Pawan Kalyan : సార్.. మూడు నెలలుగా జీతాలు లేవు.. మీరే మాకు దిక్కు.. పవన్ వద్ద ఉద్యోగుల ఆవేదన
Pawan Kalyan : మూడు నెలలుగా జీతాలు లేవని.. ఆర్‌డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు పవన్ కళ్యాణ్ వద్ద వాపోయారు. చలించిపోయిన డిప్యూటీ సీఎం పెండింగ్ జీతాలు క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్టీల్‌ప్లాంట్ పోరాట కమిటీ నేతలు కూడా పవన్‌ను కలిశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆర్‌డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు కలిశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా జీతాలు లేవని ల్యాబ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి బాధను చూసి చలించిపోయిన డిప్యూటీ సీఎం.. పెండింగ్ జీతాలు క్లియర్ చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఉద్యోగం తిరిగి ఇప్పించి ఆదుకోవాలంటూ.. జి.సుజన కుమారి అనే దివ్యాంగురాలు పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేసింది. కడప జిల్లా కమలాపురం ల్యాబ్‌లో గత పదేళ్లుగా హెల్పర్‌గా పని చేస్తున్న తనను .. మూడు నెలల కిందట విధులు నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టుకతో ఒక కిడ్నీ లేదని, బరువులను ఎత్తే పనులు చేయలేనని చెప్పారు. ఏ ఆధారం లేని తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని సుజన కుమారి వేడుకున్నారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్.. అధికారులతో ఈ విషయమై మాట్లాడతానని భరోసా ఇచ్చారు.
స్టీల్‌ప్లాంట్ పోరాట కమిటీ నేతలు పవన్‌ను కలిశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ప్లాంట్ నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడితేవాలని కోరారు. కేంద్రంపై పవన్ ఒత్తిడి తేవాలని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. సోమవారం ఢిల్లీలో స్టీల్, ఆర్థిక శాఖల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. దీనికి ఒక రోజు ముందు కార్మిక సంఘాలతో.. పవన్‌కల్యాణ్ భేటీ కావడంతో ఆసక్తి నెలకొంది.
గిరిజన ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు, రోగులు రోడ్డు సదుపాయం లేక డోలి కట్టుకుని వాగులు దాటించే పరిస్థితిని గురించి.. తన పోరాట యాత్రలో స్వయంగా తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. వారి సమస్యని గుర్తించి, అధ్యయనం చేసి పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రూ.280 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.