CM Chandrababu : ‘తిరుమల వెళ్లొద్దని నీకు నోటీసు ఇచ్చారా..? ఇస్తే చూపించు’ - జగన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్
తిరుమల పర్యటనపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అసలు తిరుమల వెళ్ళటానికి జగన్ కే ఇష్టం లేదని విమర్శించారు. వెళ్తే అక్కడ స్వామి వారి మీద నమ్మకం అని సంతకం పెట్టాల్సి వస్తుందని గుర్తు చేశారు. సంతకం పెట్టటం ఇష్టం లేకపోవటమే జగన్ అసలు సమస్య అంటూ కౌంటర్ ఇచ్చారు.
తనను తిరుమలకు వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకుందంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. అసలు తిరుమల వెళ్ళటానికి జగన్ కే ఇష్టం లేదన్నారు.ఎక్కడ డిక్లరేషన్ పై సంతకం పెట్టాల్సి వస్తోందో అని… లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతకం పెట్టడం ఇష్టం లేకపోవటమే జగన్ సమస్య అంటూ కౌంటర్ ఇచ్చారు.
నా ఇష్టం అంటే ఎలా..?
“చట్టాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ, తిరుమల వచ్చినప్పుడు, ఆ ఆచారాలను గౌరవించి తిరుమలలో వెంకన్న దర్శనం చేసుకున్నారు. ఒక పక్క నువ్వే బైబిల్ చదువుతాను అంటున్నావ్. ఎవరి మతం వారిది, అందులో తప్పు లేదు. కానీ హిందువుల మనోభావాలు గౌరవించాలి కదా ? నా ఇష్టం అంటే ఎలా కుదురుతుంది ..?” అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
సమాజంలో ఏ మతానికైనా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎవరైనా అవి ఆచరిస్తేనే అక్కడకు వెళ్ళాలని అభిప్రాయపడ్డారు. ఆచారాలు, సాంప్రదాయాల కంటే ఏ వ్యక్తి గొప్ప వాడు కాదన్న ఆయన.. దేవుడి ఆచారాలని ధిక్కరించేలా ఎవరూ మాట్లాడకూడదన్నారు. అవి పాటించను, అంతా నా ఇష్టం అంటే ఎలా అని జగన్ ను ప్రశ్నించారు.
జగన్.. అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నావ్..? - సీఎం చంద్రబాబు
“తిరుమల గుడికి వెళ్ళకుండా సాకులు ఎతుక్కున్నాడు. నిన్ను గుడికి వెళ్లొద్దు అని పోలీసులు నోటీసులు ఇచ్చారా ? నీకు దమ్ముంటే, నువ్వు గుడికి వెళ్ళవద్దు అని పోలీసులు నోటీసులు ఇచ్చివుంటే చూపించు. ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నావ్ …? స్వామి వారి గుడికి దళితులు రానివ్వరు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నావు. నువ్వు తిరుమల గుడికి వెళ్ళకుండా, నువ్వు సాకులు ఎతుక్కుంటూ, దళితులని లాగుతావ్ ఎందుకు..? మీ పార్టీ జెనెరల్ సెక్రటరీ పొన్నవోలు ఏమంటాడు ? స్వామి వారి ప్రసాదం రాగి, పంది కొవ్వు బంగారం అంటాడా ? కనీసం ఖండించావా జగన్..?” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీశారు.
జగన్ ఏమన్నారంటే..?
తనను తిరుమలకు వెళ్లకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఇవాళ తాడేపల్లిలో మీడిాయాతో మాట్లాడిన ఆయన…ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్తే అనుమతి లేదని అంటున్నారని చెప్పారు. ఆ కార్యక్రమంలో పాల్గొంటే అరెస్ట్ చేస్తామని వైసీపీ నేతలకు నోటీసులు ఇస్తున్నారని తెలిపారు.
ఓవైపు తననే కాకుండా వైసీపీ శ్రేణులను కూడా తిరుమలకు వెళ్లనివ్వడం లేదని జగన్ ఆరోపించారు. చుట్టు ప్రక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్లను తిరుమల తెప్పిస్తున్నారని చెప్పారు. టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకింత ప్రయత్నం చేస్తున్నారని జగన్ ప్రశ్నించారు.
లడ్డూ విషయంలో లేనిపోని విషయాలతో అడ్డగోలుగా చంద్రబాబు ఆలయ పవిత్రతను దెబ్బతీశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని అన్నారు. తిరుమల విశిష్టతను, ప్రసాదం పవిత్రతను రాజకీయ దురుద్దేశంతో దెబ్బతీస్తున్నారన్న జగన్… జరగని విషయాన్ని జరిగినట్టుగా కల్తీ నెయ్యి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఓ ముఖ్యమంత్రే సాక్షాత్తూ తిరుమలను దగ్గరుండి అపవిత్రం చేస్తున్నారని అన్నారు.
సంబంధిత కథనం