PawanKalyan: ఊరూరా విజయవంతంగా సాగుతున్న గ్రామ సభలు, రైల్వే కోడూరు సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్-pawan kalyan participated in the successful gram sabhas in railway koduru ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawankalyan: ఊరూరా విజయవంతంగా సాగుతున్న గ్రామ సభలు, రైల్వే కోడూరు సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్

PawanKalyan: ఊరూరా విజయవంతంగా సాగుతున్న గ్రామ సభలు, రైల్వే కోడూరు సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్

Sarath chandra.B HT Telugu
Aug 23, 2024 02:07 PM IST

PawanKalyan: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పండగ వాతావరణంలో గ్రామ సభలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 13,326 పంచాయితీల్లో ఉదయం నుంచీ గ్రామ సభలు విజయవంతంగా నడుస్తున్నాయి.రూ.4,500 కోట్ల విలువైన పనులకు ప్రజలే తీర్మానాలు చేస్తున్నారు.రికార్డు స్థాయిలో ప్రజలు ఉపాధి పనులకు ఆమోదం తెలుపుతున్నారు.

రైల్వే కోడూరు గ్రామ సభలో  మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్
రైల్వే కోడూరు గ్రామ సభలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్

PawanKalyan: ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ఉపాధి హామీ పనుల్ని చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజులో గ్రామసభలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచీ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పండగ వాతావరణం కనిపించింది.

రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో ఉదయం నుంచీ గ్రామ సభలు విజయవంతంగా నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో జరిగే గ్రామసభలో పాల్గొననున్నారు.

ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరివారిపల్లె పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.38.46 లక్షల విలువైన 43 పనులకు ఆమోదం తెలిపారు.

ప్రజాస్వామ్య స్ఫూర్తితో... పారదర్శకతతో...

పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో ఒకే రోజు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా ప్రతి గ్రామంలో సభలు మొదలుపెట్టారు. వీటిలో కోటి మందికిపైగా ప్రజలు పాల్గొన్నారు. తమ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులకు తీర్మానాలు చేసుకొని ఆమోదించుకున్నారు.

రూ.4500 కోట్లు విలువైన పనులకు నేటి గ్రామ సభల్లో ఆమోదం లభించింది. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో కోటి మందికిపైగా ప్రజలు భాగస్వామ్యంతో రూ.4,500 కోట్లు విలువైన పనులకు ఆమోదం చేసుకోవడం ప్రపంచ స్థాయి రికార్డుగా నిలుస్తుంది.

నేటి గ్రామ సభల ద్వారా 87 రకాలైన పనులకు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేందుకు అవకాశం లభించింది. 9 కోట్ల పని దినాలతో, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన జరుగుతుంది. పంచాయతీ పరిధిలోని వారంతా కూర్చొని గ్రామాభివృద్ధి మీద నిర్ణయాలు తీసుకొనేలా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో, పారదర్శకంగా నిధులు వెచ్చించుకొనేలా గ్రామ సభలను నిర్వహిస్తున్నారు.

ప్రతి గ్రామంలో మహిళలు బయటకు వచ్చి సమస్యలపై నిలదీయాలన్నారు. కొన్నేళ్ల తర్వాత తాను ఉండకపోవచ్చని, ప్రతి పంచాయితీ నుంచి గ్రామసభల్లో మహిళలు బాధ్యత తీసుకోపోతే గ్రామాలు పచ్చగా ఉండవన్నారు. యువకులు ఉపాధి కోసం బయటకు వెళ్లిపోతే గ్రామాలు ఏమవుతాయన్నారు. పల్లెలకు పూర్వ వైభవం తీసుకురావడానికి, రాయలసీమ నుంచి వలసలు ఆపడానికి స్కిల్ డెవలప్‌మెంట్‌ ఆలోచనను ముందుకు తీసుకు వెళ్తామన్నారు.

స్థానికంగానే ఉపాధి లభించే చర్యలు చేపడతామన్నారు. పంచాయితీలో అభివృద్ధికి భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతు కారుమంచినారాయణను పవన్ అభినందించారు. ఆయన ఇచ్చిన భూమిని సద్వినియోగంచ చేస్తామన్నారు. రాష్ట్రమంతా ఆయనకు గుర్తింపు వచ్చేలా చేస్తానన్నారు.