Bapatla Crime News : బాపట్ల జిల్లాలో ఘోరం - తల్లిదండ్రులను దారుణంగా చంపేసిన కన్న కొడుకు
బాపట్ల జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కన్న కొడుకే తల్లిదండ్రులను హత్య చేశాడు. రోకలి బండతో కొట్టి చంపేశాడు. స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.
బాపట్ల జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఆస్తుల కోసం ఏకంగా కన్న తల్లిదండ్రులనే కుమారుడు రోకలి బండతో అతి కిరాతకంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నిందితులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటన బాపట్ల జిల్లా బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… అప్పికట్లలో స్కూల్ హెడ్ మాస్టార్‌గా పని చేసి పదవీ విరమణ పొందిన పి.విజయ భాస్కరరావు (74), వెకంట సాయి కుమారి (70) దంపతులు సొంతంగా గృహం నిర్మించుకుని ఉంటున్నారు. ఈ దంపతలకు కిరణ్ అనే కుమారుడు ఉన్నాడు. కిరణ్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నాడు.
అయితే తల్లిదండ్రులు, కుమారుడు మధ్య ఆస్తుల విషయంలో గొడవులు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. కిరణ్ నాలుగు రోజుల క్రితమే అప్పికట్ల వచ్చాడు. అప్పటి నుంచి అప్పికట్లలోనే ఉంటూ తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. ఆస్తుల పంపకాల విషయంలో తల్లిదండ్రులకు ఆయనకు వివాదం ఏర్పడింది. దీంతో శనివారం తెల్లవారుజామున గాఢనిద్రలో ఉన్న తలిదండ్రులను కుమారుడు కిరణ్ రోకలి బండతో విచక్ష రహితంగా దాడి చేసి హతమార్చాడు.
స్థానికులకు శబ్ధాలు రావడంతో లేచి ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. రక్తకపు మడుగుల్లో ఉన్న వృద్ధ దంపతులను చూసి కన్నీరు మున్నీరు అయ్యారు. వెంటనే నిందితుడు కిరణ్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న తరువాత, స్థానికులు నిందితుడు కిరణ్‌ను పోలీసులకు అప్పగించారు. పోలీసులు కిరణ్‌ను బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కన్న కొడుకే దారుణంగా హత్య చేయడంతో ఆ ప్రాంతంలో సంచలనమైంది. ఈ ఘటనతో అప్పికట్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరు అయ్యారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. నిందితుడు, మృతుల కుమారుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. ఆయనపై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ఇంటివద్ద పోలీసులు పహారా కాశారు. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు కుటుంబ సభ్యులను, నిందితుడు కిరణ్‌ను విచారిస్తున్నారు. డిఎస్పీతో పాటు బాపట్ల ఎస్ఐ తదితరులు ఉన్నారు.
కిరణ్‌కు మతి స్థితిమితం పని చేయక సైకోలా ప్రవర్తిస్తాడని గ్రామస్థులు అంటున్నారు. గతంలో సొంత కొడుకునే హత్య చేశాడని, భార్య కూడా విడిచిపెట్టి వెళ్లిపోయిందని తెలిపారు. గత పది రోజుల నుంచి మెడిసన్ కూడా వాడటం లేదన్నారు. సొంత తల్లిదండ్రులనే హత్య చేస్తాడని అనుకోలేదని పేర్కొంటున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం