AP Assembly Speaker Chintakayala Ayyanna Patrudu : ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ గా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రకటన చేశారు.
అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్య కుమార్… అయ్యన్నపాత్రుడిని స్పీకర్ ఛైర్ వద్దకు తీసుకెళ్లారు. సభాపతి స్థానంలో కూర్చొబెట్టారు. ప్రొటెం స్పీకర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత చంద్రబాబు… స్పీకర్ ఎన్నికను ఉద్దేశించి మాట్లాడారు. అయ్యన్నపాత్రుడి ప్రస్థానంపై ప్రశంసలు గుప్పించారు.
అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమని చంద్రబాబు అన్నారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అయ్యన్న అని కొనియాడారు. ఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచి ప్రజాసేవలో ఉన్నారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అయ్యన్న తనదైన ముద్రవేశారన్న చంద్రబాబు…. విశాఖ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని చెప్పారు.
చింతకాయల అయ్యన్నపాత్రుడు…తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఎన్టీఆర్ కేబినెట్ లోనూ మంత్రిగా పనిచేశారు. ఇటీవల ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన 24,676 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తాజా విజయంతో కలిసి ఇప్పటికి ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అయ్యన్నపాత్రుడు 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1996లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు. అయ్యన్న...ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా చంద్రబాబు కేబినెట్ స్థానం దక్కుతుందని భావించిన... యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో మంత్రి పదవి దక్కలేదు. అయితే ఆయనకు స్పీకర్ పదవిని ఖరారు చేశారు. దీంతో ఆయన శుక్రవారం నామినేషన్ వేయగా.. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఇవాళ… స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించారు. శాసనసభలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. మొదటి రోజు మొత్తం 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఇతర కారణాలతో సభకు రాని ముగ్గురు ఎమ్మెల్యేలు శనివారం(ఇవాళ) ప్రమాణస్వీకారం చేయనున్నారు.
గత ప్రభుత్వంలో కూడా ఉత్తరాంధ్రకే చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్ గా వ్యవహరించారు. ఈసారి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అయ్యన్నపాత్రుడికే స్పీకర్ ఛైర్ దక్కింది.
మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవిపై జనసేన ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి లేదా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్లను డిప్యూటీ స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరే కాకుండా…టీడీపీ నుంచి జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన మండలి బుద్ధా ప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ పదవిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.