పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబే కారణమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల వేల కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజల ముందుంచాలంటే అసెంబ్లీకి రావాలని, చర్చలో పాల్గొనాలని అంబటి సవాల్ విసిరారు. పోలవరాన్ని 2018లోగా పూర్తి చేస్తామని అప్పట్లో టీడీపీ ప్రగల్భాలు పలికిందని మంత్రి మండిపడ్డారు.
అమరావతి రైతుల మహా పాదయాత్రపై అంబటి స్పందిస్తూ.. ఇది ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించే ఎత్తుగడ అని అన్నారు. అమరావతి పెద్ద కుంభకోణమని, అమరావతి పాదయాత్రలో ఒక్క రైతు కూడా లేడని ఆరోపించారు. వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానమని, మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
అమరావతి పాదయాత్ర ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని అడ్డుకునేందుకు దేవుడు పేరుతో చేస్తున్న దెయ్యాల యాత్రగా మారిందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. చంద్రబాబు సృష్టించిన అమరావతి దెయ్యాల రాజధాని అని వ్యాఖ్యానించారు. 'ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా సాగుతున్న ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా దానికి చంద్రబాబే బాధ్యత. యాత్రకు కోర్టు అనుమతి ఇచ్చింది కదా అని ఏదైనా చేస్తాం అనుకుంటున్నారు. ప్రజలను రెచ్చగొడతాం అంటూ రెచ్చిపోతే చూస్తూ ఊరుకోం. అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ సంకల్పం.' అని మంత్రి అమర్‌నాథ్ అన్నారు.
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం టీడీపీకి ఇష్టం లేదని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. బలహీనవర్గాలకు చోటులేని రాజధాని ఎవరిక కోసం అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అమరావతిలోని 29 గ్రామాలకు ఏం మేలు జరిగిందని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలన్నారు. చంద్రబాబుకి సీఎం జగన్ పాలన చూసి దిక్కు తోచడం లేదని వ్యాఖ్యానించారు. తమకు త్వరలో రాజకీయ సమాధి తప్పదని విద్వేష పూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఎప్పుడూ ప్రాంతీయ విద్వేషాలు రాకూడదని సీఎం జగన్ ఆలోచించారని పార్థసారథి అన్నారు.