CBN on Jamili Elections : జమిలి అమల్లోకి వచ్చినా.. ఎన్నికలు జరిగేది 2029 లోనే : చంద్రబాబు-ap cm chandrababu naidu interesting comments about jamili elections ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn On Jamili Elections : జమిలి అమల్లోకి వచ్చినా.. ఎన్నికలు జరిగేది 2029 లోనే : చంద్రబాబు

CBN on Jamili Elections : జమిలి అమల్లోకి వచ్చినా.. ఎన్నికలు జరిగేది 2029 లోనే : చంద్రబాబు

Basani Shiva Kumar HT Telugu
Dec 14, 2024 12:27 PM IST

CBN on Jamili Elections : జమిలి ఎన్నికలపై ఇటీవల కీలక అప్‌డేట్ వచ్చింది. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోంది ముఖ్యంగా వైసీపీ జమిలిపై ఆశగా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు
చంద్రబాబు

ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మద్దతు ప్రకటించామని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 202 9లోనే అని చెప్పారు. వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'వైసీపీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారు. వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతిచోటా చర్చ జరగాలి. విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలి. గత పరిస్థితులను బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరికి కనిపిస్తున్నాయి' అని చంద్రబాబు వివరించారు.

'2047 లోనూ ఇదే పునరావృతం అవుతుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒక రోజు పెట్టి వదిలేసేది కాదు. భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ప్రయత్నంలో అందరు భాగస్వామ్యం కావాలి. రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ 2047. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయి. ఈసారి కలెక్టర్ల సదస్సులో ఎన్నో మార్పులు తీసుకొస్తాం' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

'సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు, సమాధానాల రూపంలో నిర్వహిస్తాం. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చ అంశాలు పంపి సమాధానాలు కోరతాం. సమయం సద్వినియోగం, మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం పెరుగుతుంది. ఆస్పత్రిలో చేరిన అద్వానీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. అద్వానీ నాకు దశాబ్దాలుగా అనుబంధం ఉంది. ఆనాడు ఏపీ అభివృద్ధిలో అద్వానీ సహకారం మరువలేనిది' అని చంద్రబాబు గుర్తుచేశారు.

Whats_app_banner