Jagan : సనాతన ధర్మం అంటే ఏంటో పవన్ కళ్యాణ్‌కు తెలుసా : జగన్
Jagan : ఏపీలో తిరుమల లడ్డూ ఇష్యూపై ఇంకా పొలిటికల్ డైలాగ్స్ పేలుతూనే ఉన్నాయి. తాజాగా మాజీ సీఎం జగన్ సుప్రీం కోర్టు ఆదేశాలపై స్పందించారు. ఇదే సమయంలో.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఫైర్ అయ్యారు. అసలు పవన్ కళ్యాణ్‌కు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా అని జగన్ ప్రశ్నించారు.
తిరుమల లడ్డూ ఇష్యూపై సుప్రీం కోర్టు ఆదేశాల పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందించారు. సిట్ అవసరంలేదు.. బిట్ అవసరం లేదు.. అసలు ఏం జరగనిదానికి విచారణ ఎందుకు..? అని జగన్ ప్రశ్నించారు. జరగనిదాన్ని జరిగిందని పదేపదే ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. ఏ అధికారులు వచ్చి ఏం చేస్తారు.. తప్పుడు రిపోర్ట్ ఇచ్చినా.. తప్పుడు ప్రచారం చేసినా స్వామివారే చూసుకుంటారు అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
పవన్‌కు తెలుసా..
'సనాతన ధర్మం అంటే పవన్‌కు తెలుసా. శ్రీవారి విశిష్ఠతను దెబ్బతీయడంలో పవన్ భాగమయ్యారు. మన లడ్డూ విశిష్ఠతను మనమే తగ్గించుకుంటున్నాం. మన లడ్డూను మనమే విమర్శిస్తూ సనాతన ధర్మం అనడమేంటి.. తప్పుచేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తెలిసి తెలిసి వెంకటేశ్వరస్వామితో ఆడుకుంటారా. వెంకటేశ్వరస్వామే అన్నీ చూసుకుంటాడు. కల్తీనే జరగలేదు.. ఇక సిట్‌తో పనిలేదు. రెక్కలుకట్టుకుని అబద్ధాలు ప్రచారంచేస్తున్నారు' అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నిజస్వరూపం తెలిసింది..
'చంద్రబాబు నిజస్వరూపం సుప్రీంకోర్టుకు తెలిసింది. చంద్రబాబు వేసిన సిట్‌ను సుప్రీంకోర్టు రద్దుచేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పింది. రాజకీయ డ్రామాలు చేయొద్దని హెచ్చరించింది. లడ్డూలో జంతువుల కొవ్వు వాడారని అబద్ధాలు చెప్పారు. తిరుమలను చంద్రబాబు అపవిత్రం చేశారు. సుప్రీంకోర్టు చంద్రబాబుకు మొట్టికాయలు వేసింది. చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేదు. చంద్రబాబులో పశ్చాత్తాపం కనిపించడంలేదు. ఇప్పుడు బరితెగించి అబద్ధాలు చెబుతున్నారు' అని జగన్ విమర్శలు గుప్పించారు.
మరింత దిగజారుతున్నారు..
'అబద్ధాలు చెబుతూ చంద్రబాబు రోజురోజుకూ మరింత దిగజారిపోతున్నారు. చంద్రబాబు, ఈవో ప్రకటనలకు వ్యత్యాసం ఉంది. టీటీడీలో గొప్ప వ్యవస్థ ఉంది. ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ లేకుంటే ట్యాంకర్లను అనుమతించరు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పాం. నేను సీఎంగా ఉన్నప్పుడు కూడా పలుమార్లు ట్యాంకర్లను వెనక్కి పంపాం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా టీటీడీ అధికారులు ట్యాంకర్లను వెనక్కి పంపారు. అన్నీ తెలిసి చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు' అని జగన్ వ్యాఖ్యానించారు.
సుప్రీం కీలక ఆదేశాలు..
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కొత్త సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కొత్త సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, రాష్ట్ర సర్కార్ నుంచి ఇద్దరు పోలీస్ అధికారులు.. సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారితో స్వతంత్ర దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో విచారణ జరగనుంది. కొత్త సిట్ బృందం కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. ఈ అంశంపై రాజకీయ డ్రామాలు వద్దని అపెక్స్ కోర్టు స్పష్టం చేసింది.