AP E Crop Benifits: వాస్తవ సాగుదారులకే ప్రభుత్వ ప్రయోజనాలు, ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం, ఈ పంట నమోదులో మార్గదర్శకాలు-the benefits of e crop for the original farmers only key decision of the ap government ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap E Crop Benifits: వాస్తవ సాగుదారులకే ప్రభుత్వ ప్రయోజనాలు, ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం, ఈ పంట నమోదులో మార్గదర్శకాలు

AP E Crop Benifits: వాస్తవ సాగుదారులకే ప్రభుత్వ ప్రయోజనాలు, ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం, ఈ పంట నమోదులో మార్గదర్శకాలు

Sarath chandra.B HT Telugu
Aug 08, 2024 10:00 AM IST

AP E Crop Benifits: అసలైన సాగుదారుడికే.. ప్రభుత్వ రైతు ప్రయోజనాలను అందించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పంటలో సాగు చేస్తున్న రైతుల్ని మాత్రమే లబ్దిదారులుగా నమోదు చేయాలని ఆదేశించారు.

సాగుదారులకే ప్రభుత్వ పంటల ప్రయోజనాలు
సాగుదారులకే ప్రభుత్వ పంటల ప్రయోజనాలు

AP E Crop Benifits: రైతులకు బహుళ ప్రయోజనాలు అందించే ఏపీ ప్రభుత్వ ఈ- పంటలో రైతుల్ని రిజిస్టర్ చేసే సమయంలో వాస్తవ సాగుదారులను మాత్రమే నమోదు చేయాలని ఏపీ ప్రభుత్వ వ్యవసాయ, సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ ఆదేశించారు.

రాష్ట్రములోని అన్ని రకాల వ్యవసాయ అధికారులకు ఇటీవల ప్రవేశ పెట్టిన ఈ - పంట డిజిటల్ వెబ్ అప్లికేషన్‌లో రైతుల వివరాల నమోదుపై అవగాహన కల్పించారు.

ఈ పంట యాప్‌లో రైతులు సాగు చేస్తున్న పంట వివరములను నమోదు చేసుకోవటం ద్వారా, ప్రభుత్వం అందించే అన్ని వ్యవసాయ పథకాలకు అర్హత పొందుతారు. పంటల బీమా, వడ్డీలేని పంట రుణాలు, కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తుల అమ్మకాలకు అవకాశం కల్పిస్తారు. పంటల సాగు నుంచి మార్కెట్లో విక్రయాల వరకు రైతులకు ఉపకరించే సమాచారం కాబట్టి రైతులంతా సాగు వివరాలను ఈ పంట లోనమోదు చేసుకోవాలని సూచించారు.

NIC సహకారంతో అదనపు ఫీచర్లను జోడించి ఈ పంట యాప్‌ను సిద్ధం చేవారు. సర్వే నంబర్ ఆధారంగా రైతుల వివరాలను సమగ్ర భూ వివరాలతో కలిపి జియో ఫెన్సింగ్ చేస్తారు. దీని ద్వారా పంట సాగు వివరాల నమోదులో ఖచ్చితత్వానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.

రైతులను నమోదు చేసే సమయంలో సంబంధిత పొలాన్ని సాగు చేస్తున్న అసలైన రైతులు/సాగు దారులను మాత్రమే నమోదు చేయాలని ఆదేశించారు. రాతపూర్వక ఒప్పందాలు, CCRC కౌలు కార్డులు పొందకుండా, వాస్తవంగా సాగు చేస్తున్న వారిని క్షేత్ర స్థాయిలో నిజనిర్ధారణ చేసుకుని వారిని వాస్తవ సాగుదారుడుగా పరిగణించి నమోదు చేయాలని ఆదేశించారు. రైతుల వివరాల నమోదు, ఈ- పంట నమోదులో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకృతి వ్యవసాయము చేస్తున్న రైతుల వివరములను నమోదు చేయాలని సూచించారు.

రైతులకు పంట సాయం, పంట నష్టరిహారం, పంటల బీమా, ఇతరత్రా ప్రభుత్వ పథకాలు అందాలంటే ఈ-పంట నమోదు తప్పనిసరి అని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో అధికారులు బాధ్యతగా తీసుకోవాలని, ఈ ప్రక్రియను తూతూమంత్రంగా చేయొద్దని చెప్పారు.

రైతులు ఒక రకం పంట సాగు చేస్తే, మరో పంటను సాగు చేసినట్లు నమోదు చేస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సాగుదారుల్లో యజమాని, కౌలుదారు వివరాలపై స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. రీ సర్వే తర్వాత ఉద్యానవన పంటల వివరాలను మరోసారి ఈ-క్రాప్‌ ద్వారా నమోదు చేయాలని ఆదేశించారు.

వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, సర్వే సహాయకులతో కలిసి రోజూ కనీసం వారి పరిధిలో 50 ఎకరాలకు తక్కువ కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన, నమోదు చేపడుతున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు సమీక్షలో వివరించారు.యాప్‌లో నమోదైన వివరాలతో సరిపోల్చుకుని జియో కో-ఆర్డినేటర్స్‌తో సహా పంటల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేస్తున్నట్లు వివరించారు. రైతులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నమోదు చేసిన వివరాలన్నీ రైతుతో ధృవీకరించి, రైతు వేలిముద్ర తీసుకోగానే యాప్‌ ద్వారానే సంబంధిత ఫోన్‌ నంబరుకు డిజిటల్‌ రశీదును జారీ చేస్తున్నారు.