YS Sharmila Security : వైసీపీపై విమర్శల ఎఫెక్ట్, వైఎస్ షర్మిల భద్రత కుదింపు-కాంగ్రెస్ ఆరోపణ
YS Sharmila Security : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భద్రతను కుదించడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో షర్మిల యాక్టివ్ అవుతుండడంతో వైసీపీ ప్రభుత్వం దురుద్దేశంతో భద్రత తగ్గించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
YS Sharmila Security : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల... సీఎం జగన్, వైసీపీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. వైఎస్ఆర్ ఆశయాలకు సీఎం జగన్ తూట్లు పొడుతున్నారని, ఇప్పుడున్న జగన్ అసలు తన అన్నే కాదని ఘాటైన విమర్శలు చేస్తున్నారు. దీంతో వైఎస్ షర్మిలను వైసీపీ శ్రేణులూ టర్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నాయి. ఇక వైసీపీ నేతలతో తమదైన శైలి విమర్శలు చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల సమీపిస్తుండడంతో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఈ తరుణంలో షర్మిల సెక్యూరిటీని ప్రభుత్వం తగ్గించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా షర్మిల సెక్యూరిటీని తగ్గించిందని ఏపీ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. షర్మిలకు తొలుత 4+4 గా ఉండే భద్రతను ఆ తర్వాత 2+2కు తగ్గించారని, తాజాగా ఆ భద్రతను 1+1 కు తగ్గించారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
రఘువీరారెడ్డి ట్వీట్
తన భద్రత పెంచాలని జనవరి 22న డీజీపీకి వైఎస్ షర్మిల లేఖ రాశారు. అయినప్పటికీ డీజీపీ స్పందించలేదని ఏఐసీసీ నేత రఘువీరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత తగ్గించడంపై ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ముందు 4+4 సెక్యూరిటీ ఉండగా ఇప్పుడు 1+1కు తగ్గించినారన్నారు. కార్యకర్తల సమావేశాల నిమ్మిత్తం రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల పర్యటిస్తున్నారని, ఎన్నికల తరుణంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భద్రత తగ్గించడం సరికాదన్నారు. కాబట్టి అత్యవసరంగా షర్మిలకు 4+4 సెక్యూరిటీ, ఎస్కార్ట్ వాహన సౌకర్యం కల్పించాలని రఘువీరారెడ్డి డీజీపీని కోరారు.
దిల్లీలో షర్మిల దీక్ష
ఏపీ కాంగ్రెస్ నేతలకు దిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రేపు రాత్రికి ముఖ్య నేతలు దిల్లీ చేరుకోనున్నారు. ఫిబ్రవరి 2న ఏఐసీసీ ప్రతినిధులతో ఏపీ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు, ఏపీలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అంశాలపై జాతీయ స్థాయి నేతలకు షర్మిల వివరించనున్నారు. గత నాలుగున్నరేళ్లుగా ఏపీలో నెలకొన్న పరిస్థితులను జాతీయ నేతలకు షర్మిల వివరించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీతారాం ఏచూరి సహా విపక్ష నేతలను ఏపీ కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా, ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్‌తో వచ్చే నెల 2న దిల్లీలోని జంతర్ మంతర్‌లో వైఎస్ షర్మిల, కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టనున్నారు.
షర్మిలకు ప్రాణహాని
ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయిన షర్మిలకు భద్రత పెంచాలని ఆ పార్టీ నేతలతో పాటు టీడీపీ నేతలు కూడా కోరుతున్నారు. షర్మిలకు ప్రాణహాని ఉందని టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు భద్రత పెంచాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల విషయంలో సీఎం జగన్ కు తల్లి, చెల్లి, బాబాయ్ అని తేడా ఏం లేదన్నారు. రాజకీయంగా షర్మిలను ఎదుర్కోలేక అంతమొందించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అయ్యన్న పాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు వైఎస్ఆర్ ఇచ్చిన ఆస్తులలో వాటాను పంచకుండా సీఎం జగన్ ఆపుతున్నారని ఆరోపించారు. షర్మిల అంటే వైఎస్ఆర్ చాలా ఇష్టమని, అందుకే ఆస్తిలో వాటా రాశారన్నారు. ఆ ఆస్తిని షర్మిలకు చెందకుండా సీఎం జగన్ అడ్డుకుంటున్నారని అయ్యన్న ఆరోపించారు.