Rapaka Vara Prasadarao : వైసీపీ నన్ను అవమానించింది, ఇక ఆ పార్టీలో కొనసాగను- ట్విస్ట్ ఇచ్చిన రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక-razole ex mla rapaka vara prasada rao announced to leave ysrcp may join janasena or tdp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rapaka Vara Prasadarao : వైసీపీ నన్ను అవమానించింది, ఇక ఆ పార్టీలో కొనసాగను- ట్విస్ట్ ఇచ్చిన రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక

Rapaka Vara Prasadarao : వైసీపీ నన్ను అవమానించింది, ఇక ఆ పార్టీలో కొనసాగను- ట్విస్ట్ ఇచ్చిన రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక

Bandaru Satyaprasad HT Telugu
Oct 13, 2024 10:26 PM IST

Rapaka Vara Prasadarao : రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన త్వరలో వేరే పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ పెద్దలు చెప్పినట్లు చేసినా... తనకు రాజోలు టికెట్ కేటాయించలేదని ఆయన ఆవేదన చెందారు.

 వైసీపీ నన్ను అవమానించింది, ఇక ఆ పార్టీలో కొనసాగను- ట్విస్ట్ ఇచ్చిన రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక
వైసీపీ నన్ను అవమానించింది, ఇక ఆ పార్టీలో కొనసాగను- ట్విస్ట్ ఇచ్చిన రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక

కోనసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన... వైసీపీ కోసం ఎంతో కష్టపడినా...రాజోలులో తనకు టికెట్ ఇవ్వలేదన్నారు. తనను వైసీపీ అవమానించిందని ఆవేదన చెందారు. తనపై నమ్మకం లేక గొల్లపల్లి సూర్యారావుకు రాజోలులో టికెట్‌ ఇచ్చారన్నారు. తనకు ఇష్టం లేకపోయినా వైసీపీ పెద్దల సలహాతో అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేశానన్నారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలో మరో పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఐదేళ్లపాటు వైసీపీ పెద్దలు చెప్పినట్లు చేసినా 2024 ఎన్నికల్లో తనకు రాజోలు ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదని రాపాక ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇష్టలేకపోయినా ఎంపీగా నిలబెట్టారన్నారు. రాజోలు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి ఎంతో కష్టపడ్డానన్నారు. అయినా తనకు కాకుండా గొల్లపల్లి సూర్యారావుకి వైసీపీ తరఫున టికెట్ ఇచ్చారని రాపాక మండిపడ్డారు. ఈ విషయం తనను ఎంతో కలచివేసినట్లు... తన ప్రాధాన్యత లేని పార్టీలో ఉండదలచుకోలేదన్నారు. అందుకే వైసీపీని వీడుతున్నట్లు రాపాక ప్రకటించారు. అయితే ప్రస్తుతం తాను ఏ పార్టీలో చేరుతాననే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాపాక తెలిపారు. వైసీపీలో మాత్రం ఉండనని, వేరే పార్టీల నుంచి ఆహ్వానం వస్తే పరిశీలిస్తానన్నారు.

2019 ఎన్నికల్లో గెలిచి-వైసీపీకి జై కొట్టి

2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన రాపాక వరప్రసాద్‌... ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు. అయితే వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఆ పార్టీకి దగ్గరైన రాపాక...అనంతరం పార్టీలో చేరారు. జనసేనపై, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై రాపాక ఎన్నో సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక వైఎస్ జగన్ అండతో నియోజకవర్గంలో తనకు తిరుగులేదని భావించిన రాపాక... రాజోలు టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. తన కుమారుడి వివాహ కార్డుపై వైఎస్ జగన్, భారతి చిత్రాలు కూడా ముద్రించారు. అప్పట్లో ఇది వైరల్ అయ్యింది. జనసేన నుంచి గెలిచిన రాపాక... జగన్ కు జై కొట్టడంతో జనసైనికులు అప్పట్లో తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ రాపాక జనసేనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఐదేళ్లు వైసీపీకి మద్దతు తెలిపిన రాపాకను గ్లాస్ పార్టీలోకి ఆహ్వానిస్తారో? వద్దంటారో? ఈ విషయంపై జనసైనికులు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. మరో వైపు రాపాక టీడీపీ లేదా బీజేపీలో చేరే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం