AP Nominated Posts: నామినేటెడ్ పదవుల భర్తీ ఇప్పట్లో లేనట్టే, మరోసారి వాయిదా.. బీజేపీ డిమాండ్లే కారణం?
AP Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ ఇప్పట్లో లేదని తేలిపోయింది. సెప్టెంబర్ నెలలో నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టే అవకాశం ఉంది. నామినేటెడ్ పదవుల్లో తమకు ఎక్కువ ప్రాధాన్యత కావాలని బీజేపీ పట్టుబడుతుండటమే కారణంగా తెలుస్తోంది.
AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ మరోసారి వాయిదా పడింది. పదవుల భర్తీ కోసం ఆశగా ఎదురు చూస్తున్న కూటమి నేతలకు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నామినేటెడ్ పదవుల కోసం నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరిలో మాజీ మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు మొదలుకుని నియోజక వర్గ స్థాయి నేతలు మండల స్థాయి నేతలు కూడా ఉన్నారు. నామినేటెడ్ పదవుల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో వాటిని వడపోసి ఎంపిక చేసే ప్రక్రియ ఇప్పటికి కొలిక్కి రాలేదు.
నామినేటెడ్ పదవుల భర్తీని మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 15లోగా పూర్తిగా చేయాలని భావించారు. ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల తర్వాత జులైలోనే ముఖ్యమైన పదవుల్ని భర్తీ చేస్తారని భావించినా అందులో జాప్యం జరుగుతూ వచ్చింది. మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య పదవులు పంపకంపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది.
నామినేటెడ్ పదవుల భర్తీలో టీడీపీకి మొదటి ప్రాధాన్యం, జనసేన, బీజేపీలకు తర్వాత ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ పెద్దలు భావించారు. కూటమి ఏర్పాటుతో పలువురు టీడీపీ సీనియర్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి గెలిచింది. బీజేపీకి కేటాయించిన సీట్లలో కూడా మెజార్టీ స్థానాలను దక్కించుకుంది. ఎన్నికల్లో ఫలితాలు రికార్డు స్థాయిలో రావడం కూడా ఒత్తిడి పెరగడానికి కారణం అయ్యింది. మూడు పార్టీలకు పోటీ చేసిన వాటిలో మెజార్టీ స్థానాల్లో గెలుపొందడంతో నామినేటెడ్ పదవులపై అంచనాలు కూడా పెరిగాయి.
మరోవైపు నామినేటెడ్ పదవుల పంపకం నేడో రేపో జరుగుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నా ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం జరగడం లేదు. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో టీడీపీ-జనసేనలు సానుకూలంగానే ఉన్నా బీజేపీ మాత్రం తమకు ఎక్కువ ప్రాధాన్యత కావాలని పట్టుబడుతోంది. సీట్ల సర్దుబాటు సమయంలో ఇచ్చిన వాటితో సరిపెట్టుకున్నా నామినేటెడ్ పదవుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గకూడదని ఆ పార్టీ యోచిస్తోంది. క్షేత్ర స్థాయిలో క్యాడర్‌ను బలోపేతం చేయడానికి పార్టీ నేతలకు పదవులు కీలకమని ఆ పార్టీ యోచిస్తోంది.
మొత్తం అందుబాటులో ఉన్న పదవుల్లో తొలుత 30 నుంచి 50శాతం పదవుల్ని భర్తీ చేయాలని ఆ తర్వాత మిగిలిన భర్తీ చేయాలని భావించారు. మొదట భర్తీ చేసే వాటిలో 50శాతం పదవుల్ని టీడీపీకి 30శాతం జనసేనకు మిగిలినవి బీజేపీకి ఇవ్వాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు బీజేపీ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. మరిన్ని పదవుల కోసం ఆ పార్టీ పట్టుబట్టడంతోనే నామినేటెడ్ పదవుల భర్తీ వాయిదా పడినట్టు తెలుస్తోంది.
దరఖాస్తుదారులకు తప్పని ఎదురు చూపులు…
మరోవైపు నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ కార్యాలయానికి భారీగా దరఖాస్తులు చేరుకున్నాయి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవుల కోసం నేతలు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదేళ్లు పార్టీలో తాము చాలా కష్టపడ్డామని.. ఆర్థికంగా నష్టపోయామని, తమపై కేసులు కూడా ఉన్నాయని దరఖాస్తుల్లో చెబుతున్నారు.
తమ వివరాలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నేతల సిఫార్సుల లేఖలను కూడా వీటికి జత చేస్తున్నారు. నామినేటెడ్ పదవులు కేటాయించాలని ఇప్పటి వరకు సుమారు 23 వేల దరఖాస్తులు పార్టీ కార్యాలయానికి వచ్చాయి. భారీగా దరఖాస్తులు రావడంతో వీటిని వడపోసే కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది. అందరికీ ఎలా సర్దుబాటు చేయాలనే అంశంపై తీవ్ర కసరత్తు చేస్తోంది.
రాష్ట్ర స్థాయిలో సుమారు 103 కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక్కొక్క దానిలో ఛైర్మన్‌తోపాటు 11 మందికి డైరెక్టర్లుగా నామినేట్ చేసుకునే అవకాశం ఉంది. తద్వారా 1,130 మంది వరకు నామినేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇవి కాకుండా మరో 300 పదవులు ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
జిల్లాల్లో గ్రంథాలయ సంస్థలు, మండల స్థాయిలో మార్కెట్ యార్డు కమిటీ పదవులు కూడా ఉన్నాయి. మొత్తం సుమారు 2,500 మందికి నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉంటుందని నేతలు చెబుతున్నారు.తాజాగా మూడు పార్టీల మధ్య పదవుల పంపకంపై ఏకాభిప్రాయం రాకపోవడంతో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న వారికి ఉస్సురుమంటున్నారు.
సంబంధిత కథనం