Pithapuram: డిప్యూటీ సీఎం తాలూకా.. పిఠాపురంలో పొట్టు పొట్టు కొట్టుకున్న అధికారులు!
Pithapuram: కౌన్సిల్ సమావేశాల్లో ఇన్నాళ్లు అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు గొడవలు పడటం చూశాం. కానీ.. తాజాగా పిఠాపురంలో ఇద్దరు ఆఫీసర్లు గొడవ పెట్టుకున్నారు. వ్యక్తిగత విషయాలను ప్రస్తావించుకుంటూ.. బూతులు తిట్టుకున్నారు. దీంతో కౌన్సిల్ సభ్యులు ముక్కున వేలేసుకున్నారు.
పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఊహించని ఘటన జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు విషయంలో ఇద్దరు అధికారులు గొడవ పెట్టుకున్నారు. పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. మున్సిపల్ కమిషనర్ కనకారావు, డిఈ భవాని శంకర్‌ల మధ్య వివాదం జరిగింది. అది కాస్త వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది. దీంతో ఇద్దరు కొట్టుకున్నారు. కౌన్సిల్ సభ్యులు ఉన్నారని కూడా చూడకుండా.. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఒకరిపై ఒకరు దాడి..
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంపై కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమయంలో మున్సిపల్ కమిషనర్ కనకారావు మాట్లాడుతూ.. డీఈ సమావేశాన్ని తప్పుదోవ పట్టించారని అన్నారు. వెంటనే డిఈ భవాని శంకర్ లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. హద్దలు దాటి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్.. బయటకు పో అంటూ గద్దించారు. డిఈ భవాని శంకర్ కూడా అంతే స్ట్రాంగ్‌గా స్పందించారు. సహనం కోల్పోయిన కమిషనర్.. డీఈపై చేయి చేసుకున్నారు. డిఈ భవాని శంకర్ కూడా కమిషనర్‌ను కొట్టారు.
పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో..
డిఈ భవాని శంకర్, మున్సిపల్ కమిషనర్ కనకారావు గొడవతో పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. ఛైర్ పర్సన్, కౌన్సిలర్లు ఉండగానే అధికారులు కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. అటు పిఠాపురం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో.. ఈ ఇష్యూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. అయితే.. ప్రజా ప్రతినిధుల ముందే ఇలా కొట్టుకోవడంపై ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో..
పిఠాపురంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన వంగా గీతపై భారీ మెజార్టీతో గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు 1,34,394 ఓట్లు పోలవ్వగా.. వంగా గీతకు 64 వేల 115 ఓట్లు పోల్ అయ్యాయి. 2019లో పిఠాపురం ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు వైసీపీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ ఆయనకు అవకాశం ఇవ్వకుండా.. వంగా గీతను నిలబెట్టారు. కానీ.. ఆమె ఓడిపోయారు.