CM Chandrababu : నేటి నుంచి ఎవరూ చెత్త పన్ను కట్టాల్సిన అవసరం లేదు, సీఎం చంద్రబాబు ప్రకటన-machilipatnam cm chandrababu announced garbage tax abolished from oct 2nd onwards ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : నేటి నుంచి ఎవరూ చెత్త పన్ను కట్టాల్సిన అవసరం లేదు, సీఎం చంద్రబాబు ప్రకటన

CM Chandrababu : నేటి నుంచి ఎవరూ చెత్త పన్ను కట్టాల్సిన అవసరం లేదు, సీఎం చంద్రబాబు ప్రకటన

Bandaru Satyaprasad HT Telugu
Oct 02, 2024 01:58 PM IST

CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం విధించిన చెత్త పన్నును రద్దు చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం చేపట్టారు.

 నేటి నుంచి ఎవరూ చెత్త పన్ను కట్టాల్సిన అవసరం లేదు, సీఎం చంద్రబాబు ప్రకటన
నేటి నుంచి ఎవరూ చెత్త పన్ను కట్టాల్సిన అవసరం లేదు, సీఎం చంద్రబాబు ప్రకటన

CM Chandrababu : ఇవాళ్టి నుంచి ఎవరూ చెత్తకు పన్ను కట్టాల్సిన అవసరంలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. చెత్త మీద పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కేబినెట్ లో ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న మరో చెత్త నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. మచిలీపట్నంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హి సేవ కార్యక్రమం చేపట్టారు. మచిలీపట్నంలో స్వచ్ఛత సేవా కార్యక్రమంలో అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగుతూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

2029కి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం

మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతం నేర్పించారని, బానిసత్వం వద్దు స్వాతంత్ర్యమే ముద్దు అని నినదించారని సీఎం చంద్రబాబు తెలిపారు. 2014 అక్టోబర్‌ 2న ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్‌ పథకాన్ని ప్రారంభించారన్నారు. నీతి ఆయోగ్‌లో స్వచ్ఛభారత్‌పై సబ్ కమిటీ ఏర్పాటు చేశారని, దానికి తానే ఛైర్మన్‌గా ఉన్నానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఏపీని ఓడీఎఫ్ రాష్ట్రంగా మార్చామన్నారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామన్నారు.

గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ సెంటర్లు ఏర్పాటు చేశామని, అయితే చెత్త తీసుకెళ్లడం మానేసి, షెడ్లకు సొంతానికి వాడుకున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. పెద్ద మనసుతో సాలిడ్ వేస్ట్ కు షెడ్‌లు పెడితే కేంద్రం అందుకు నిధులు ఇచ్చిందన్నారు. వాటిని ఇష్టం వచ్చినట్లు చేసి నిధులు లేకుండా చేశారన్నారు. కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్లు కేవలం రెండు మాత్రమే పని చేస్తున్నాయన్నారు. మిగతావన్నీ పనికి రాకుండా చేశారని ఆరోపించారు. చెత్త నుంచి కరెంటు తయారీ ప్లాంట్లు పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రోడ్ల మీద చెత్త ఉండేందుకు వీలు లేదన్నారు. 2029 గాంధీ జయంతి నాటికి ఏపీని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా తయారు చేయాలని సీఎం పిలుపునిచ్చారు.

పింగళి వెంకయ్య పేరుపై వైద్య కళాశాల

వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రోడ్లపై 85 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త కుప్పలుగా పేరుకుపోయిందన్నారు. సంవత్సరం ఈ చెత్తంతా శుభ్రం చేయించాలని పురపాలక మంత్రి నారాయణను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలన్నారు. భవిష్యత్తులో రోడ్లపై చెత్త ఉండకూడదన్నారు. ప్రజల ఆరోగ్యం బాగుందంటే దానికి స్వచ్ఛ సేవకులే కారణమన్నారు. ఆంధ్ర జాతీయ కళాశాలను కబ్జా చేశారని, దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పేరుపై వైద్యకళాశాల ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.

సంబంధిత కథనం