Bhogi festival: ఈ గ్రామాల్లో భోగి పండుగ చేసుకోరు.. ఎందుకంటే-these villages does not celebrated bhogi festival ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Bhogi Festival: ఈ గ్రామాల్లో భోగి పండుగ చేసుకోరు.. ఎందుకంటే

Bhogi festival: ఈ గ్రామాల్లో భోగి పండుగ చేసుకోరు.. ఎందుకంటే

Gunti Soundarya HT Telugu
Jan 14, 2024 07:00 AM IST

Bhogi festival: భోగి పండుగని చాలా ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కానీ కొన్ని గ్రామాల ప్రజలకి మాత్రం అసలు భోగి పండుగ గురించే తెలియదు.

భోగి పండుగ
భోగి పండుగ (freepik)

Bhogi festival: తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు సంబరంగా చేసుకుంటారు. భోగ భాగ్యాలు తీసుకొచ్చే భోగి పండుగతో సంక్రాంతి పండుగ మొదలవుతుంది. తెల్లవారు జామునే నిద్రలేచి భోగి మంటలు వేసుకుని అందరూ వాటి చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతారు.

దక్షిణాయనంలో పడిన ఇబ్బందులు మళ్ళీ ఎప్పుడు పడకూడదని ఉత్తరాయణ కాలం సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటూ అగ్ని దేవుడిని ప్రార్థిస్తారు. అందుకే భోగి నాడు వేకుమజామున లేచి భోగి మంటలు వేస్తారు. ఇంట్లో ఉన్న పనికి రాని వస్తువులు భోగి మంటల్లో వేస్తారు. వాటితో పాటు ఆవు పేడతో చేసిన పిడకలు, మామిడి, రావి చెట్ల మొద్దులు కూడా మంటలో వేస్తారు. తమ జీవితంలోకి కొత్త వెలుగులు రావాలని కోరుకుంటారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా భోగి పండుగ వేడుకల్లో పాల్గొంటారు.

భోగి రోజు ప్రతి ఒక్కరి ఇంటి ముందు భోగి మంటలు దర్శనం ఇస్తాయి. పొద్దునే లేచి గజగజా వణుకుతున్న చలిని సైతం లెక్కచేయకుండా భోగి సందడిలో పాల్గొంటారు. భోగి పండుగ సందడి పల్లెటూర్లతో చాలా బాగా కనిపిస్తుంది. అందరూ సంతోషంగా డాన్స్ చేసుకుంటూ సంబరంగా పండుగ జరుపుకుంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం భోగి పండుగ అసలు చేసుకోరు. ఇప్పటి తరానికి అయితే భోగి పండుగ గురించి కూడా తెలియదు. ఇంతకీ ఆ ప్రాంతాలు ఎక్కడో లేవు ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఉన్నాయి.

భోగి జరుపుకోని గ్రామాలు

తెర్లాం మండలం తమ్మయ్య వలసలో భోగి పండుగ జరుపుకోరు. పూర్వం అక్కడ భోగి మంట వేసినప్పుడు గ్రామంలో ఏదో జరిగిందని చెప్పి అప్పటి నుంచి ఆ గ్రామ ప్రజలు భోగి వేడుకలకి దూరంగా ఉంటున్నారు. కుమ్మరి పేట గ్రామంలో కూడా ఇటువంటి సంఘటన ఒకటి జరగడం వల్ల ఈ గ్రామ ప్రజలు పండుగ చేసుకోరు.

బలిజ పేట మండలంలోని సుభధ్ర పంచాయతీ పరిధిలోని బడేవలసలో కూడా భోగి సంబరాలు కనిపించవు. సుమారు శతాబ్దం కిందట ఇక్కడ జరిగిన భోగి మంటల సమయంలో జరిగిన ప్రమాదం కారణంగా ఒకరు చనిపోయారు. అప్పటి నుంచి ఈ గ్రామ ప్రజలు భోగి జరుపుకోవడాన్ని నిషేధించారు. తారాపురం, పిన్నవలస, ముగడ గ్రామాల్లో కూడా భోగి పండుగ జరుపుకోరు. అక్కడ ఉంటున్న ఇప్పటి తరం పిల్లలకి అసలు భోగి అంటే ఏమిటో కూడా తెలియదట. గతంలో జరిగిన సంఘటనల వల్ల తమ పూర్వీకులు పండుగ చేసుకోవడం మానేశారని తాము కూడా ఇదే ఆచారం కొనసాగిస్తున్నామని చెబుతున్నారు.

Whats_app_banner