Minister Ambati Dance : భోగి వేడుకలు - మరోసారి స్టెప్పులతో అదరగొట్టిన మంత్రి అంబటి
Bhogi Celebrations 2024 in AP : మంత్రి అంబటి మరోసారి అదిరిపోయే స్టెప్పులు వేశారు. సత్తెనపల్లిలో నిర్వహించిన బోగీ వేడుకల్లో పాల్గొన్న ఆయన… డ్యాన్సులతో సందండి చేశారు.
Minister Ambati Rambabu Dance: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు షురూ అయ్యాయి. మూడు రోజుల వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె, పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగీ మంటలు వేశారు. మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది.
మంత్రి అంబటి స్టెప్పులు
సత్తెనపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో భోగి వేడుకలను జరిపారు. ఇందులో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు డ్యాన్సులు వేసి సందడి చేశారు. గిరిజన మహిళలతో పాటు పలువురితో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు. పాటకు తగ్గట్టుగా స్టెప్పులు వేశారు. గతేడాది కూడా అంబటి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.
మందడంలో భోగి వేడుకలు
అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. చంద్రబాబు అడ్డ పంచె కట్టుకుని సంప్రదాయబద్దంగా కార్యక్రమానికి హాజరయ్యారు. నేతలిద్దరూ భోగిమంటలు వెలిగించారు. వైసీపీ సర్కార్ తీసుకున్న పలు నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను మంటల్లో వేశారు. తెలుగుజాతికి స్వర్ణయుగం - సంక్రాంతి సంకల్పం’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో…. టీడీపీతో పాటు జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం - పవన్
ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్…. టీడీపీ- జనసేన కలిసి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చాక అమరావతిని బంగారు రాజధానిగా నిర్మించుకుందామని చెప్పారు. జై అమరావతి, జై ఆంధ్రా అనే నినాదంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉపాధి లేదు.. నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. మరోసారి వైసీపీ వస్తే రాష్ట్ర భవిష్యత్ చీకటే అని వ్యాఖ్యానించారు.