YS Sharmila Deeksha in Delhi : వైఎస్ షర్మిల ‘ప్రత్యేక హోదా’ దీక్ష - జగన్, చంద్రబాబు వీడియోలను చూపిస్తూ ప్రశ్నలు-ys sharmila slams cm jagan and chandrababu over ap special statue issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila Deeksha In Delhi : వైఎస్ షర్మిల ‘ప్రత్యేక హోదా’ దీక్ష - జగన్, చంద్రబాబు వీడియోలను చూపిస్తూ ప్రశ్నలు

YS Sharmila Deeksha in Delhi : వైఎస్ షర్మిల ‘ప్రత్యేక హోదా’ దీక్ష - జగన్, చంద్రబాబు వీడియోలను చూపిస్తూ ప్రశ్నలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 02, 2024 07:29 PM IST

YS Sharmila Deeksha in Delhi: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఢిల్లీకి వేదికగా దీక్ష చేపట్టారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. హోదా విషయంలో టీడీపీ,వైసీపీ పార్టీలు విఫలం అయ్యాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలు బీజేపీకి బానిసలుగా మారాయని దుయ్యబట్టారు. చంద్రబాబు, జగన్ మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు.

ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష
ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష

YS Sharmila Deeksha For AP Special Statue: ఏపీ ప్రజలను బీజేపీ పార్టీ అతిహీనంగా చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. అలాంటి పార్టీకి టీడీపీ, వైసీపీ గులాంగిరి చేస్తున్నాయని విమర్శించారు. రెండు పార్టీలు కలిసి పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ... హోదాపై పోరాడటం లేదన్నారు. రాష్ట్రం నుంచి గెలిచిన 25 మంది ఎంపీలు కూడా బీజేపీకి తొత్తులుగా మారారని దుయ్యబట్టారు. వీరంతా మోదీకి బానిసలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"టీడీపీ, వైసీపీలు హోదాపై ప్రజలకు ఇచ్చిన మాట తప్పుతున్నారు. హామీలను నెరవేర్చలేదు. అయినప్పటికీ బీజేపీకి గులాంగిరి ఎందుకు చేస్తున్నారు..? ఇవాళ అధికారంలో ఉన్న వారు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేశారు. వీరంతా ఇప్పుడు ఏమైపోయారు. ఏపీలో బీజేపీ ఒక్క సీటు లేదు. కానీ వీరంతా వారికి గులాంగిరి చేస్తున్నారు. అసలు మీ మధ్య ఒప్పందం ఏంటో చెప్పాలి. ఇలాగే పరిస్థితులు ఉంటే పోలవరం రాజధాని, కడప స్టీల్ ఎప్పుడు తీసుకొచ్చుకుంటాం..? ఎంపీలు రాజీనామా చేస్తే హోదా వచ్చేది కాదా..? వీరంతా మోదీని ప్రశ్నించారా..?" అని షర్మిల నిలదీశారు.

ప్రత్యేక హోదా విషయంపై చంద్రబాబు, జగన్ గతంలో మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు వైఎస్ షర్మిల. చంద్రబాబు, జగన్ ఇద్దరూ కూడా హోదా కోసం పోరాడుతామని చెప్పి... ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. ఇలా చేస్తే ప్రజలను మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. ఉత్తరాఖాండ్, హిమాచల్ ప్రదేశ్ కు హోదా వస్తే వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. అలాగే ఏపీకి హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయి కదా వ్యాఖ్యానించారు. అన్ని విషయాల్లో మోసం చేసిన బీజేపీ పార్టీకే ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు వైఎస్ షర్మిల.

“ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామన్నారు. తిరుపతిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ మాట చెప్పారు. విభజన చట్టంలోని హామీలను ఎందుకు ఇప్పటికీ నెరవేర్చలేదు...? దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తామన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని ప్రధాని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రజలకు మాటిచ్చారు. ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని కాంగ్రెస్‌ పార్టీ, ఏపీ ప్రజల తరపున నేను అడుగుతున్నా. ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. కేవలం ఓటు బ్యాంకు కోసం ఏవేవో మాయమాటలు చెప్పి వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. చివరకు విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తూ మరోసారి ఏపీ ప్రజలకు ద్రోహం చేయాలని చూస్తున్నారు” అని వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల… ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను స్వీకరించారు. ఆ రోజు నుంచి వైఎస్ జగన్ తో పాటు చంద్రబాబును తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా వైసీపీ పార్టీ నేతలను ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు షర్మిల. కీలమకైన అసెంబ్లీ ఎన్నికల వేళ షర్మిల ఎంట్రీతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. చాలా మంది నేతలు తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్న చర్చ కూడా వినిపిస్తోంది.

Whats_app_banner