Minister Wife Fire On Police : మంత్రి గారి భార్యకు కోపమొచ్చింది, కాన్వాయ్ కావాలంటూ పోలీసులపై చిందులు!-rayachoti minister ramprasad reddy wife fires on police for convey to escort video viral ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Minister Wife Fire On Police : మంత్రి గారి భార్యకు కోపమొచ్చింది, కాన్వాయ్ కావాలంటూ పోలీసులపై చిందులు!

Minister Wife Fire On Police : మంత్రి గారి భార్యకు కోపమొచ్చింది, కాన్వాయ్ కావాలంటూ పోలీసులపై చిందులు!

Bandaru Satyaprasad HT Telugu
Jul 01, 2024 09:00 PM IST

Minister Wife Fire On Police : పోలీసులు తనకు ఎస్కార్ట్ రావాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసులు చిందులేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

మంత్రి గారి భార్యకు కోపమొచ్చింది, కాన్వాయ్ కావాలంటూ పోలీసులపై చిందులు!
మంత్రి గారి భార్యకు కోపమొచ్చింది, కాన్వాయ్ కావాలంటూ పోలీసులపై చిందులు!

Minister Wife Fire On Police : మంత్రి గారి భార్యకు కోపం వచ్చింది. పింఛన్ల పంపిణీ వెళ్తున్న ఆమెకు ఎస్కార్ట్ గా రాలేదని అందరి ముందూ ఎస్సైపై చిందులు వేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. గత ప్రభుత్వంలో జరిగిన ఘటనలే మళ్లీ పునరావృతం అవుతున్నాయంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరికొందరు పోలీసుల్ని బానిసలుగా చూస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటన రాయచోటిలో చేటుచేసుకుంది.

yearly horoscope entry point

రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి పోలీసులపై చిందులేశారు. తనకు ఎస్కార్ట్ గా రావాలంటూ హుకూం జారీ చేశారు. పెన్షన్ల పంపిణీకి వెళ్లేందుకు పోలీస్ కాన్వాయ్ కావాలంటూ డిమాండ్ చేశారు. ఎస్ఐ రమేష్ ఆలస్యంగా వచ్చాడంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతుంది. కాన్ఫరెన్స్ లో ఉన్నానని ఎస్ఐ రమేష్ చెప్పగా సీఐకి లేని కాన్ఫరెన్స్ నీకేటంటూ ఎస్ఐపై ఆమె సీరియస్ అయ్యారు.

సీఎం చంద్రబాబు అసంతృప్తి

పోలీసులతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులతో మంత్రి భార్య హరితా రెడ్డి మాట్లాడిన తీరును సీఎం తప్పుపట్టారు. ఘటన తన దృష్టికి రావడంతో సీఎం మంత్రితో ఫోన్ లో మాట్లాడి వివరణ కోరారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అంతా గౌరవంగా మసలుకోవాలని...ఇలాంటి వైఖరిని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఏ స్థాయి వారు వ్యవహరించినా ఉపేక్షించేది లేదన్నారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి.....ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సీఎంకు తెలిపారు.

పోలీసులపై అసహనం

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దీంతో గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఆ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులపై ఈ ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలకు ఒకింత అసహనంపై ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం తమను ఉద్దేశపూర్వకంగా వేధించారని, అక్రమ కేసులు పెట్టారని గతంలో టీడీపీ, జనసేన ఆరోపించాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. టీడీపీ, జనసేన నేతలకు పవర్ వచ్చింది. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు. ఇటీవల స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ...గోడ దూకి వచ్చి తనను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు తనకు సెల్యూట్ చేస్తున్నారన్నారు. దీంతో ఏ మేరకు పోలీసులు వారిని ఇబ్బంది పెట్టారో అర్థమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

గతంలో పేర్ని నాని ఇప్పుడు మంత్రి భార్య

సోమవారం రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆమె నడిరోడ్డుపై పోలీసులపై మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉందని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు అధికారంలోకి వస్తే వారి మాటలు వినడమే పోలీసుల పనిగా మారిందని, ప్రజల భద్రత, క్రైమ్ కంట్రోల్ సెకండరీగా మారిపోయాయని విమర్శలు వస్తున్నాయి. వీఐవీ భద్రత, వారి కోసం ట్రాఫిక్ కంట్రోల్ మాత్రమే పోలీసుల విధుల మారిపోయాయంటున్నారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ లు రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా విశాఖ, విజయవాడల్లో అర్ధరాత్రులు గంజాయి బ్యాచ్ లో వీరంగం సృష్టిస్తున్నాయి. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఏపీతో లింక్ ఉంటుంది. ఇప్పటికైనా రాజకీయ నేతల సేవలో కాకుండా ప్రజల భద్రతపై పోలీసులు దృష్టి పెట్టాలని సామాన్యులు కోరుతున్నారు. ఇందుకు తగిన విధంగా రాజకీయ నేతలు కూడా వ్యవహరించాల్సి ఉంటుందంటున్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదనే సత్యం తెలుసుకుని వ్యవహరించాలని అభిప్రాయపడుతున్నారు. గతంలో పేర్ని నాని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇదే తరహాలో ఇప్పుడు మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసులపై మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందని, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం