సీఎం జగన్‌ను వైఎస్ షర్మిల ఓడిస్తారా? కాంగ్రెస్ బలం ఎంత?-congress seeks resurgence in andhra pradesh with ys sharmila at helm can they beat jagan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  సీఎం జగన్‌ను వైఎస్ షర్మిల ఓడిస్తారా? కాంగ్రెస్ బలం ఎంత?

సీఎం జగన్‌ను వైఎస్ షర్మిల ఓడిస్తారా? కాంగ్రెస్ బలం ఎంత?

HT Telugu Desk HT Telugu
Jan 31, 2024 01:56 PM IST

ఏపీసీసీ అధ్యక్షురాలిగా వై.ఎస్.షర్మిల బాధ్యతలు స్వీకరించాక ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ చర్చలోకి వచ్చింది. మరి షర్మిల ప్రభావం ఏమేరకు ఉంటుంది. అన్న జగన్‌పై చెల్లెలు షర్మిల గెలుస్తారా? సీనియర్ జర్నలిస్టు బీఎస్ఎన్ మల్లేశ్వరరావు రాజకీయ విశ్లేషణ.

అన్నను ఢీకొడుతున్న చెల్లెలు వైఎస్ షర్మిల
అన్నను ఢీకొడుతున్న చెల్లెలు వైఎస్ షర్మిల (HT_PRINT)

వై.ఎస్.షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తన అన్న సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఆమె పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో సహజంగానే మీడియాలో ఆమెకు ప్రాధాన్యం పెరిగింది.

ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం అనే ట్యాగ్‌లైన్ ఉన్న షర్మిల సడెన్‌గా తెలంగాణ ఎందుకు వెళ్లారు? అక్కడ పార్టీ ఎందుకు పెట్టారు? దాన్ని విలీనం చేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు ఎందుకు చేపట్టారు? అనే ప్రశ్నలపై చాలామందికి ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు కాబట్టి ప్రజల్లో ఆమె పట్ల క్యూరియాసిటీ తగ్గలేదు.

బహుశా అందుకే ఆమె ప్రసంగాలను లైవ్ ఇస్తుంటే చంద్రబాబు నాయుడు లైవ్‌లకన్నా రెండింతలు ఎక్కువ మంది చూస్తున్నారు. అందుకే చంద్రబాబు అనుకూల మీడియాగా పేరుపడిన టీవీ5, ఏబీఎన్ లాంటి చానెళ్లు కూడా ప్రతిరోజూ షర్మిల లైవ్ ఇస్తున్నాయి.

తన వ్యాఖ్యల ద్వారా షర్మిల ఇప్పటికే జగన్‌ను చాలా ఇబ్బంది పెట్టారని అర్థమవుతోంది. పోలింగ్ తేదీకి మరో రెండు నెలలకు పైగా సమయం ఉన్నందున ఈలోపు ఇంకా ఇబ్బంది పెట్టొచ్చు. కుటుంబంలో జరిగిన వ్యవహారాలన్నింటినీ ఆమె బహిరంగంగా చర్చించడం వల్ల జగన్మోహన్ రెడ్డి వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులను కూడా కల్పించవచ్చు.

అయితే, ఇలాంటి వ్యాఖ్యలు, సభలు, సమావేశాల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోగలుగుతారా? అనేదే అసలు ప్రశ్న. కాంగ్రెస్ పార్టీయే ఆంధ్రప్రదేశ్‌ను విభజించింది అనే అంశంపై రాష్ట్రంలో ఓటర్లు అందరికీ క్లారిటీ ఉంది. పైగా, కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకులంతా విభజన తర్వాత వైసీపీలోకి లేదంటే టీడీపీలోకి వెళ్లిపోయారు. కొందరు మిగిలిపోయారు.

కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందా?

ఈ నేపథ్యంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శనను ఒకసారి పరిశీలిద్దాం. 175 నియోజకవర్గాలకు గాను 174 నియోజకవర్గాల్లో పోటీ చేయగా 10 నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ ప్రభావాన్ని చూపగలిగారు. అంటే పది నియోజకవర్గాల్లో మాత్రమే మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థులు సాధించారు. ఆ పది నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించగా, నాలుగు చోట్ల టీడీపీ అభ్యర్థులు, ఒక చోట జనసేన అభ్యర్థి గెలుపొందారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 12 నియోజకవర్గాల్లో వెయ్యి లోపు, 100 నియోజకవర్గాల్లో వెయ్యి నుంచి రెండు వేల లోపు ఓట్లు, 40 నియోజకవర్గాల్లో రెండు నుంచి మూడు వేల లోపు ఓట్లు, 14 నియోజకవర్గాల్లో మూడు నుంచి నాలుగు వేల లోపు ఓట్లు, 3 నియోజకవర్గాల్లో నాలుగు వేల నుంచి ఐదు వేల లోపు ఓట్లు, రెండు నియోజకవర్గాల్లో ఐదు వేలకు పైగా ఓట్లు, మరో రెండు నియోజకవర్గాల్లో ఆరు వేలకు పైగా ఓట్లు వచ్చాయి.

కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీరా రెడ్డి 28883 ఓట్లు సంపాదించుకున్నారు. అయినప్పటికీ ఆయనకు కూడా డిపాజిట్ దక్కలేదు. అంటే.. 174 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కలేదు.

ఈ ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారిందే తప్ప మెరుగుపడలేదు. ఏపీసీసీ అధ్యక్షుడిగా 2020లో రఘువీరా రెడ్డి స్థానంలో సాకే శైలజానాథ్ అధ్యక్షుడు అయ్యారు. 2022లో ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజు అధ్యక్షుడు అయ్యారు. 1951 నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఎంపికైన అధ్యక్షుల్లో గిడుగు రుద్రరాజు పీవీ నరసింహారావు తర్వాత రెండవ బ్రాహ్మణుడు. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయకుండానే పీసీసీ అధ్యక్షుడు అయిన మొదటి నాయకుడు కూడా బహుశా గిడుగు రుద్రరాజే. ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించేందుకు కూడా ఎవ్వరూ ముందుకురాని పరిస్థితి. ఎలాగొలా పార్టీని నడిపించడమే పెద్ద పని అయిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో.. ఎన్నికలకు మరో మూడు నెలలు సమయం ఉందనగా షర్మిల ఎంట్రీ ఇచ్చారు.

ఉనికి చాటుకుంటారా?

ఇప్పటికైతే ఇంకా రెండు నెలల సమయమే మిగిలి ఉంది. 175 నియోజకవర్గాలకు గాను ఒక్కో నియోజకవర్గంలో సగటున 2.5 లక్షల మంది ఓటర్లు, 250 పోలింగ్ బూగ్‌లు ఉన్నాయి అనుకుంటే.. ఒక్కో బూత్‌కు ఇద్దరు పోలింగ్ ఏజెంట్లు అయినా కాంగ్రెస్ పార్టీకి అవసరం. అంటే ఒక్కో నియోజకవర్గంలో కనీసం 500 మంది నిలబడగలిగే నాయకులు లేదా గట్టి కార్యకర్తలు కావాలి. వైఎస్ షర్మిల పోటీ చేస్తుంది అని ప్రచారంలో ఉన్న పులివెందుల నియోజకవర్గంలో 259 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. కడప పార్లమెంటు పరిధిలో అయితే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మరి వీటన్నింటిలోనూ పోలింగ్ ఏజెంట్లను నియమించుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందా? అన్న ప్రశ్న కూడా కొందరి నుంచి వస్తోంది.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోను, ఇతర కొన్ని రాష్ట్రాల్లోనూ చేసినట్లుగానే ఏపీలో కూడా అభ్యర్థుల నుంచి అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలు పెట్టింది. కానీ, దానికి కూడా ఆశించినంత స్థాయిలో స్పందన రాలేదనే వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ఇలా అప్లికేషన్లు స్వీకరించినా కూడా వాటిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండానే టికెట్లు కేటాయించిన పరిస్థితి. మరి ఏపీలో అప్లికేషన్లను ఏం చేస్తారనేది వేచి చూడాలి.

దూకుడు కలిసొస్తుందా?

ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ జిల్లాల పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్న వైఎస్ షర్మిలకు పార్టీ సీనియర్ నాయకుల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. అలాగే, ఇతర పార్టీల్లో ఉన్న పాత కాంగ్రెస్ నాయకులను కూడా ఆమె కలుస్తున్నారు. వారిలో కొందరిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు కూడా. ఈ విషయంలో ఆమె ఎంత విజయవంతం అయితే కాంగ్రెస్ పార్టీ అంత బలపడే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు గన్నవరం నియోజకవర్గంలో దుట్టా రామచంద్రరావును కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల ఆహ్వానించారు. బాపులపాడు మండలంలో కీలక నాయకుడిగా ఉన్న ఆయన కాంగ్రెస్‌లో చేరి, అసెంబ్లీ ఎన్నికల్లో కనుక పోటీ చేస్తే.. గత ఎన్నికల్లో లాగానే ఈసారి కూడా వైసీపీ లేదా టీడీపీ గెలుపు ఓటములను డిసైడ్ చేసే పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తుంది.

ఇలా కీలక నియోజకవర్గాలను ఎంచుకుని, ఆయా నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నాయకులను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం, క్షేత్రస్థాయిలో యువతకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కొంత ప్రభావాన్ని చూపించగలదు.

అయితే, 2009లో ఎన్నికల్లో చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌ ప్రచారానికి ప్రజలు ఎలా హాజరయ్యేవారో చాలామందికి గుర్తుండే ఉంటుంది. 2019లో పవన్ కల్యాణ్‌ ప్రచారానికి కూడా అంతకు మించిన ప్రజలు హాజరయ్యారు. కానీ, 2009లో ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18 స్థానాలు మాత్రమే గెలుపొందింది. 2019లో పవన్ కల్యాణ్ జనసేన ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ప్రచారానికి, సభలకు వస్తున్న మద్దతు చూసి పార్టీ గెలుపు ఓటములను అంచనా వేయడం సరికాదని చాలామంది చెబుతుంటారు. క్షేత్రస్థాయిలో పార్టీ ఎంత బలంగా ఉంది, పార్టీ ఎన్నికల నిర్వహణ యంత్రాంగం ఎంత పటిష్టంగాను, సన్నద్ధంగానూ ఉందన్న దానిపైనే గెలుపు ఓటములు ఆధారపడతాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కొద్దోగొప్పో క్షేత్రస్థాయిలో బలమైన వ్యవస్థ ఉన్న పార్టీ అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై ఈ ఐదేళ్లలో కొంత కృషి జరిగినప్పటికీ అది సరిపోదనే చెప్పాలి. జనసేన పార్టీ అయితే అసలు ఆ దిశగా పనులేమీ చేయలేదు. ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు రెండు నెలలు ముందు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి వైసీపీని ఓడిస్తుందా? అన్నది ప్రశ్నార్థకం.

2019లో కాంగ్రెస్ పార్టీకి ఏపీలో 1.2 శాతం ఓట్లు లభించాయి. (నోటాకు 1.28 శాతం ఓట్లు పోలయ్యాయి). జగన్ పార్టీకి 50.6 శాతం ఓట్లు రాగా టీడీపీకి 39.7 శాతం ఓట్లు వచ్చాయి. పవన్ కల్యాణ్ జనసేనకు వచ్చింది 5.6 శాతం ఓట్లు.

తెలంగాణలో కొన్ని నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఓట్ల తేడా 1.45 శాతం మాత్రమే. కాబట్టి ఈసారి షర్మిల సారథ్యంలో కాంగ్రెస్ పార్టీకి 5 శాతం ఓట్లు లభించినా పోటాపోటీ ఎన్నికల్లో వైసీపీకి భారీగా గండి కొట్టగలదు అనే విశ్లేషణలు వస్తున్నాయి.

ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు రావడం వల్ల కచ్చితంగా మేలు జరుగుతుందని, అసంతృప్తితో ఉన్న, జగన్ సీట్లు ఇవ్వని మరో 25 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తారని కొందరు చెబుతున్నారు. ఇంతకు ముందే చెప్పినట్లు కొత్తగా నాయకులు వచ్చి బలోపేతం చేయడం లేదా కొత్తతరం నాయకులు అవకాశాలు పొంది పార్టీని బలోపేతం చేయడం ద్వారా మాత్రమే ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది.

అయినప్పటికీ ఈ రెండు నెలల్లో ఈ ప్రక్రియ ఎంత వేగంగా జరుగుతుంది అనేది ప్రశ్నార్థకం. కచ్చితంగా కొన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలపడం ద్వారా కాంగ్రెస్ పార్టీ పోటీ ఇస్తుందని చెప్పవచ్చు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడితే అంత నష్టం జరిగేది వైసీపీకి మాత్రమే కాదు టీడీపీకి కూడా అనేది గత ఎన్నికల్లో ఆ పార్టీ ప్రదర్శనను బట్టి అర్థం చేసుకోవాలి.

-బీఎస్ఎన్ మల్లేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్,

బీఎస్ఎన్ మల్లేశ్వర రావు,  సీనియర్ జర్నలిస్ట్
బీఎస్ఎన్ మల్లేశ్వర రావు, సీనియర్ జర్నలిస్ట్

(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యాసకర్త వ్యక్తిగతం. హిందుస్తాన్‌టైమ్స్‌వి కావు)

Whats_app_banner