Rahul Gandhi : వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను - వైఎస్ షర్మిల, సునీతకు మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్-rahul gandhi condemns threats to ap congress chief ys sharmila and ys sunitha ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rahul Gandhi : వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను - వైఎస్ షర్మిల, సునీతకు మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్

Rahul Gandhi : వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను - వైఎస్ షర్మిల, సునీతకు మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 04, 2024 11:26 AM IST

Rahul Gandhi Tweet About YS Sharmila : ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటు వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కించపరిచేలా సోషల్ మీడియాలో చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండించారు.

రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ (Twitter)

Rahul Gandhi Tweet About YS Sharmila and Sunitha : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు వివేకానందా రెడ్డి కుమార్తె వైఎస్ సునీతా రెడ్డిపై సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండించారు రాహుల్ గాంధీ. ఈ మేరకు ఆయన ట్విట్టర్(X)లో పోస్టు చేశారు. మహిళలను అవమానించడం… వారిపై ఇలాంటి దాడి చేయడం పిరికిపందే చర్యగా అభివర్ణించారు. దురదృష్టవశాత్తు ఇటీవలే కాలంలో ఇది కొందరికి ఒక ఆయుధంగా మారిపోయిందని దుయ్యబట్టారు. వైఎస్ షర్మిల, సునీతపై జరిగిన ఈ అవమానకర దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని చెప్పారు. ఇద్దరికి పార్టీతో పాటు తన మద్దతుగా ఉంటుందని తన పోస్టులో రాసుకొచ్చారు రాహుల్ గాంధీ.

ఇటీవలే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాణభయం ఉందని పేర్కొన్నారు. చంపేస్తామని సామాజిక మాధ్యామాల్లో పోస్టులు పెడుతున్నారని తెలిపారు. ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన పోస్టులతో పాటు తనను, వైఎస్ షర్మిలను బెదిరిస్తున్నారని వివరించారు. చంపేస్తాం, లేపేస్తామని బెదిరింపు పోస్టులను పెడుతున్నారని తన ఫిర్యాదులో ప్రస్తావి్ంచారు. పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదులో వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పేరును కూడా ప్రస్తావించారు వైఎస్ సునీత. తీవ్ర అభ్యంతరకరమైన, అసహ్యకరమైన రీతిలో పోస్టులు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రవీంద్ర రెడ్డి చేసే పోస్టులు తమ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయని చెప్పారు వైఎస్ సునీత. జనవరి 29న సోదరి షర్మిలతో పాటు ఇడుపులపాయ వెళ్లాననని… ఆ తర్వాత వర్రా రవీందర్ రెడ్డి తన పేజీలో నన్ను చంపేయాలి అని అర్థం వచ్చేట్టు ఒక పోస్ట్ పెట్టాడని తన ఫిర్యాదులో వివరించారు. రవీందర్ రెడ్డి ఫేస్‌బుక్‌ పోస్టులు భయాందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు.తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు, సీబీఐ కూడా ఫిర్యాదు చేశానని ఇందులో ప్రస్తావించారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు ఏపీ రాజకీయాల్లో అత్యంత సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కేసును పారదర్శకంగా విచారించాలంటూ…. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లారు సునీత. తనపై పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసును కూడా ఛాలెంజ్ చేశారు. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి… అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టులో వేసిన పిటిషన్ ను ఎందుకు వెనక్కి తీసుకున్నారని కూడా ప్రశ్నించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ తో పాటు వైెఎస్ అవినాశ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ప్రశ్నలవర్షం కురిపిస్తూనే ఉన్నారు వైఎస్ సునీతా రెడ్డి.

ఇదిలా ఉంటే ఇటీవలే వైెఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను చేపట్టారు. ఈ నేపథ్యంలో… సోదరుడు, సీఎం జగన్ ను తీవ్రస్థాయిలో దుయ్యబడుతున్నారు. ఏపీకి సంబంధించిన అంశాలతో పాటు వైఎస్ వివేకా కేసుపై కూడా పోరాడేందుకు షర్మిల వెనక్కి తగ్గటం లేదు.

IPL_Entry_Point

సంబంధిత కథనం