంటి నంబర్లు ప్రదర్శిస్తే.. న్యాయం జరగని బాధితులు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. ఇలాంటి విధానాన్నే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్ ఉంది. అప్పుడే బాధితులను బెదిరించే పోలీసులు తీరు మార్చుకుంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఫోన్ చేయాల్సిన నంబర్లు..
నిజామాబాద్- 87126 59888
కామారెడ్డి- 87126 86142