Pawan Kalyan Speech : మీ సంగతి చూసే బాధ్యత నాది.. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మాస్ స్పీచ్!
Pawan Kalyan Speech : ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాధపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ దీపం-2 కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి మాస్ వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో నోటి నుంచి మాట రాకుండా చేస్తానన్నారు.
చింత చచ్చినా మీకింకా పులుపు చావలేదని.. వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ విమర్శించారు. భవిష్యత్తులో నోటి నుంచి మాటరాకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాధపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
'విమర్శించే ప్రతి ఒక్కరికీ చెప్తున్నా.. మేము త్రికరణ శుద్ధిగా పని చేస్తున్నాం. మీ ఇష్టానికి సోషల్ మీడియాలో తిట్టేస్తాం, మళ్లి మీ పాత పద్ధతుల్లో కుటుంబసభ్యులను తిడతాం, ఏదిపడితే అది మాట్లాడతాం అంటే.. నేను మీకు మాటిస్తున్నా లక్ష్మీనరసింహ స్వామి మీద ఆన.. మీ సంగతి చూసే బాధ్యత నాది' అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
'గెలిచినరోజు చెప్పాను ఇది పగా ప్రతీకారాలు ప్రభుత్వం కాదు అని, గత నాలుగు నెలలుగా నేనొక్క మాట మాట్లాడలేదు. కానీ వాళ్ళకి నోళ్లు ఎక్కువయ్యాయి.. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు. తొక్కి నార తీస్తా గుర్తు పెట్టుకోండి. భవిష్యత్తులో చూస్తారు. చాలా సార్లు చెప్పాను మీకు యుద్ధమే కావాలి అంటే కావల్సినంత ఇస్తాను, గొడవ కావాలి అంటే కోరినంత గొడవ ఇస్తాను. కాని అది అభివృద్ధికి దోహదపడే గొడవ, సన్నాసుల్ని చితక్కొట్టి ఆడబిడ్డలకు రక్షణగా ఉండే గొడవ. ఎందుకంటే నాకు సహనం పోయింది, నాలుగు నెలలు చూశాం' అని పవన్ వ్యాఖ్యానించారు.
'ఓడిపోయి 11 సీట్లకు పరిమితమయినా వైసీపీ వాళ్ల నోళ్లు ఆగట్లా. ఈ మధ్య అడుగుతున్నారు ఎంటన్నా మెత్తబడిపోయావు, మంచివాడివైపోయావు అని. నేనెప్పుడూ మంచోడినే., నేనేవరి జోలికి వెళ్ళను. మీరు సినిమా పేర్లు కాకుండా భగవంతుడి నామం జపిస్తే అద్భుతాలు జరుగుతాయి. సినిమాలు ఉండాలి సరదాకి అంతే.. సినిమాలు బాగుండాలన్నా, చూడాలన్నా ముందు మీ కడుపు నిండాలి కదా., మీరు డబ్బు సంపాదించుకునే మార్గాలు రావాలి కదా' అని పవన్ వ్యాఖ్యానించారు.
'దార్లో వచ్చేప్పుడు కోపమొచ్చి దిగి నడుస్తున్నాను. ఇంకా 5,6 కిలోమీటర్లు ఉంది ఎందుకు నడిచి వెళ్తున్నారు అని అడిగారు. గతం నుండి ఈ రోడ్లు ఇంతే అధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్డు ఎన్ని కిలోమీటర్లు ఉందో అన్ని కిలోమీటర్లు రెండువైపులా ఆధునీకరించాలి అంటే సరేనని కలెక్టర్ కూడా నాకు మాట ఇచ్చారు. ఐఎస్ జగన్నాధపురం, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కొండ కింద నుండి పైదాక రోడ్డుని మంజూరు చేస్తున్నాం' అని పవన్ ప్రకటించారు.
'ఐఎస్ జగన్నాధపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం చుట్టూ ప్రాకారం, ఒకమండపం, గాలి గోపురం కోసం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ రెండున్నర కొట్లతోటి అభివృద్ధి చేయబోతోంది. అలాగే రెండు కోట్ల ఖర్చుతో రక్షణ గోడ నిర్మాణం చేయబోతోంది. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఆలయానికి దేశ వ్యాప్తంగా భక్తులు అందర్శించేలా చేస్తాం' అని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.
'నేను మాట ఇచ్చి తప్పితే మావాళ్లే ప్రశ్నిస్తారు. అందుకే అధికారులని ముందే అడిగాను ఈ హామీలన్నీ సభాముఖంగా చెప్పచ్చా అని. మా వాళ్ళ ప్రేమ,అభిమానం ఎంత బలంగా ఉంటదో, వాళ్ళ కోపం కూడా అంతే బలంగా ఉంటది. మా అక్కచెల్లెమ్మలు తిడతారు మీరు కూడా ఇలా చేస్తే ఎలాగని. వారి కోపాన్ని నేను కూడా తట్టుకోలేను. అందుకే ముందే చేయగలమా లేదా అని కనుక్కుని మాట ఇస్తున్నాను' అని పవన్ స్పష్టం చేశారు.
'దాదాపు 14 సంవత్సరాల క్రితం ఐఎస్ జగన్నాధపురంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వచ్చాను. త్రేతాయుగంలో వెలసిన స్వయంభూ ఈ లక్ష్మీనరసింహ స్వామివారు. చాలా శక్తివంతమైన నేల ఇది. ఈ నేలకి అద్భుతాలు జరగాలి, తద్వారా రాష్ట్రం బాగుండాలి సుభిక్షంగా ఉండాలి అని అప్పుడు దీక్ష చేపట్టాను. 2009 ఎన్నికలు అయిపోయాయి. నా జీవితం అగమ్యగోచరంగా ఉంది. అప్పుడు ఈ ఆలయానికి వచ్చి లక్ష్మీనరసింహ స్వామిని వేడుకున్నాను. తండ్రీ నాకు ప్రజలకోసం పని చేసే శక్తినివ్వమని. 14 సంవత్సరాలు పరీక్ష పెట్టాడు స్వామి. మొదట ఓడిపోయాం, భవిష్యత్తు కనిపించలేదు చిమ్మచీకటి. కానీ 14 సంవత్సరాల క్రితం వెలిగించిన దీపం ఫలితం నేడు కనిపించింది. ఈ రోజు రాష్ట్రానికే కాదు.. దేశంలోని ఎన్డీఏ ప్రభుత్వానికే అండగా నిలబడే శక్తిని, ధైర్యాన్ని మీతోపాటు లక్ష్మీ నరసింహస్వామి వారు ఇచ్చారు' అని పవన్ వ్యాఖ్యానించారు.