Swarnandhra 2047 : చంద్రబాబు మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.. విజన్ 2047పై షర్మిల సెటైర్లు-ys sharmila satire on the swarnandhra vision 2047 document ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Swarnandhra 2047 : చంద్రబాబు మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.. విజన్ 2047పై షర్మిల సెటైర్లు

Swarnandhra 2047 : చంద్రబాబు మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.. విజన్ 2047పై షర్మిల సెటైర్లు

Basani Shiva Kumar HT Telugu
Dec 14, 2024 10:29 AM IST

Swarnandhra 2047 : ఏపీ ద‌శ దిశ‌ను మార్చేలా స్వర్ణాంధ్ర – 2047 విజన్‌ను ఆవిష్కరించామని.. సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందించారు. చంద్రబాబు మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శలు గుప్పించారు. మోదీ, చంద్రబాబు, జగన్ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు.

షర్మిల
షర్మిల

విజన్ 2047 పేరుతో చంద్రబాబు మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ దశ - దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలని స్పష్టం చేశారు. దశాబ్ద కాలంగా విభజన హామీలను గాలికి వదిలేశారు.. పూర్తిగా అటకెక్కించారని ఫైర్ అయ్యారు.

'రాష్ట్ర విభజన సమయంలో అనాడు యూపీఏ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. నూతన రాజధానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ఇవ్వాలని సూచించింది. బుందేల్ ఖండ్ తరహాలో వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటన చేసింది. మౌలిక సదుపాయాల కల్పన, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని షెడ్యూల్ 13 లో పొందపరించింది' అని షర్మిల వివరించారు.

'కడప స్టీల్, దుగ్గరాజుపట్నం పోర్టులను నిర్మిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో పొందపరించింది. నూతన రైల్వే జోన్, పెట్రోలియం యూనివర్సిటీ, విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విజయవాడ, విశాఖలో మెట్రో రైల్, హైదరాబాద్ నుంచి విజయవాడకు ర్యాపిడ్ రైల్, ఇలా ఎన్నో హామీలు నేటికీ కలగానే మిగిలాయి. ఇవ్వాళ్టికి ఒక్క హామీకి దిక్కులేకుండా పోయింది' అని షర్మిల ట్వీట్ చేశారు.

'గడిచిన 10 ఏళ్లలో ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పన్నుల్లో రాయితీలు ఉండేవి. వేల సంఖ్యలో కొత్త పరిశ్రమలు వచ్చేవి. లక్షల్లో ఉపాధి అవకాశాలు లభించేవి. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది. విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ నిర్మాణం జరిగితే ప్రధాన నగరాలుగా అభివృద్ధి చెందేవి. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు అంది వుంటే పేదరిక నిర్మూలన సాధ్యం అయ్యేది. విభజన హామీలు అమలయ్యి ఉంటే రాష్ట్రం దిశ - దశ పూర్తిగా మారేది. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లేది' అని షర్మిల వ్యాఖ్యానించారు.

'విభజన చట్ట హామీలు బుట్టదాఖలు చేయడంలో ప్రధాన ముద్దాయి ప్రధాని నరేంద్ర మోదీ అయితే, రెండో ముద్దాయి చంద్రబాబు, మూడో ముద్దాయి జగన్ మోహన్ రెడ్డి. ఈ ముగ్గురు కలిసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తామని మోదీ నమ్మబలికితే.. హోదా ఏమైనా సంజీవనా అని చంద్రబాబు చెవుల్లో పూలు పెట్టారు' అని సెటైర్లు వేశారు.

'25 మంది ఎంపీలు ఇస్తే ఎందుకు ఇవ్వరో చూస్తా అని శపథాలు చేసిన జగన్.. రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారు. చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎప్పటికైనా రాష్ట్ర అభివృద్ధికి సంజీవని ప్రత్యేక హోదా మాత్రమే. హోదాతోనే రాష్ట్రానికి విజన్. మోదీ పిలక మీ చేతుల్లో ఉంది. విభజన హామీలపై ప్రధానిని నిలదీయండి. కేంద్రం గల్లా పట్టి రాష్ట్ర హక్కులను సాధించండి' అని షర్మిల డిమాండ్ చేశారు.

Whats_app_banner