MP Balashowry : వైసీపీకి మరో భారీ షాక్, ఎంపీ బాలశౌరి రాజీనామా- త్వరలో జనసేనలోకి-machilipatnam news in telugu mp balashowry resigned to ysrcp joins janasena ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mp Balashowry : వైసీపీకి మరో భారీ షాక్, ఎంపీ బాలశౌరి రాజీనామా- త్వరలో జనసేనలోకి

MP Balashowry : వైసీపీకి మరో భారీ షాక్, ఎంపీ బాలశౌరి రాజీనామా- త్వరలో జనసేనలోకి

Bandaru Satyaprasad HT Telugu
Jan 13, 2024 08:45 PM IST

MP Balashowry : మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలో జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఎంపీ బాలశౌరి
ఎంపీ బాలశౌరి

MP Balashowry : ఏపీలో వైసీపీకి మరో భారీ షాక్ తగలింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. బాలశౌరి త్వరలో జనసేనలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. స్థానిక నేతల తీరుతో మనస్తాపానికి గురైన బాలశౌరి, గత కొన్ని రోజులుగా మచిలీపట్నానికి దూరంగా ఉన్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాలశౌరి మనస్తాపంతో ఉన్నారు. ఇటీవలె కర్నూలు ఎంపీ డా.సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. తాజాగా బాలశౌరి రాజీనామాతో వైసీపీలో కలకలం రేగుతోంది.

పేర్ని నాని, జోగి రమేష్ తో విభేదాలు!

వైసీపీలో రాజీనామాలు కొనసాగుతున్నాయి. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని అసంతృప్తితో ఉన్న బాలశౌరి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్లు ఎక్స్ లో తెలిపారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత సీఎం జగన్ పంపినట్టు తెలిపారు. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎంపీ బాలశౌరికి... వైసీపీ నేతలు పేర్ని నాని, జోగి రమేష్‌కు మధ్య విభేదాలున్నాయి. మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో పార్టీ పరంగా ఏ కార్యక్రమం జరిగినా ఎంపీ బాలశౌరిని దూరం పెట్టేవారని సమాచారం. గతంలో బాలశౌరి మచిలీపట్నం పర్యటనను పేర్ని నాని అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తతకు దారి తీసింది. అనంతరం పేర్ని నానిపై బాలశౌరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం పేర్ని నాని అడ్డా కాదని, ఇకపై అక్కడే ఉంటానని ప్రకటించారు. పేర్ని నానికి మంత్రి పదవి పోవడానికి బాలశౌరి కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది. పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్‌, బాలశౌరికి మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో బాలశౌరి పెడన నియోజకవర్గంలో పర్యటించలేని పరిస్థితి ఉంది. వైసీపీలో ఇన్ ఛార్జ్ మార్పులతో ఎంపీ బాలశౌరికి స్థానం దక్కలేదు. దీంతో వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ఇవాళ రాజీనామా చేశారు.

కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా

కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. కర్నూలు పార్లమెంట్ పార్టీ ఇన్ ఛార్జ్ పదవి నుంచి తప్పించడంతో సంజీవ్ కుమార్ మనస్తాపం చెందారు. దీంతో తన ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సంజీవ్ కుమార్ ప్రకటించారు. ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని సంజీవ్ కుమార్ అన్నారు. తన సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. మరో 20 ఏళ్ల వరకు తాను ప్రజా జీవితంలో ఉంటానన్నారు. ఎంపీగా అభివృద్ధి చేసే అవకాశం తనకు రాలేదన్నారు. ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తానన్నారు. వలసలు ఆగాలంటే పెద్దస్థాయిలో నిర్ణయాలు జరగాలన్నారు. అధిష్టానం అపాయింట్మెంట్ కోరితే ఎందుకు కష్టపడతావన్నారని ఎంపీ సంజీవ్ కుమార్ తెలిపారు.