Pithapuaram : 'పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా' నెంబర్ ప్లేట్లు మార్పిస్తున్న పోలీసులు- వీడియోలు వైరల్
Pithapuaram : ఏపీలో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా హాట్ టాపిక్ గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనతో కొందరు నెంబర్ ప్లేట్లను మారుస్తుంటే మరికొందరితో పోలీసులు మార్పిస్తున్నారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Pithapuaram : "పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా"- ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో అప్పటి నుంచి జనసేన మద్దతుదారులు తమ వాహనాలకు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని నెంబర్ ప్లేట్లు పెడుతున్నారు. ఏపీలో ఎమ్మెల్యే, ఎంపీ తాలూకా ట్రెండ్ నడుస్తోంది. టీడీపీ, జనసేన మద్దతుదారులు వారి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎంపీల పేర్లతో ఫలానా తాలూకా వాహనాలపై నెంబర్ ప్లేట్లు పెట్టుకుంటున్నారు. అయితే ఇన్నాళ్లు వీటిని చూసి చూడనట్లు వదిలేసిన పోలీసులు..ఇక యాక్షన్ లోకి దిగారు. ఇటీవల పిఠాపురం వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఇందుకు ఒక కారణం కావొచ్చని నెటిజన్లు అంటున్నారు.
పవన్ కల్యాణ్ విజ్ఞప్తి
ఇటీవల పిఠాపురం సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... వాహన నెంబర్ ప్లేట్ పై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని వేసుకోవద్దని సూచించారు. నాలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన జనసైనికులు...చట్టాన్ని పాటించాలని కోరారు. నెంబర్ ప్లేట్ పై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసుకుంటే పోలీసులు తనను తిడతారని, అందుకే మోటారు వాహన చట్టం నిబంధలన మేరకు వాహన నెంబర్ కనిపించేలా ప్లేట్స్ ఉండాలన్నారు. దీంతో ఇన్నాళ్లు నెంబర్ ప్లేట్లపై ఫలానా తాలూకా అని ఉన్నా పెద్దగా పట్టించుకోని పోలీసులు, ఇకపై అలా చూస్తూ ఊరుకోం అంటున్నారు. ఇటీవల వాహన తనిఖీల్లో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసి ఉన్న వాహనాన్ని ఆపిన ట్రాఫిక్ పోలీసులు...నెంబర్ ప్లేట్ మార్పించారు. దీనిపై జనసైనికులు సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తున్నారు. నెంబర్లు ప్లేట్లు మార్చుకోవాలని, వాహనంపై మరెక్కడైనా ఫలానా తాలూకా అని వేసుకోవాలని సూచిస్తున్నారు.
వైసీపీ వర్సెస్ జనసైనికులు
పోలీసులు నెంబర్ ప్లేట్లు మార్పిస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో వైసీపీ మద్దతుదారులు జనసైనికులపై సెటైర్లు వేస్తున్నారు. వైసీపీకి కౌంటర్ ఇస్తున్న జనసైనికులు...తాము చట్టాన్ని పాటిస్తామని అందుకే పోలీసులు చెప్పిన వెంటనే నెంబర్ ప్లేట్లు మారుస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నేరుగా పోలీసులతో జగన్ ఫొటోలు ఆటోలకు అతింకించిన విషయం మర్చిపోయారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆ వీడియోలు పోస్టు చేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు.
పిఠాపురంలో భూముల ధరలకు రెక్కలు
ఇక పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సొంతింటి కోసం స్థలం కొన్నారు. భోగాపురం ఇల్లింద్రాడ పరిధిలో 3.52 ఎకరాలు పవన్ కొలుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పిఠాపురంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో రూ.15-రూ.16 లక్షలు పలికిన ఎకరం భూమి ఇప్పుడు రూ.కోటి ధర పలుకుతుందని ప్రచారం జరుగుతోంది. ఎన్.హెచ్ 216 సమీపంలో అయితే ఎకరం రూ.2-3 కోట్ల వరకు రేటు పలుకుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో భూములు కొనేందుకు రియాల్టర్లు రైతుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారని సమాచారం. తమ భూముల ధరలు అమాంతం పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత కథనం