Mohan Babu: నేనెక్కడికి పారిపోలేదు...ఇంట్లోనే ఉన్నా -బెయిల్ రద్దు వార్తలపై మోహన్‌బాబు ట్వీట్
Mohan Babu: మీడియా ప్రతినిధిపై దాడిచేసిన కేసులో మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ రద్ధయినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులకు దొరక్కుండా మోహన్‌బాబు తప్పించుకొని తిరుగుతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లపై మోహన్‌బాబు ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు.
Mohan Babu: మీడియా ప్రతినిధిపై దాడికేసులో సినీ నటుడు మోహన్‌బాబుపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు మోహన్‌బాబు. ఈ బెయిల్ పిటీషన్‌ను కోర్టు తిరస్కరించడంతో మోహన్‌బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు పుకార్లు షికారు చేస్తోన్నాయి. ప్రస్తుతం మోహన్‌బాబు కోసం పోలీసులు వెతుకుతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
ఇంట్లోనే ఉన్నా...
ఈ పుకార్లపై ట్విట్టర్ ద్వారా మోహన్‌బాబు బదులు ఇచ్చాడు. తాను ఎక్కడికి పారిపోలేదని, ఇంట్లోనే ఉన్నట్లు చెప్పాడు.తన యాంటిస్పెటరీ బెయిల్ (ముందస్తు బెయిల్) పిటిషన్ రిజెక్ట్ కాలేదని అన్నాడు. తాను ఎక్కడికి పారిపోలేదని, ఇంట్లోనే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నానని మోహన్‌బాబు ట్వీట్‌లో పేర్కొన్నాడు. అసత్యాల్ని ప్రచారం చేయవద్దని, మీడియా కూడా నిజాలు తెలుసుకొని వార్తలు రాస్తే బాగుంటుందని ట్వీట్‌లో చెప్పాడు మోహన్‌బాబు ట్వీట్ వైరల్ అవుతోంది.
ఆస్తుల వివాదం...
మంచు ఫ్యామిలీలో మొదలైన ఆస్తుల వివాదం గొడవలకు దారితీసింది. మోహన్‌బాబు, మనోజ్ ఒకరిపై మరొకరు పోలీస్ కేసులు పెట్టుకున్నారు. మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని డీజీపీకి మోహన్‌బాబు లేఖ రాశారు. ఏడు నెలల తన కూతురిని చూడనివ్వకుండా, ఇంట్లో అడుగుపెట్టకుండా తండ్రి మనుషులు తనను అడ్డుకుంటున్నారని, తనపై దాడులు చేశారంటూ మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చారు.
మోహన్‌బాబు క్షమాపణలు...
ఈ గొడవను కవరేజ్ చేస్తోన్న మీడియా ప్రతినిధిపై ఆవేశంలో మోహన్‌బాబు దాడిచేశాడు. అతడు హాస్పిటల్ పాలవ్వడంతో మోహన్‌బాబుపై కేసు నమోదు అయ్యింది. ఈ ఘటనపై మోహన్‌బాబుతో పాటు విష్ణు, మనోజ్ కూడా మీడియా ప్రతినిధికి క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పిన కూడా కేసు మాత్రం విత్‌డ్రా కాలేదు.
పరిష్కారం దిశగా...
ప్రస్తుతం మోహన్‌బాబు, మనోజ్ మధ్య గొడవ సద్ధుమణిగినట్లు సమాచారం. గొడవలు లేకుండా సమస్యను పరిష్కరించే దిశగా సన్నిహితులు ప్రయత్నాలు చేస్తోన్నట్లు సమాచారం.
కన్నప్ప మూవీలో...
ప్రస్తుతం మోహన్‌బాబు, విష్ణు కలిసి కన్నప్ప సినిమా చేస్తోన్నారు. ఈ మైథలాజికల్ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. విష్ణు స్వయంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. కన్నప్ప సినిమాలో ప్రభాస్, అక్షయ్‌కుమార్, మోహన్‌లాల్, కాజల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మరోవైపు మనోజ్ భైరవం సినిమాలో నటిస్తోన్నాడు. గరుడన్ రీమేక్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఇతర హీరోలుగా కనిపించబోతున్నారు.