IND vs NZ 1st Test: నిజాయతీగా తప్పుని ఒప్పుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, బాధ్యత వహిస్తూ పశ్చాతాపం-skipper rohit sharma accepts mistake after india historic collapse in bengaluru ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Nz 1st Test: నిజాయతీగా తప్పుని ఒప్పుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, బాధ్యత వహిస్తూ పశ్చాతాపం

IND vs NZ 1st Test: నిజాయతీగా తప్పుని ఒప్పుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, బాధ్యత వహిస్తూ పశ్చాతాపం

Galeti Rajendra HT Telugu
Oct 18, 2024 08:00 AM IST

Rohit Sharma Mistakes vs New Zealand: న్యూజిలాండ్‌తో బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తాను చేసిన తప్పిదాల్ని ఒప్పుకున్నాడు. తన అనాలోచిత నిర్ణయం కారణంగానే భారత్ జట్టు 46 పరుగులకే ఆలౌట్ అయ్యిందని అంగీకరించాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ
కెప్టెన్ రోహిత్ శర్మ (PTI)

న్యూజిలాండ్‌తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు పేలవ ప్రదర్శనకి కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యత వహించాడు. కెప్టెన్‌గా తాను చేసిన తప్పిదం కారణంగానే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటై అయ్యిందని అంగీకరిస్తూ పశ్చాతాపం వ్యక్తం చేశాడు.

టాస్ దగ్గరే తప్పిదం

మ్యాచ్‌లో వర్షం కారణంగా తొలి రోజైన బుధవారం ఆట రద్దవగా.. రెండో రోజైన గురువారం టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ.. అప్పటికే మూడు రోజుల నుంచి బెంగళూరులో వర్షం కురుస్తోంది. మరోవైపు మబ్బు పట్టిన ఆకాశం కనిపిస్తున్నా.. రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకోవడం తెలివి తక్కువ నిర్ణయంగా మాజీ క్రికెటర్లు అభివర్ణించారు. ఎందుకంటే గాల్లోని తేమ, ఆ వాతావరణం పేసర్లకి స్వర్గధామం. ఈ విషయం రోహిత్ శర్మకి అర్థమవడానికి ఎంతోసేపు పట్టలేదు.

పేసర్లకి కలిసొచ్చిన చిన్నస్వామి పిచ్‌పై నిప్పులు చెరిగిన న్యూజిలాండ్ బౌలర్లు భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 31.2 ఓవర్లలో 46 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత్ జట్టులో ఐదుగురు బ్యాటర్లు కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు. టాప్ స్కోరర్‌గా రిషబ్ పంత్ 20 పరుగులతో నిలిచాడు.

రోహిత్ లెక్క తప్పిందిలా

రెండో రోజైన గురువారం ఆట తర్వాత రోహిత్ శర్మ విలేకర్ల సమావేశంలో తన తప్పుల్ని అంగీకరించాడు. ‘‘టాస్ గెలిచాక.. మొదట బ్యాటింగ్ చేయాలనేది నా నిర్ణయం. ఏడాదిలో ఇలాంటి ఒకటి లేదా రెండు చెత్త నిర్ణయాలు ఫర్వాలేదు అనుకుంటున్నా. పిచ్‌పై పచ్చిక లేదని నేను భావించాను.

తొలి రెండు సెషన్ల తర్వాత స్పిన్నర్లకి సపోర్ట్ లభిస్తూ టర్న్ ఉంటుందని ఊహించాను. కానీ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ల సవాలుకి మేము సరైన రీతిలో స్పందించలేకపోయాం. టీమ్ కేవలం 46 పరుగులే చేయడం కెప్టెన్‌గా నాకు బాధగా అనిపించింది’’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు. భారత్ గడ్డపై 1987లో ఢిల్లీలో వెస్టిండీతో జరిగిన టెస్టులో టీమిండియా అత్యల్ప స్కోరు 75 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇదే లోయెస్ట్ స్కోరు.

కుల్దీప్‌ని తీసుకోవడానికి కారణమిదే

భారత్‌లో ఎప్పుడు టెస్టు ఆడినా తొలి సెషన్ కీలకమని.. ఆ సెషన్ తర్వాత వికెట్ నుంచి స్పిన్నర్లకి సహకారం లభించడం మొదలవుతుందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. వాతావరణం మేఘావృతమైనప్పటికీ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ స్థానంలో స్పిన్నర్ల కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవడానికి కూడా కారణం ఇదేనని రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.

‘‘పిచ్‌పై నాకు పెద్దగా గడ్డి కనిపించలేదు. కాబట్టి కుల్దీప్‌ను జట్టులోకి తీసుకున్నాను. అతను ప్లాట్ పిచ్‌లపై వికెట్లు తీయగలడని నమ్మాను’’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు. కానీ.. గురువారం ఆటలో 12 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్ యాదవ్ 57 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటవగా.. గురువారం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 180/3తో మెరుగైన స్థితిలో నిలిచింది.

Whats_app_banner