Pushpa In Police Station: బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వరా..అల్లు అర్జున్ అసహనం..శుక్రవారం పోలీస్‌ పిలుపులో ఆంతర్యం?-allu arjuns impatience with the police who didnt even give him a chance to change his clothes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pushpa In Police Station: బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వరా..అల్లు అర్జున్ అసహనం..శుక్రవారం పోలీస్‌ పిలుపులో ఆంతర్యం?

Pushpa In Police Station: బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వరా..అల్లు అర్జున్ అసహనం..శుక్రవారం పోలీస్‌ పిలుపులో ఆంతర్యం?

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 13, 2024 01:59 PM IST

Pushpa In Police Station: వైల్డ్ ఫైర్‌ పుష్పను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్‌ నివాసానికి చేరుకున్న పోలీసులు నేరుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అల్లు అర్జున్‌ షాక్‌కు గురయ్యారు. పోలీసుల తీరుపై బన్నీ అసహనం వ్యక్తం చేశారు.

అరెస్ట్‌కు ముందు పార్కింగ్‌ ప్రదేశంలో అల్లు అర్జున్
అరెస్ట్‌కు ముందు పార్కింగ్‌ ప్రదేశంలో అల్లు అర్జున్

Pushpa In Police Station: సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పుష్ప నటుడు అల్లు అర్జున్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌ నివాసంలో ఉన్న అల్లు అర్జున్‌ నివాసానికి చేరుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇంట్లో మొదటి అంతస్తులోని బెడ్‌రూమ్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటున్న అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకుంటున్నట్టు చెప్పడంతో షాక్‌‌కు గురయ్యార. లిఫ్ట్‌లో కిందకు వచ్చిన తర్వాత దుస్తులు మార్చుకునేందుకు పోలీసుల అనుమతి కోరారు.

పోలీస్ వాహనంలో ఎక్కే ముందు పోలీసుల తీరుపై అల్లు అర్జున్‌ అసహనం వ్యక్తం చేశారు. బట్టలు మార్చుకోడానికి అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు. పోలీసులు తన ఇంటికి రావడం తప్పు కాదని, నేరుగా బెడ్‌రూమ్‌ వరకు వచ్చేయడం ఏమిటని ప్రశ్నించారు. తాను పోలీసులకు సహకరిస్తానని చెప్పారు. ఆ సమయంలో అల్లు అర్జున సతీమణి స్నేహ కూడా అక్కడే ఉన్నారు. పార్కింగ్‌ ఏరియాలో కాఫీ తగిన తర్వాత భార్యను సముదాయించి పోలీస్ వాహనంలో చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు.

అల్లు అర్జున్‌ అరెస్ట్‌ సమాచారం అందుకున్న అల్లు అర్జున్ తండ్రి అరవింద్‌ అక్కడకు చేరుకున్నారు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనకు అల్లు అర్జున్‌ను బాధ్యుడిగా చేస్తున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. అల్లు అర్జున్‌తో పాటు ఆయన తండ్రి కూడా పోలీస్‌ వాహనంలో పీఎస్‌కు వెళ్లారు.

మరోవైపు సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేస్తూ దాఖలైన కేసును క్వాష్‌ చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. ప్రీమియర్ షో సందర్భంగా ముందస్తు సమాచారం లేకుండా అల్లు అర్జున్ థియేటర్‌ వద్దకు రావడాన్ని పోలీసులు తప్పు పడుతున్నారు.

ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు.. 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 105 సెక్షన్‌ నాన్‌బెయిలబుట్‌ కేసు కాగా 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.

పుష్ప2 ప్రీమియర్‌ షో సందర్భంగా సినిమా థియేటర్‌ వద్దకు నటుడు అల్లు అర్జున్‌ థియేటర్‌ వద్దకు వస్తున్నట్టు థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. ప్రేక్షకుల రద్దీకు తగ్గట్టు ఏర్పాట్లు మాత్రం చేయలేదు. ఈ ఘటనకు అ్లలు అర్జున్‌ను బాధ్యుడిని చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్‌కు చెందిన 8 మంది భాగస్వాములతో పాటు మేనేజర్‌, ఇతర సిబ్బందిపై కేసు నమోదు చేశారు.

శుక్రవారం పోలీసుల రాక ఆంతర్యం ఏమిటి…

అల్లు అర్జున్‌పై పోలీసుల కేసు నమోదు కావడం, దానిపై క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో శుక్రవారం అనూహ్యంగా పోలీసులు అల్లు అర్జున్‌ ఇంటికి రావడం కలకలం రేపుతోంది. సాధారణంగా శుక్రవారం పోలీసుల నుంచి పిలుపు వచ్చినా, అదుపులోకి తీసుకున్నా రిమాండ్‌ ఖాయమనే అభిప్రాయం ఉంది. నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లు ఉన్న కేసుల్లో శుక్రవారం అంటే అభియోగాలు ఎదుర్కొంటున్న వారు ఉలిక్కి పడతారు. శుక్రవారం కోర్టు రిమాండ్ ఉత్తర్వులు ఇస్తే కనీసం మూడు రోజులు జైల్లో ఉండాలి. తిరిగి సోమవారం కోర్టులో బెయిల్ లభిస్తే తప్ప బయటకు రావడానికి వీలుండదు. అల్లు అర్జున్‌ నటించిన పుష్ప 2 విజయాన్ని అస్వాదిస్తున్న క్రమంలో చోటు చేసుకుంటున్న పరిణమాలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

అల్లు అర్జున్‌ అరెస్ట్‌ను ధృవీకరించిన సీపీ

పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్బంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసినట్టు హైదరాబాద్‌ సీపీ  సీవీ ఆనంద్‌ ప్రకటించారు. జూబ్లీహిల్స్‌ నివాసంలో అదుపులోకి తీసుకున్న అల్లు అర్జున్‌ను పోలీసులు తొలుత చిక్కడపల్లి పీఎస్‌కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

మరోవైపు అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేయకూడదనివ,   అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై దాఖలు చేసిన లంచ్ మోషన్‌పై  విచారణ జరపాలని అల్లు అర్జున్‌ తరపు న్యాయవాదులు కోరారు.  జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేసిన న్యాయవాదులు నిరంజన్ రెడ్డి,  అశోక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.  సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్దర్స్ ఇవ్వాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. కేసు వివరాలను   పోలీసులను అడిగి 2.30కి చెబుతానన్న అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పడంతో విచారణ మధ్యాహ్నం రెండున్నరకు వాయిదా పడింది. 

Whats_app_banner

సంబంధిత కథనం